చిత్రప్రభ 22జూలై 2010 సంచిక లొ నే రసిన వీటిపై మీ అబిప్రాయం చెబుతారు కదూ!

Advertisements
Posted in Uncategorized | 2 Comments

My article about Anupama Parameswaran in Yugabharat Dec.2017

Image | Posted on by | Leave a comment

పాటల టంకశాల మన ఘంటసాల 3-12-17

My article about Ghantasalaఘంటసాల in Harivillu ManaTelangana 3-12-17
పాటల టంకశాల మన ఘంటసాల
ఘంటసాల… ఆ పేరే చాలు మనసు పులకరించి పోవడానికి , ఆ గానమే నిరంతరం కొత్త అనుభూతులనిస్త్తూ మనసును ఏవేవో లోకాల్లో విహరింపచేయడానికి. అందుకే ఎందరికో ఆయన ఆ గానం అనుదినం గుర్తొచ్చి ఆనందింప చేయిస్తుంది. ఇంకా చాలా మందికి అనుక్షణం స్మరణకు వస్తూ పులకరింపచేస్తుంది. ఆయన ఒక సంగీత మూర్తి గా, సరస్వతీ పుత్రుడుగా అన్ని భాషా గాన ప్రియుల మదిని దోచుకోగలిగారు.గాయకుడి గా అడుగిడిన దశలో, సంగీత దర్శకుడుగా ఎదుగుతున్న క్రమంలో అప్పటి రంగ స్థల గాయక నటులు ఆరోహణ, ఆవరోహణలతో పులకరింప చేస్తూ , కొన్ని సందర్భాలలో కంఠాన్ని విభిన్న కంపనాలకు గురి చేస్తు ప్రేక్షక శ్రోతల హృదయలలో చక్కని చోటు దక్కించు
కుంటుంటే తను ఒకకొత్త దనాన్ని స్వరంలో చూపాలని , మృదువుగా, సౌమ్యంగా ,లలితంగా , సామాన్యంగానే ఆలపిస్తూ అసమాన్య గుర్తింపు తెచ్చుకుంటూ, తన ప్రత్యేకతను చాటారు ఘంటసాల వెంకటేశ్వరరావు.

తొలి దశాబ్దంలో అంటే 1944 నుంచి లలిత గీతాలు , దేశభక్తి గీతాలు, సినీ గీతాలు , పుష్సవిలాపం వంటి వాటిని పై తరహాలోనే ఆలపిస్తూ మంత్ర ముగ్ధులను చేశారు. 1951 నుంచి పాడే పాటల తీరులో మార్పు తీసుకొచ్చారు. అక్కినేని , ఎన్.టి.ఆర్ చిత్రాల్లో వారికి పాటలు పాడుతూ తను పాడే పాట ద్వారా ఎవరికి పాడుతున్నారో వినే వారికి తెలిసేలా తన స్వరంతో బేధాన్ని చూపాలని వారి స్వరాలను అనుసరిస్తున్నట్టు లేదా అనుకరిస్తున్నట్లు పాడుతూ, ఇది అక్కినేనికి పాడిన పాట, అది ఎన్.టి.ఆర్ కి పాడిన గీతం అని ప్రేక్షకులు, శ్రోతలు విన్న క్షణంలోనే గుర్చొచ్చేలా చేసారు. అలాగే హాస్య నటులకు ఎస్‌విఆర్ వంటి వారికి పాడే తీరులోను మార్పు చూపించసాగారు. తన స్వరంతో ఒక్కో దశాబ్దంలో ఒక్కో తరహాలో తన కంఠానికి పదును పెట్టి, పరిణతి వచ్చేలా గానామృతం చిలికించిన అమర గాయకుడు.

ఘంటసాలలోని ఆ ప్రతిభ కారణంగా పాటలే చిత్రవిజయానికి పునాది అవుతాయని అందరు నటులకు పాడమని సంగీత దర్శకులు, దర్శక, నిర్మాతలు ఆసక్తి ప్రదర్శిస్తూ ఒత్తిడి చేసినా తప్పని సరైనప్పుడే పాడుతూ బతుకు, బతికించు, బతుకులు పండించు అనే సిద్ధాంతానికి కట్టుబడి సహచర గాయకులు కూడా చిత్రరంగంలో ఇతోధికంగా వర్ధిల్లేందుకు తన వంతు కృషి చేయడమే గాక జీవితాంతం వరకు ఆ సూత్రాన్నే అనుసరించి మార్గదర్శి అయ్యారు. అంతే కాదు ఎందరో వర్ధమాన గాయకులు వేదికల మీద కచేరీల్లోనూ ఆయన పాటలు పాడటం ద్వారా శ్రోతలను మెప్పిస్తూ చక్కని జీవనోపాధిని పొందుతున్నారు. స్వర జ్ణానం లేని వారు కూడా వీధుల్లో , రైళ్లలో , ఇతర చోట్ల ఘంటసాల పాడిన పాటలే పాడుతూ అదే సంపాదన మార్గంగా చేసుకోవడం విశేషమే ! దేశభక్తి గురించి సత్ప్రవర్తన గురించి , తండ్రి మృదంగ వాయిద్యకారుడైన ఘంటసాల సూరయ్య చెప్పిన మాటలు జీవితాంతం గుర్తుంచుకుని అనుసరించేలా చేసాయి.

క్విట్ ఇండియా ఉద్యమంలో 1942 ఆగస్ట్‌లో పాల్గొని 18 నెలలు కఠిన కారాగార శిక్షను గుడివాడ, రాజమండ్రి, బళ్లారి జైళ్లలో ఆనుభవించారు. ఆ తరువాత దేశం క్లిష్ఠ పరిస్థితుల్లో వున్నప్పుడు సంగీత కచేరీలు నిర్వహించగా వచ్చిన ఆదాయాన్ని దేశ రక్షణ నిధికి ఇచ్చేవారు.

కృష్ణ్ణా జిల్లా పెదపులిపర్రులో మార్చి 3,1944 న ఘంటసాల కు సావిత్రితో వివాహమైన సందర్భంగా ఆయన నిర్వహించిన సంగీత కచేరీ విన్న సీనియర్ సముద్రాల మద్రాసు వచ్చేయమని చెప్పడంతో మే నెలలో మద్రాసు వెళ్లారు. ఘంటశాలను తన కొడుకులా ఆదరించి ఆవకాశాలు కల్పించే ప్రయత్నం చేయడంతో క్రమ క్రమంగా గాయకుడుగా ఎదిగారు. ఈ లోగా శ్రీసీతారామ జననం తదితర చిత్రాల్లో చిన్న వేషాలు వేసారు. బి. ఎన్. రెడ్డి రూపొందించిన స్వర్గ సీమలో భానుమతితో కలసి పాడటంతో ఘంటసాల గాయక ప్రస్థానం – అరే హాలే వెన్నెల చిరునవ్వులు విరజిమ్ము పఠాణీ … గీతంతో ప్రారంభమైంది.

గోపీచంద్ దర్శకత్వంలో శోభనాచల పతాకాన నిర్మించిన లక్ష్మమ్మ చిత్రానికి సంగీత దర్శకత్వం చేసే అవకాశం తొలిసారి వచ్చింది. ఈ చిత్రం చేస్తుండగా ఘంటసాల బలరామయ్య స్వీయ దర్శకత్వంలో అక్కినేనితో నిర్మించిన కీలుగుర్రం చిత్రానికి సంగీత దర్శకుడు అయ్యాడు. కీలుగుర్రం 19 ఫిబ్రవరి, 1949న విడుదలై చిత్రంతో పాటు పాటలు ఘన విజయం సాధించాయి. లక్ష్మమ్మ 26,ఫిబ్రవరి, 1950న విడుదలై ఆ చిత్రం పాటలు హిట్టయ్యాయి.

బాలరాజు చిత్రంలో అక్కినేనికి తొలిసారి , షావుకారు చిత్రంలో ఎన్.టి.ఆర్ కి తొలిసారి ఘంటసాల పాడారు. దేవదాసు పాటలు , మల్లీశ్వరి పాటలు ఘంటసాలకు తెచ్చిన పేరు అంతా ఇంతా కాదు. తొలి దశలో ఘంటసాల స్వరం బాగా లేదని తిరస్కరించిన హెచ్.ఎం.వి సంస్థ ఆ తరువాత అనేక పాటలు పాడించడం విశేషం. పంకజ్ మల్లిక్ , సైగల్ , మహమ్మద్ రఫీల గానాన్ని అధికంగా అభిమానించేవారు. నౌషాద్ సంగీతం , సాలురి రాజేశ్వరరావు సంగీతం అంటే చెవి కోసుకునేవారు ఘంటసాల.

కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం… శ్లోకాన్ని తొలిసారి 1956లో చింతామణి చిత్రంలో పాడారు. 1957 లో పాండురంగ మహత్యంలో పాడినప్పుడు ఇంకా వైవిధ్యం చూపారు. సప్త స్వరాలు చిత్రం కోసం 1969 లో మరో ప్రత్యేకత చూపారు. 1969 లో బుద్ధిమంతుడు చిత్రంలో పాడి కంఠంలోని తన విభిన్నత తెలిపారు.

మంచి పాటలు పాడినప్పుడు మరింత సంతోషంగా వుండటమే కాదు మొహం కళ కళలాడుతూ వుండేది. పాటలు పాడేటప్పుడు నిలబడే పాడాలి.హెచ్చు స్థాయిలో పాటలు పాడేటప్పుడు కాళ్ళు బాగా నిగడదన్ని ఒళ్ళు ఎక్కువగా బిగపట్టి పాడేవారు. క్రమ క్రమంగా ఇలాంటి హెచ్చు స్థాయిలో పాటలు పాడినప్పుడు తలనొప్పి , కాళ్ల నొప్పులు చాలా ఎక్కువగా వచ్చేవి. సాహిత్యం బాగాలేని పాటలు పాడటం ఇష్టం లేకపోయినా తప్పనిసరై జాగ్రత్తగా పాడేవారు తప్ప చెడగొట్టేవారు కాదు.

తెలుగులో 88 చిత్రాలకు మిగతా భాషల్లో 22 చిత్రాలకు ఘంటసాల సంగీత దర్శకత్వం చేసారు. ఆయన సంగీత దర్శకత్వం చేసిన సినిమాల్లో పాటలు హిట్ కావడమే కాకుండా శతదినోత్సవాలు , రజతోత్సవాలు జరుపుకునేవి. సాధారణంగా రాసిన పాటలకే బాణీలు కూర్చేవారు. తనకు ఏవైనా బాణీలు నచ్చితే వాటిని తయారు చేసి ఆ ప్రకారం రాయమని కోరడం జరిగేది అప్పుడప్పుడు.

సంగీత దర్శకుడుగా, గాయకుడుగా ప్రయోగాలు చేస్తున్నా ఇతర సంగీత దర్శకులకు పాడేటప్పుడు తాను గాయకుడు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించేవారు. వారికి పూర్తి స్వాతంత్య్రం ఇస్తూ మర్యాద, మన్నన, గౌరవం పాటించేవారే కాని, వారు చేసే పనిలో జోక్యం చేసుకునేవారు కాదు.

సాలూరి రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో యశోద కృష్ణ చిత్రంలో గుమ్మడి పాత్రకు చక్కని వాడే బలే టక్కరివాడే … పాటను సుశీలతో కలసి పాడారు. 1975 లో విడుదలైన ఈ చిత్రంలోదే ఘంటసాల చివరిపాట. పాతాళ భైరవి ,పెళ్లిచేసిచూడు, పెళ్లిసందడి, గుండమ్మకథ, జయంమనదేరా , శాంతినివాసం , మాయాబజార్ , పాండవ వనవాసం, పరమానందయ్య శిష్యుల కథ, లవకుశ ఇలా ఎన్నో చిత్రాలకు ఆయన కూర్చిన సంగీతం, ఆయన పాడిన, పాడించిన పాటలు రసగుళికలే. 4 డిసెంబర్ 1922 న కృష్ణాజిల్లా చౌటపల్లిలో జన్మించిన ఘంటసాల 11 ఫిబ్రవరి 1974 మద్రాసులో కాలధర్మం చెందారు.

Image may contain: 2 people, eyeglasses

Posted in Uncategorized | Leave a comment

సినిమా అమ్మ నిర్మలమ్మ 26-11-17

My article in Harivillu ManaTelangana 26-11-17.
సినిమా అమ్మ నిర్మలమ్మ
సాంఘిక నాటకాల్లో హీరోయిన్‌గా నటించి మంచి నటిగా రంగస్థలంపై గుర్తింపు పొంది, పౌరాణిక చిత్రాలలో నటిగా కెరీర్ ప్రారంభించి కొంత గ్యాప్ తర్వాత మళ్లీ చిత్రరంగంలోకి అడుగిడి సహాయ పాత్రలలో రాణించింది. ఆ తరువాత కేరక్టర్ ఆర్టిస్టుగా అమ్మ, అమ్మమ్మ, బామ్మ పాత్రలకు సజీవరూపం ఇస్తూ, యాసలోనూ ఆకట్టుకుని అలరించింది నిర్మలమ్మగా అందరూ ఆప్యాయంగా పిలిచే నిర్మల.

జి.నిర్మలగా సినీరంగంలో ప్రసిద్ధి చెందిన ఈమె అసలు పేరు రాజమణి. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో గంగమ్మ, కోటయ్య దంపతులకు గౌడ కుటుంబంలో 1925లో జన్మించింది. రంగస్థల నటనపై మక్కువ పెరిగి పదవ ఏట నుంచే నాటకాల్లో నటించసాగింది. అప్పట్లో ఆమె గొంతు సన్నగా (పీలగా) ఉండటంతో సతీ సక్కుబాయి నాటకంలో నటిస్తున్నప్పుడు సన్నగా వినిపిస్తున్న డైలాగ్స్‌కి ప్రేక్షకులు అల్లరి చేశారు. ఆ తరువాత కొంత అభివృద్ధి చెందింపజేసుకొని స్వరాన్ని మెరుగుపరుచుకుంది. కరవు రోజులు, నేటి నటుడు, నాటకం, దొంగాటకం నాటకాల్లోని ప్రధాన పాత్రలు పోషించి మెప్పు పొందింది.

పెళ్లికి కండిషన్:
రంగస్థల నటుడుగా, నాటక ప్రదర్శకుడుగా గుర్తింపు పొందిన జి.వి.కృష్ణారావు (తరువాత కాలంలో ప్రొడక్షన్ మేనేజర్‌గా పలు హిట్ చిత్రాలకు, భారీ చిత్రాలకు పనిచేస్తూ చిత్రరంగంలో అందరితో ప్రశంసలు పొందేవారు. నిర్మాతకు ఆర్టిస్టులకు మధ్య తగాదాలు రాకుండా సామరస్యంగా సమస్యలు పరిష్కరించేవారు) రాజమణిని చూసి ప్రేమలో పడ్డారు. తరువాత పెళ్లి చూపులకు ఆమె ఇంటికి వెళ్లినప్పుడు ఆనవాయితీ వ్యవహారాలు జరిగాక “ పెళ్లి అయిన తరువాత కూడా నాటకాల్లో నటించడానికి అభ్యంతరం పెట్టకూడదు” అనే కండిషన్ పెట్టింది. రెండు కుటుంబాల పెద్దలు నిర్ఘాంతపోయారు. ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కండిషన్ సడలించలేదు. తనకు కూడా నాటకాభిరుచి ఎక్కువగా వున్నందున జి.వి.కృష్ణారావు ఆ కండిషన్‌కి అంగీకరించారు. ఆ తరువాత ఆ దంపతులు ఉదయని నాటక సంస్థను నెలకొల్పి పలు నాటకాలు ప్రదర్శించడం, నటించడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.

కరువు రోజులు నాటకం కాకినాడలో ప్రదర్శించినప్పుడు హిందీ నటుడు పృథ్వీరాజ్ కపూర్ (హీరో, దర్శక నిర్మాత రాజకపూర్ తండ్రి, కరీనా కపూర్, రణబీర్ కపూర్‌ల ముత్తాత) చూసి రాజమణి దగ్గరకు వెళ్లి చక్కగా నటించినట్లు (హాస్య, నటుడు చలంని కూడా మరోసారి ఒక నాటకంలో ప్రశంసించారాయన) చెప్పి, మంచి నటిగా ఎదుగుతావు అని ఆశీర్వదించారు.

ఆ తరువాత కొందరు సినీ ప్రముఖుల కారణంగా వారి పిలుపు మేరకు చిత్రరంగంపై దృష్టి మళ్లింది. ఘంటసాల బలరామయ్య స్వీయ దర్శకత్వంలో నిర్మించిన గరుడ గర్వభంగం పౌరాణిక చిత్రంలో సత్యభామ చెలికత్తెగా నిర్మలకు నటించే ఛాన్స్ లభించింది 1942లో. కన్నాంబ కైకేయిగా నటిస్తూ కె.బి.నాగభూషణం దర్శకత్వంలో నిర్మించిన పాదుకా పట్టాభిషేకంలోనూ నటించింది. భర్త జి.వి.కృష్ణారావు సినిమా ప్రొడక్షన్ వ్యవహారాల్లో సహాయపడేవారు. అయితే నటిగా ఆమెకు ప్రొడక్షన్ మేనేజర్‌గా భర్తకు అవకాశాలు అంతంత మాత్రంగా ఉండటంతో ఆదాయం సరిగా లేక అప్పులు చేసేవారు. ఆ అప్పులు తీర్చడానికి ఇద్దరూ మళ్లీ నాటకరంగంపై దృష్టి నిలిపారు. కొన్నేళ్ల తరువాత ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో రూపొంది 1961లో విడుదలైన కృష్ణప్రేమ (కృష్ణుడుగా బాలయ్య, చంద్రావళిగా జమున, రాధగా ఎస్.వరలక్ష్మి, సత్యభామగా గిరిజ నటించారీ చిత్రంలో) సినిమాలో రుక్మిణిగా అవకాశం లభించింది. నటిగా ఆమె కు ప్రొడక్షన్ మేనేజర్‌గా జి.వి.కృష్ణారావుకు క్రమంగా అవకాశాలు పెరిగాయి.

అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ కుమారి నటించిన భార్యాభర్తలు చిత్రంలో అక్కినేని తల్లిదండ్రులుగా నిర్మల, గుమ్మడి నటించారు. ఈ చిత్రం హిట్ కావడంతో వీరి కాంబినేషన్లో 20 చిత్రాలు పైనే వచ్చి, నిర్మలలోని నటనను బయటపెట్టాయి. వి.మధుసూదనరావు దర్శకత్వంలో శోభన్‌బాబు, శారద, కాంచనలతో రూపొంది ఘన విజయం సాధించిన మనుషులు మారాలి చిత్రంలో కథానాయకుడు శోభన్‌బాబు తల్లిగా నిర్మల ప్రదర్శించిన నటన ఆమె నట జీవితానికి చక్కని మలుపు తిప్పి తల్లి, వదిన, పిన్ని వంటి పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయింది.
ప్రేమాభిషేకం చిత్రంలో శ్రీదేవి బామ్మగా నటించినప్పటి నుంచి బామ్మ, అమ్మమ్మ, నాయనమ్మ పాత్రలలోను ఒదిగిపోయి ఔరా అనిపించింది ప్రేక్షకులతో. ఇలాంటి పాత్రలలో సాధారణంగా తెల్లగా మెరిసిపోయే చీరకట్టి, కాస్త ఒంగొని, వీపు మీద ఒక చెయి వుంచి కర్రనో, బెత్తాన్నో పట్టుకుని మెల్లిగానో, వేగంగానో నడుస్తూ పాత్రో చితమైన డైలాగ్స్‌తో నవ్వించడమో, ఉడుక్కునేలా చేయడమో చేసేది. రంగస్థల నటిగా వివిధ ప్రాంతాలకు ప్రదర్శనల నిమిత్తం వెళ్లడం వలన, సినిమా షూటింగ్‌లకు ఔట్ డోర్‌లకు వివిధ ప్రదేశాలకు తిరగడం ద్వారా ఆయా ప్రాంతాల యాసని, వేష భాషలను ఆకళింపు చేసుకొని అవసరమైనప్పుడు ఆయా పాత్రల ద్వారా అవి వెలికి వచ్చేలా చేసి తన ప్రత్యేకతను నిర్మల చూపేది.

స్వాతిముత్యం చిత్రంలో అంతర్ముఖుడుగా నటించిన కమల్‌హాసన్ అమ్మమ్మగా అన్నీ తానై చూసుకుంటూ తన అనంతరం ఆ వెర్రి బాగులోడిని ఎవరు చూస్తారా అని ఆరాటపడుతూ, రాధిక మెడలో పుస్తె కట్టాక, అప్పటివరకు అంతర్ముఖుడికి పుణ్యం, పాపం దేవుడు వంటివి వివరించిన తన అవసరం ఇక లేదని గ్రహించి, ఆనందంతో కళ్లు మూసే పాత్ర పోషించి ప్రేక్షకులను కొన్నిసార్లు నవ్వించి కొన్నిసార్లు ఉక్కిరిబిక్కిరి చేసి ఇంతకంటే అద్భుతంగా ఎవరూ చేయలేరన్నంత భావన కలిగేలా చేసింది.

సీతారామరాజు చిత్రంలో కోట శ్రీనివాసరావు అమ్మమ్మగా హరికృష్ణ, నాగార్జున కుటుంబాలపై పగ, ద్వేషం పెంచుకొని కొన్నిసార్లు పాలిష్ట్‌గా, కొన్నిసార్లు ఉద్రేకపరిచేలా పల్నాటి నాగమ్మ తరహాలో వీర ముదుసలి పాత్రలో చేతిలో కర్రతో విలనిజం పండించింది.
గ్యాంగ్‌లీడర్ చిత్రంలో తన మనువడు చిరంజీవి చెప్పేవి వింటూ, ఫోటో ఫ్రేమ్‌లోంచి తన భర్తయే మాట్లాడుతున్నాడని తలచే మామ్మగా ఫొటోఫ్రేమ్‌లో చెప్పిన ప్రతి అంశం తు.చ. తప్పక పాటిస్తూ పొరపాటు జరిగితే లెంపలు వేసుకుంటూ హాస్యం, ఆర్ద్రత, ఆనందం వెల్లిబరిచేలా చేస్తూ ఇలాంటి అమ్మమ్మ వుంటే ఎంత బాగుంటుంది అని ప్రేక్షకులు అనుకునేలా కనిపించింది.

చినరాయుడు చిత్రంలో వెంకటేశ్ తల్లిగా పారపళ్లతో కనిపిస్తూ తన పారపళ్లను, చూసే మీ నాన్న మోహించాడు అనే భ్రమ అతనిలో కల్పిస్తూ ప్రేక్షకులను వినోదింపజేసింది. మాయలోడు చిత్రంలో రాజేంద్రప్రసాద్ బామ్మగా హాస్యాన్ని, భయాన్ని చూపించిన తీరు ప్రత్యేకమే. ఆ ఒక్కటీ ఆడక్కు చిత్రంలోనూ ఇలాంటి పాత్రతోనే మెప్పించింది.

దేవత చిత్రంలో పోకిరిగా వ్యవహరించే తన కొడుకు మోహన్‌బాబుని మంచివాడుగా మార్చా లని తాపత్రయపడేదానిగా, గొడ్డు గోదాలో చివరిది నువ్వు తీసుకుని ముందుది నాకివ్వు అని మోహన్‌బాబు అనగానే చూపిన రియాక్షన్ మరువలేం.శ్రీదేవి, చంద్రమోహన్, మోహన్‌బాబు నటించిన పదహారేళ్ల వయసు చిత్రంలో గంగమ్మగా, మంత్రి గారి వియ్యంకుడులో అన్నపూర్ణమ్మగా, శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్‌లో సుందరమ్మగా, కర్తవ్యంలో మహలక్ష్మిగా, కిల్లర్‌లో సుబ్బలక్ష్మిగా, మామగారులో కాంతమ్మగా, అమావాస్య చంద్రుడులో ఎల్.వి.ప్రసాద్ భార్యగా ప్రదర్శించిన నటన ఎప్పటికీ గుర్తుండిపోయేదే.

మావిచిగురులో కోదండరాముడు కొమ్మలాల వాడు కౌసల్య కొమరుడంట కొమ్మలాల పాటలో వృద్ధజంటగా అల్లు
రామలింగయ్యతో కలిసి చేసిన నటన చెప్పుకోదగ్గదే. గరుడ గర్వభంగంలో ఆ చిత్ర నృత్య దర్శకుడు తరువాత కాలంలో దేవదాసు, చిరంజీవులులాంటి చిత్రాల దర్శకుడు వేదాంతం రాఘవయ్యతో కలిసి చేసిన నృత్యం విశేషమైనదే.

పల్లెటూరు యాసతో, సిసలైన పల్లెటూరి స్త్రీగా, ఆ కట్టుబొట్టుతో మెప్పించడంలో నిర్మలకు సాటి రారెవరూ. నాజూగ్గా తిట్టడంలో, మొరటుగా తిట్టడంలో నూ ఆ పాత్రల ద్వారా మెప్పు పొందింది. తింగర సచ్చినోడా… నీయమ్మ కడుపు కాలా… వంటి తిట్లు నవ్వుకునేలా చేస్తాయి.
మయూరిలో ఉత్తమ సహాయ నటిగా, సీతారామరాజులో ‘ఉత్తమ కేరక్టర్ ఆర్టిస్టుగా నంది అవార్డులు స్వీకరించింది.
శంకరాభరణంలో చంద్రమోహన్ బామ్మగా శంకరశాస్త్రి ఇంటికి పెళ్లిచూపుల నిమిత్తం వెళ్లినప్పుడు శంకరశాస్త్రి (జె.వి.సోమయాజులు)ని చూడగానే ప్రదర్శించిన గౌరవం,అభిమానం, వినయ విధేయతలు, అన్నవరం గుడివద్ద ప్రసాదం విషయంలో మనవడు చంద్రమోహన్‌తో, గుడి మెట్ల మీద మరో చెంబు ప్రహసనంకి ముందు వెనుక అద్భుత అభినయం చూపింది.
బలిపీఠం చిత్రంలో శోభన్‌బాబు సోదరిగా హరిజన యువతితో కనిపించిన విధానం, పలికించిన యాస, మరదలు శారదపై చూపిన ప్రేమ తదితరం మరపురానివే.

రేలంగి నరసింహారావు దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్, రజని జంటగా, నూతన్ ప్రసాద్, అల్లురామలింగయ్య, రావికొండలరావు, పొట్టి ప్రసాద్ ప్రభృతులతో నిర్మల ఆర్ట్ పతాకాన చలాకి మొగుడు చాదస్తపు పెళ్లాం చిత్రాన్ని నిర్మించింది.
సూర్యకాంతం వలనే నిర్మలకు కూడా పేకాట అంటే ఇష్టం. షూటింగుల్లో కాస్త విరామం దొరికినా, ఔట్‌డోర్ షూటింగ్‌లకు వెళ్లినప్పుడూ కొత్త పేక దస్త్రాలు విరివిగా పట్టుకెళ్లేది. రైలులో కూడా కాలక్షేపం కోసం షూటింగ్ యూనిట్ వారిని చతుర్ముఖ పారాయణంలో పాల్గోనేలా చేసేది.

చేపల కూర బాగా వండుతుందనే పేరు వుండేది. ఆ కూర తినడానికే కొంతమంది ప్రత్యేకంగా ఆమె ఇంటికి వెళ్లేవాళ్లమనేవారు. పిండి మరకైనా విశ్రాంతి ఉంటుంది కానీ నా నోటికి తిండి విషయంలో విశ్రాంతి వుండదనేది.

కులగోత్రాలు, దేవత, ఏకవీర, యమగోల, చిల్లరకొట్టు చిట్టెమ్మ, శివరంజని, పట్నం వచ్చిన పతివ్రతలు, శుభలేఖ, బాబాయి అబ్బాయి, నాకూ పెళ్లాం కావాలి, విశ్వనాథ నాయకుడు, ఖైదీ నెం.786, మగమహారాజు, వారసుడొచ్చాడు, శివ, బావబావమరిది, మాతృదేవోభవ, రాయుడు ఇలా ఎన్నో చిత్రాల్లో చక్కని నటన ప్రదర్శించింది. 2009న ఫిబ్రవరి 19న అనారోగ్యంతో మృతిచెందింది.

Image may contain: 1 person, selfie and closeup

Posted in Uncategorized | Leave a comment

పాత్రేదైనా యాస తన(రమ ణారెడ్డి)దే 19-11-17

My article in Harivillu ManaTelangana 19-11-17.
పాత్రేదైనా యాస తనదే..
గిలిగింతలు పెట్టే హాస్యానికి, కడుపుబ్బ నవ్వించే కామెడీకి , పౌరాణిక పాత్రల పోషణకు సైతం తన యాసలోనే డైలాగ్ చెప్పడానికి అతడు పెట్టింది పేరు. విలన్ గాను హాస్యం పండించడంలోను, క్యారెక్టర్ రోల్స్‌లోను ఇమిడిపోతూనే తన మేనరిజాలతో మెప్పించి తనివితీరా నవ్వించడంలోను అతడికి అతడే సాటి. అతడే సన్నగా పొడవుగా రివటలా కనిపిస్తూ అన్నింటా అసాధ్యుడనిపించే రమణారెడ్డి. హాస్యనటుడు గానే కాదు మేజిక్ ప్రదర్శనలతో ఔరా అనిపిస్తూ ప్రేక్షకులను నవ్వించడంలోను ప్రత్యేకమే !

నెల్ల్లూరు జిల్లాలోని జగదేవపేటలో 1.10.1921న తిక్కవరపు కోటమ్మ, సుబ్బారెడ్డి దంపతులకు వెంకట రమణారెడ్డి జన్మించారు. రైతు కుటుంబం. విఆర్ కాలేజీలో ఇంటర్ చదువు పూర్తవ్వగానే నెల్లురులోనే శానిటరి ఇన్స్‌పెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించేవారు. సర్వోదయ పతాకాన తెలుగు,తమిళ భాషల్లో వై.వి రావు దర్శకత్వంలో మానవతి చిత్రాన్ని సి.హెచ్. నారాయణరావు, ముక్కామల, జి.వరలక్షి, జూనియర్ శ్రీరంజనిలతో 1951లో ప్రారంభించారు. తమ నెల్లూరు ప్రాంతానికి చెందిన రమణారెడ్డిని నటుడుగా పరిచయం చేయాలని వై.వి రావు, ఎ. శంకర్ రెడ్డి (నిర్మాతగా చరణదాసు, లవకుశ వంటి విజయవంతమైన చిత్రాలు తీశారు ) నిర్ణయించి, అవకాశం ఇచ్చారు. కె.ఎస్ ప్రకాశరావు స్వీయ దర్శకత్వంలో రూపొందిన దీక్ష చిత్రంలోను నటించే అవకాశం వెంటనే లభించింది.దీక్ష చిత్రం ముందుగా అంటే 1951లోను ,మానవతి ఆ తరువాత 1952 లో విడుదలయ్యాయి. బంగారు పాప,మిస్సమ్మ, చరణదాసి చిత్రాలతో రమణరెడ్డికి నటుడిగా మంచి పేరు వచ్చింది.

బంగారు పాప (ఎస్.వి. ఆర్ కి కూడా మంచి పేరు తెచ్చిన చిత్రం)లో ముక్కుతో స్వరం వచ్చినట్లు గా మాట్లాడిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. మిస్సమ్మ చిత్రంలో అప్పు ఇచ్చే డేవిడ్ గా సావిత్రిని ప్రేమించి ఆమె ప్రేమ కోసం ఆరాటపడే వాడిగా విలనిజం చూపడం, ఆమెను ,ఆమె తల్లి దండ్రులను వేదనకు గురి చేసిన తీరులో హాస్యం కూడా కలగలపడంతో అలరించింది.చరణదాసిలో ద్విపాత్రాబినయం చేసాడు హాస్యనటుడుగా.అప్పు చేసి పప్పుకూడు లో డబ్బునే లోకంగా భావించే మావగా,మాయబజార్ లో ఘటోత్కచుని పరివారానికి గురువైన చిన్నమయ్యగా, గుండమ్మ కథలో ఘంటయ్యగా నటించిన విధానాల వల్ల తిక్కవరపు వెంకట రమణారెడ్డికి ఇటు ప్రేక్షకలోకం , అటు చిత్ర సీమ నీరాజనాలు అర్పిస్తూండటంతో మంచి గుర్తింపు వచ్చింది.

మాయబజార్‌లోని చిన్నమయ్య పాత్ర పోషణలోను నెల్లూరు మాండలికం విడిచిపెట్టకుండా తన మాయలతో, ఇతర విన్యాసాలతో ఆ పాత్రకు ప్రత్యేకత ఆపాదించారు. పెళ్లినాటిప్రమాణాలులో సలహాల్రావుగా ఛాయాదేవి భర్తగా నటించి మెప్పించారు. సువర్ణ్ణసుందరి, గుండమ్మ కథ, పూజాఫలం, గుడిగంటలు తదితర చిత్రాలతో ప్రత్యేక తరహాలో విలనిజం కూడా హాస్యానికి కలగలిపి ఆకట్టుకున్నారు. రోజులు మారాయి , దీపావళి చిత్రాలలోను తండ్రి పాత్రని కరుణరస ప్రధానంగా పోషించారు.

కంచుకోటలో దళపతిగా, వీరకంకణంలో మహరాజు పాత్రలో , అగ్గిబరాటాలో మంత్రాల బసవయ్య గా గుర్తింపు తెచ్చుకున్నారు. చిట్టి తమ్ముడులో జయలలిత తల్లి సంధ్య భర్తగా, పంతాలు పట్టింపులులో హార్మోనిస్టుగా ప్రతిభ చూపారు. రేలంగి-, రమణారెడ్డి కాంబినేషన్ కి ,రమణారెడ్డి, సూర్యకాంతం కాంబినేషన్‌కి మంచి పేరుండేది. వీరు కనిపిస్తే ప్రేక్షకులు గుక్క తిప్పుకోకుండా నవ్వుకునేవారు. అందుకే పంపిణీదార్లు కూడా నిర్మాత దర్శకులకు ఈ కాంబినేషన్ గురించి ఒత్తిడి చేసేవారు.

ఇల్లరికం చిత్రంలో రమణారెడ్డి ,రేలంగి మామాఅల్లుళ్లుగా చేసిన సందడి అంతా ఇంతా కాదు. డబ్బులేని అల్లుడు తన ఇంట్లో అన్నం తింటుంటే కారం కలుపుతాడు. అది చూసిన రేలంగి బల్లి… మావయ్య… అని కంగారు పెడతాడు. రమణారెడ్డి దృష్టి మళ్లగానే భోజనం ప్లేటు మార్చేస్తాడు రేలంగి. తను కలిపిన కారంతో అన్నం తిని గోలగోల చేయడం, నీళ్లు తెస్తానంటూ రేలంగి వెళ్లి కుండలో నీళ్లు తెస్తూ బద్దలు కొట్టడంతో రమణారెడ్డి చూపిన హావభావాలు మరుపురావు.

పేరు తెచ్చిన పాటలు:
సువర్ణసుందరి చిత్రంలో రేలంగితో కలిసి ఏరా మన తోటి గెలిచే వీరులెవ్వరురా రణ శూరులెవ్వరు రా… పాటలో చూపిన అభినయం, కులగోత్రాలు చిత్రంలో పేకాట పిచ్చోడుగా నటించిన రమణారెడ్డి పై చిత్రీకరించిన అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే ..జేబులు ఖాళీ ఆయెనే ఉన్నది కాస్త వూడింది సర్వ మంగళం పాడింది. … పాటలో కండువ తలమీద వేసుకుని నటించిన తీరు ఆకట్టుకుంది. రేలంగి కూడా సముదాయించడం రమణారెడ్డి ఎన్నో రకాలుగా వాపోవడం విశేషం.

మా ఇంటి మహాలక్ష్మిలో ప్లీడరు గుమస్తాగా నటించారు. వితంతువైన ప్లీడరు కూతురు ప్రేమలో పడిన ప్లీడరు గుమస్తా కనుక అలాంటి పదాలు వాడుతూ ఆరుద్ర రాసిన నువ్వంటేనే నాకు మోజు అలా రాసిస్తానే దస్తావేజు…
నీ మనసు నీ హృదయం ఎక్స్‌పార్టీలై తీసుకున్నాయి డిక్రీ నాపై… పాటలో చూపిన నటన ఆకట్టుకుంటుంది.
అక్కా చెల్లెళ్లు చిత్రంలో మెజీషియన్ పాత్ర పోషించారు.ఒక అమ్మాయి మీద ప్రేమలో పడతాడు. ఈ సందర్భంలో రమణారెడ్డిపై ఇండియాకు రాజధాని ఢిల్లీ నా గుండెల్లో ప్రేమరాణి లిల్లీ … అంటూ చిత్రీకరించిన గీతంలో చక్కని నటన చూపారు. పదండి ముందుకు చిత్రంలో గారడివాని పాత్ర పోషించారు. జైలులోని దేశ భక్తులను తప్పించటానికి పోలిసులపై ట్రిక్కులు చేస్తుండగా ఆయనపై చిత్రీకరించిన తమాషాదేఖో తస్సాదియ్యా కనికట్టు సేస్తాం సూడవయ్య అరె మంత్రం తంత్రం మాయ మర్మం మై మరిపిస్తా రారా భయ్యా చేతిలోన లాఠీ మెడలోన పట్టీ…. పాటలో చేసిన గారడీలు ఆకట్టుకుంటాయి.

మరో చిత్రంలో పాముల వాడిగా మాది పేరు ఖాదర్ పాషా
దేఖో భాయీ ఏక్ తమాషా … అంటూ పాడుతూ చూపిన నటన కూడా గమ్మత్తుగా వుంటుంది. మరో చిత్రంలో నువ్వు నేను జట్టు నా లవ్వు మీద ఒట్టు అంటూ కిశోర్ కుమార్ తరహా యుడిలల యుడిలో … అని చూపిన నటన, కాంతారావు తమ్మయ్యా తమ్మయ్యా మాట నేర్చిన చిలుకా మర్మమైన చిలుకా మాటు వేసి దాన్ని పడతావు తమ్మయ్య గూటిలోన నువ్వు పడతావు… అని పాడుతూ హెచ్చరించడం ఆకట్టుకుంటుంది. అంతస్థులు చిత్రంలో వీధి గీతంగా భానుమతి దులపర బుల్లోడా దుమ్ము దులపర బుల్లోడా… గీతంలో రమణారెడ్డి నటన బాగుంటుంది.

రమణారెడ్డికి మేజిక్ అంటే ఇష్టం. సినిమాల్లోకి వచ్చిన తరువాత కూడా మేజిక్ విద్య మీద దృష్టి పెట్టి కొందరి దగ్గర అభ్యసించారు. అన్నా చెల్లెళ్లు చిత్రంలో మెజీషియన్ పాత్ర పోషించే సందర్భంలో ఎం. శేషాద్రి మెజీషియన్ వద్ద ప్రత్యేక శిక్షణ పొందారు. రచయిత ఆరుద్రకు మేజిక్ లో ప్రవేశం బాగా వుంది. అందుకనే ఇద్దరు కలిసి కొన్ని ఊళ్లలో స్టేజీ మీద ప్రదర్శనలు ఇచ్చారు. రమణారెడ్డి విడిగా అనేక ప్రదర్శనలు యిచ్చి ఆకట్టుకున్నాడు.

గాలి లోంచి వస్తువులను రాబట్టడం, బ్లేడులు జనానికి చూపించి వాటిని మింగేసి మళ్లీ వాటిని బైటికి తీయడం తన దగ్గర అసిస్టెంట్‌ని గాలిలో తిప్పడం వంటి గమ్మత్తులతో తన మేజిక్ ప్రదర్శనలకు విశేష ఆదరణ లభించేలా చేసేవారు. తన సరదా తీర్చుకోవడానికి, ప్రజలకు సాయంచేసే సామాజిక సంస్థలకు ధన సహాయం చేయడానికి ఆ సంస్థల వద్ద దారి ఖర్చులు మాత్రమే తీసుకుని పలు ప్రదర్శనలు యిచ్చేవారు.

సినిమా షూటింగ్ బ్రేక్‌లలో కూడా సహాయ నటులను ఉత్సాహపరచడానికి మేజిక్‌లు చేసేవారు.మద్రాసులో సినిమా ఆర్టిస్టుగా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, ఆ తరువాతషూటింగ్ లు లేని విరామ సమయాల్లో పాండీ బజార్లో ఒక చెట్టు కింద కాలక్షేపం చేసేవారు. సి.ఎస్.ఆర్ కూడా ఒక చెట్టు దగ్గర కబుర్లు చెప్పేవారు. అందుకే వాటిని రమణారెడ్డి చెట్టు, సి.ఎస్. ఆర్ చెట్టు అని పిలిచేవారు. కాఫీలు తాగుతూ, సిగరెట్టు కాలుస్తూ సినిమా కబుర్లు లోకాభి రామాయణం ముచ్చటించేవారు సహనటులతో.

ఈ కారణంగా సినీ అభిమానులకు కూడా వీరిని అక్కడ మేకప్ లేకుండా చూసే అవకాశం లభిస్తూండేది. ఈ సాంప్రదాయం 1992 వరకు మద్రాసు పాండీ బజారులో ఆర్టిస్టులు శ్రీధర్, పొట్టి ప్రసాద్, చిట్టిబాబు వగైరా కొనసాగించారు.

సినిమా అవకాశాలు నటుడుగా అంతంత మాత్రంగా లభించే రోజుల్లో ఖాళీగా వుండటం ఎందుకని డబ్బింగ్ ఆర్టిస్టుగాను రమణారెడ్డి వ్యవహరించారు. చాలా సార్లు డబ్బింగ్ ఉచితంగా చెప్పాల్సివచ్చేదట. మా తదుపరి చిత్రంలో నీకు మంచి వేషం వుందయ్య అని నిర్మాత అనగానే డబ్బు మాట ఎత్తేవారు కారు. అలా చాలా సందర్భాల్లో నష్టపోయారు కూడా. నిజ జీవితంలో సౌమ్యంగా వుండటం, గట్టిగా మాట్లాడక పోవడం, ఎవరినీ పల్లెత్తు మాట అనక పోవడం ఆయన లక్షణాలు.

గొంతుక్కూచోవడం , నిల్చున్నచోటనే గుబుక్కున కింద పడిపోవడం, ఉన్నట్టూండి ఎగరడం, గాలిలో తేలిపోతున్నట్టుగా నడిచే విధానం వంటి మేనరిజాలతో వెండితెరపై ఉత్సాహపరిచేవారు.పాండవ వనవాసం, ఆత్మబలం, దాగుడుమూతలు, అంతస్తులు ,మనషులు మమతలు, సత్యహరిశ్చంద్ర, రహస్యం, నిన్నేపెళ్లాడుతా, ముద్దుబిడ్డ, అత్తా ఒకింటికోడలే, ఉయ్యలా జంపాల, ఈడు జోడు ఇలా రెండు వందలకు పైగా చిత్రాలలో తన నటనతో అలరించారు. 11.11.1974 న మృతి చెందారు.

Image may contain: 2 people, people smiling, closeup

Posted in Uncategorized | Leave a comment

సుస్వరాల సుశీల Dt.12-11-17

My article in Harivillu ManaTelangana 12-11-17
సుస్వరాల సుశీల
పాటను అర్థం చేసుకుని భావంలో లీనమై పరవశం చెందుతూ పాడటం పి. సుశీల ప్రత్యేకత. అందుకే ఏ భాషలో పాడినా ప్రశంసలే. పాట వింటుంటే ఆ పాట సుశీల పాడుతున్నదనే కాకుండా ఏ కథానాయికకు పాడుతోందో కూడా అభిమానులు గుర్తించేలా చేసే మ్యాజిక్ కూడా ఆ స్వరంలో ఉంది. అందుకే ఆమెను గాన కోకిల అన్నారు. సంగీత సరస్వతి గా గుర్తించారు. తండ్రి శాస్త్రీయ సంగీత విద్వాంసురాలిని చేయాలని విజయనగరంలో ప్రయత్నిస్తే శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటున్నా లలిత గీతాల ఆలాపన పైనే మక్కువ చూపేవారు. తర్వాత సినీరంగంలో సుస్థిరస్థానం సంపాదించుకున్నారు.

విజయనగరంలోని సంపన్న కుటుంబానికి చెందిన పులపాక శేషావతారం , ముకుందరావు బ్రాహ్మణ దంపతులకు 1935 నవంబర్ 13న జన్మించింది. తండ్రి న్యాయవాదిగా పేరు ప్రతిష్టలు ఆర్జిస్తూ కళల మీద కూడా ఆసక్తి పెంచుకున్నాడు. తండ్రి వీణ వాయించడంలో నిష్ణాతుడైతే తల్లికి సంగీతంలో మక్కువ. అందుకే శాస్త్రీయ సంగీత విద్వాంసురాలిని చేయాలని విజయనగరంలోని ద్వారం వెంకట స్వామినాయుడు వద్ద అయిదేళ్లకు పైగా శిక్షణ ఇప్పించారు. విజయనగరం మహారాజ కళాశాలలో సంగీతంలో డిప్లొమో కూడా అందుకున్నారు. ఆంధ్రదేశమంతటా కచేరీలు చేస్తూ గుర్తింపు తెచ్చుకోసాగారు. అప్పుడే మద్రాసు మ్యూజిక్ అకాడెమీలో కోర్సు చేయాలని తలచి తండ్రి అనుమతితో మద్రాసు చేరారు 1949ప్రాంతంలో . రేడియోలో పాటలు పాడే అవకాశం కూడా దక్కింది.

కె.ఎస్. ప్రకాశరావు స్వీయ దర్శకత్వంలో కన్నతల్లి చిత్రాన్ని నిర్మిస్తూ పెండ్యాల నాగేశ్వరరావుని సంగీత దర్శకుడుగా ఎంపిక చేశారు. జి. వరలక్ష్మి, ఆర్. నాగేశ్వరరావు జంటకు అక్కినేని నాగేశ్వరరావు, నంబియార్ ఆచిత్రంతో కుమారులు. ఈ చిత్రంలోని పాటలకు గ్రూప్ సింగర్స్‌గా పదిమందిని పంపమని పెండ్యాల కోరితే పిల్లల ప్రోగ్రాం చేసే న్యాపతి రాఘవరావు (ఈయనకు రేడియో అన్నయ్యగా గుర్తింపు చాలా వుండేది) పంపిన పదిమందిలో సుశీల కూడా ఉన్నారు. సుశీల స్వరం విన్న పెండ్యాల తొలుత భాగవతంలోని రెండు పద్యాలు పాడించారు.

యక్షగానంచ గ్రూప్ సాంగ్‌లో కూడా పాడించి సుశీల గాన మాధుర్యానికి పులకించి శ్రీశ్రీ, ఆరుద్ర కలిసి రాసిన ఎందుకు పిలిచావెందుకు…..అనే పాటను ఎ.ఎం. రాజాతో కలిపి పాడించి యుగళగీతంగా రికార్డ్ చేశారు. సౌండ్ ఇంజినీర్ నాగరాజ్ ద్వారా సుశీల గురించి తెలుసుకున్న ఎ.వి.ఎం సంస్థ అధినేత చెట్టియార్ సుశీలను పిలిపించి ఎ.వి.ఎం కి మాత్రమే పాటలు పాడేలా మూడేళ్ల అగ్రిమెంట్‌ని జీతం ప్రాతిపదికన రాయించుకున్నారు. ఎ.వి.ఎం తో పాటరికార్డింగ్ జరుగుతూంటే విన్న దుక్కిపాటి మధుసూధన్‌రావు, కె.వి.రెడ్డి తాము రూపొందించే దొంగరాముడు చిత్రానికి పాటలు పాడించాలని నిర్ణయించుకుని అగ్రిమెంట్ అడ్డువస్తుందని తెలిసి చెట్టియార్‌తో సంప్రదింపులు జరిపి రద్దు చేసి స్వతంత్ర గాయనిగా చేశారు. దొంగరాముడు చిత్రం కోసం భలే తాత మన బాపూజీ, బాలల తాత బాపూజీ….అనురాగం విరిసేనా ఓ రే రాజా…. తెలిసిందా బాబూ…గీతాలను సుశీలతో 1954లో పాడించారు. దొంగరాముడికి పాడిన పాట రికార్డింగ్ థియేటర్‌లో విన్న చక్రపాణి లతామంగేష్కర్ పాడిందని అనుకుని వివరాలు తెలుసుకుని మిస్సమ్మలో పాడించేశారు. బృందావనమది అందరిదీ….బాలనురా మదనా…అని సుశీల పాడిన మిస్సమ్మలోని పాటలు ఆదరణ పొందాయి. మిస్సమ్మ ముందు అంటే 1955 జనవరిలో, దొంగరాముడు అక్టోబర్ 1955లో విడుదలయ్యాయి. పాటలు హిట్ కావడంతో సుశీలతో పాడించాలని దర్శక నిర్మాతలు ప్రయత్నించేవారు.

ఎ.ఎం.రాజాతో పాటలు పాడటం ప్రారంభించిన సుశీల క్రమక్రమంగా ఘంటసాల, పి.బి. శ్రీనివాస్ , ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం , రామకృష్ణ, ఆనంద్ ఇలా పలువురి గాయకులతో కలిసి పాడుతూ అలరించసాగారు. తెలుగులో ఇప్పటివరకు 12000కి పైగా , తమిళంలో ఏడువేల పాటలు, కన్నడం, మలయాళ భాషల్లో అయిదువేల పాటలు వంతున, హిందీలో అయిదు వందలకు పైగా పాటలు పాడారు. సంస్కృతం, సింహళీస్ భాషల్లోనూ పాడారు. ఏభాషలో పాడితే ఆ భాష తన మాతృభాష అయినట్లుగా గళం సరిచేసుకునేవారు. వివిధ భాషా చిత్రాల్లో బిజీ అయిపోతున్న సుశీలకు ఘంటసాల ఆ రోజుల్లో ఎంతో స్వేచ్ఛ ఇచ్చి, ఆమె చోట్ల పాడే అవకాశం కల్పించేవారు. సినిమా పాటలే కాకుండా వివిధ భాషల్లో భక్తి గీతాలను ఆలపించి అలరించారు. మొత్తం మీద 40 వేలకు పైగా గీలాలు ఆలపించారు వివిధ భాషల్లో.

బాలసుబ్రహ్మణ్యంతో తొలిసారి శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న చిత్రంలో 1966వ సంవత్సరం చివర్లో ఎస్.పి. కోదండపాణి సంగీత సారధ్యంలో ఓ ఏమి ఈ వింత మోహము ఆహా ఏమి కలవరము..పాడిన సుశీల ఆయనతోనే మూడు వేల యుగళ గీతాలు వివిధ భాషల్లో పాడారు. అలా సినిమాలకు సంబంధించి యుగళగీతాల చరిత్రలో ఈ ఇద్దరూ రికార్డు నెలకొల్పారు.

పన్నెండు భాషల్లో 17695 పాటలు పాడిన గాయనిగా గిన్నిస్ బుక్ రికార్డ్ లో స్థానాన్ని నెలకొల్పారు. ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్‌లో మార్చి 2016లో గాయనిగా రికార్డ్ నెలకొల్పారు. భావాన్ని దృష్టిలో పెట్టుకొని రక్తి కట్టించేలా ఎలా పాడలో ఘంటసాల నేర్పించారని, క్లిష్టమైన సంగతులు జొప్పిస్తే ఎలా పాడి మెప్పించాలో సాలూరి రాజేశ్వరరావు పాడితే విని నేర్చుకుని అభివృద్ధి చెందానని అంటారామె. అన్ని భాషల్లో అందరు సంగీత దర్శకుల అభిమానం పొందటమే కాక, వారి నుంచి ప్రశంసలు పొందారు. గాయనిగా గుర్తింపు తెచ్చుకున్న సుశీల గాయనీ గాయకులను ప్రతి యేడూ సత్కరించాలని పి. సుశీల ట్రస్ట్‌ని 2008లో ఏర్పాటుచేశారు. జాతీయ అవార్డు నెలకొల్పి అక్కినేనితో. స్ఫూర్తి చెందే ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసి జాతీయ అవార్డుగా నెలకొల్పి తొలి అవార్డుని సహచర గాయని ఎస్. జానకికి హైదరాబాద్ రవీంద్రభారతిలో బాలమురళీకృష్ణ, కె. రోశయ్య చేతుల మీదుగా 2008, నవంబర్ 13 అందజేశారు. లక్ష రూపాయల చెక్కు జ్ఞాపిక ఈ అవార్డుగా నెలకొల్పారు.

విజయనగరం వాసి అయిన మోహనరావు మద్రాసులో డాక్టర్ కోర్స్ చదువుతూంటే పరిచయమై ఆమె పాటల అభిమాని కూడా కావడంతో ప్రేమించి 1957 లో పెళ్లి చేసుకున్నారు. గుండె జబ్బు కారణంగా అమెరికా తీసుకెళ్లి ఆపరేషన్ చేయించిన కొద్ది రోజులకే 1990 ఏప్రిల్ 29 న ఆయన అమెరికాలో మృతి చెందాడు. సంగీతంలో సూచనలిచ్చే భర్త ఎడబాటుతో కొంతకాలం పాటలకు దూరం అయ్యారు.

సమగ్ర ఆంధ్ర సాహిత్య రచన కోసం సినిమా గీతాలు మానేసి, అది 1991లో పూర్తి చేసి , కిడ్నీ వ్యాధి వచ్చి కోలుకున్న ఆ మధ్య మళ్లీ పెళ్లి పుస్తకం కోసం శ్రీకారం చుట్టుకుంది పెళ్లిపుస్తకం ఒక ఆకారం దాల్చుతుంది కొత్తజీవితం …అని రాశారు. అలా ఈ పాట పాడటంతో రెండోసారి గాయినిగా మళ్లీ కొత్త జీవితం ప్రారంభించి, తనను దృష్టిలో పెట్టుకుని ఆ పాట రాసారని భావించారు. చక్రవాకంలో తను పాడిన వీణలోనా..తీగలోనా..ఎక్కడున్నదీ రాగం తనకు చాలా ఇష్టమైన పాట అని చెప్పే సుశీల తను పాడిన ప్రతి పాట తనకు ఇష్టమే అంటారు.

మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగె… హృదయపు కోవెలలో..చీరలెత్తుకెళ్లాడే చిన్ని కృష్ణుడు..సోగ్గాడే చిన్నినాయనా.,..పాడనా తెలుగుపాట పరవశమై…అన్నయ్య కలలే పండెను…అందలం ఎక్కాడమ్మా…పిలువకురా అలుగకురా…చందన చర్చిత… తనువా హరిచందనమా…నాపాటనీ నోట పలకాల సిలకా…వస్తాడమ్మా నీదైవమూ…రివ్వున సాగే రెపరెపలాడే…హల్లో ఇంజినీర్…సంతోషం చేసుకుందాం…ఇలా ఎన్నో పాటలతో మురిపించారు.

Image may contain: 1 person, smiling, plant and outdoor

Posted in Uncategorized | Leave a comment

మన షెల్లీ దేవులపల్లి

My article in Harivillu ManaTelangana 29-10-17
మన షెల్లీ దేవులపల్లి

భావ కవిత్వాన్ని వాడుకలోకి తీసుకొచ్చిన వ్యక్తి , సినిమా పాటల్లో కూడా భావ కవిత్వాన్ని అధికంగా జొప్పించిన కవి, తేటతెలుగు పదాలతో అద్భుతమైన సినిమా పాటలు అందించిన మన షెల్లీ దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఆత్మ తృప్తి కోసం అనేక పాటలు రాసేవారాయన. భావ కవితా ప్రచారకుడుగా, రాగ భరితంగా అందరి కవుల పాటలు పాడే వ్యక్తిగా , ఉపన్యాసాలతో వూరించే దిట్టగా దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రికి పేరుండేది. ఆకాశవాణి ( ఆల్ ఇండియా రేడియో) లో పనిచేస్తూ అనేక సంగీత రూపకాలు, లలిత గీతాలు, వచన కవితలతో శ్రోతలను తన్మయుల్ని చేసేవారు. శ్రీశ్రీతో ప్రేరణ చెంది అనేక మంది కవితా వ్యాసంగంలోకి అడుగిడితే, కలం పట్టిన ప్రతి కవీ కృష్ణశాస్త్రి కవత్వాకర్షణకు లోనైనవారే అని శ్రీశ్రీ తరచూ ప్రస్తావించేవారంటే విశేషమే కదా!

తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం వద్ద గల చంద్రపాలెంలో సంస్కృత పండితులుగా, కవులుగా పేరున్న తమ్మన శాస్త్రి దంపతులకు 1897 నవంబర్ 1న జన్మించారు. పెద తండ్రి సబ్బరాయశాస్త్రి , తండ్రి కలిసి దేవులపల్లి కవులుగా పేరొందినవారు. కృష్ణశాస్త్రి ఇద్దరిలోని జ్ఞానాన్ని ఆకళింపు జేసుకుని పదవ ఏడు రాకుండానే పద్యాలు రాసేవారు. విజయనగరం కళాశాలలో బి.ఏ., పూర్తి చేసాక ఉపాధ్యాయుడుగా, కాకినాడ పిఆర్ కళాశాలలో ట్యూటర్‌గా పనిచేశారు. 1929లో కలకత్తాలోని శాంతినికేతన్‌లో రవీంద్రనాథ్ ఠాగూర్‌తో జరిపిన ముచ్చట్లతో కృష్ణశాస్త్రి కవితా ధోరణిలో చాలా మార్పులు వచ్చాయని సన్నిహితులు చెప్పేవారు. హరిజనోద్ధరణకు కృషి చేశారు. బ్రహ్మసమాజం పట్ల ఆకర్షితులయ్యారు. ఆ సమాజం వారి కోసం రాసిన పాటల్లో జయము జ్ఞాన ప్రభాకరా జయము కాంతి సుధాకరా…అనే గీతం ఆ సమాజం ప్రార్థనా గీతం అయింది.

అష్టావధానంతో పదహారవ ఏటనే అలరించారు. కృష్ణపక్షం కావ్యం 1925లో విడుదలైన తర్వాత ప్రశంసలే ప్రశంసలు. కన్నీరు ఖండకావ్యం భార్య మృతి తర్వాత వెలువరించారు. ప్రవాసము, ఊర్వశి, శర్మిష్ఠ, కృష్ణాష్టమి, ధనుర్దాసు, గౌతమి, క్షీరసాగర మథనం, విప్రనారాయణ, బహుకాల దర్శనం, పుష్పలావికలు ఇలా పలు రచనలతో ఎంతో మందిని ఆకట్టుకున్నారు.

దర్శక నిర్మాత బి.ఎన్. రెడ్డికి 1941లో పరిచయమయ్యారు. బి.ఎన్. రెడ్డి కూడా శాంతినికేతన్‌లో కొంతకాలం వుండి ఆలోచనల్లో పరిపూర్ణత సాధించారు. కృష్ణశాస్త్రి భావ పటిమ గుర్తించి సినీరంగంలోకి తీసుకురావాలని అనేక మార్లు ప్రయత్నించారు బి.ఎన్.రెడ్డి. ఆల్‌ఇండియా రేడియోలో పనిచేసే, స్వతంత్ర ప్రతిపత్తి కోరుకునే కృష్ణశాస్త్రి అయిదేళ్ల పాటు ప్రతిఘటించారు. పట్టబట్టిన బి. ఎన్ .రెడ్డి మద్రాసుకు రప్పించి, తను కష్టపడుతూ ఆయననూ కష్టపెట్టి మల్లీశ్వరి చిత్రానికి రచన చేయించారు.

సాలూరు రాజేశ్వరరావు సంగీత సారధ్యంలో ఆ చిత్రంలోని కృష్ణశాస్త్రి రాసిన అన్ని పాటలూ ఆణిముత్యాలే అయ్యాయి. ఇప్పటికీ అదే ప్రాశస్తాన్ని పొందుతున్నాయి. ఇక ముందూ అలాగే గుర్తుండిపోయే తేటతెలుగు పాట అని ఆ చిత్రానికి ఆయన రాసిన సంభాషణలూ అద్భుతమే. కృష్ణశాస్త్రి ఆ తర్వాత రాసిన అనేక పాటలతో కూడా కావ్యగౌరవం సమకూరడం సినీ చరిత్రలో ఒక విశేషం. ఉత్తమ అభిరుచితో చిత్రాలు తీయాలనే సంకల్పంతోనే దర్శకనిర్మాతగా మారి వాహిని సంస్థని రూపొందించిన బి.ఎన్.రెడ్డి పట్టుబట్టి కృష్ణశాస్త్రి తో సినిమాలకు రాయించాలని 1941 నుంచి ప్రయత్నిస్తే 1951తో చివర్లో మల్లీశ్వరి చిత్రం విడుదలై పదేళ్ల బి.ఎన్.రెడ్డి శ్రమ ఫలించి ప్రేక్షకులకు శ్రోతలకు కవులకు అద్భుత రసానుభూతిని కలిగించాయి. మొదటి చిత్రంతో అంతటి పేరు ప్రతిష్టలు రావడం రచయితల్లో కృష్ణశాస్త్రికే దక్కింది.

భక్తిగీతాలు రాసినా , ప్రణయ గీతాలు రాసినా, విరహగీతాలు రచించినా విషాద గీతాలు పలికించినా దేశభక్తి గీతాలు , ప్రకృతి అందాలు లలితంగా పలికింపజేసినా చిన్ని చిన్ని పదాల్లో పెద్ద అర్థాలను , అలౌకిక ఆనందాన్ని కలిగించేలా రాయడమే కృష్ణశాస్త్రిలోని ప్రత్యేకత. అందుకే ఆయన పలువురు కవులకు , సినీ దర్శకులకు ప్రియ బాంధవుడు, ఆరాధనీయుడు అయ్యారు.

మొత్తంమీద ఆయన రాసినవి 75 సినిమాలకే. అవి కూడా అన్ని కలిపి 170 పాటలే. వీటిలో 95 శాతం పాటలు ఆణిముత్యాలే. మల్లీశ్వరి తర్వాత జెమినీ వారి రాజీ నా ప్రాణం, నాగయ్య నిర్మించిన నా యిల్లు, నరసూ సంస్థ నిర్మించిన రాజగురువు ఇలా అతి తక్కువ చిత్రాలకు మాటలుకూడా రాసి ఆ తర్వాత పాటలకూ, రేడియోకు పరిమితమయ్యారు. కనిపించిన చిన్న చిన్న కాగితాల మీద కూడా గుర్తుకొచ్చిన భావన రాసేసి జాగ్రత్త పెట్టుకోడం, తప్పనిసరై రాసే సమయం లేకుంటే , నోటితో చెబుతూంటే బాలాంత్రపు రజనీకాంతరావు, కురిమిళ్ల వెంకటరావు వంటివారు వాటిని రాసి రేడియో ప్రోగ్రాంకి అందేలా చేసేవారు.

ఏదో బెదురు, భయం, వల్లమాలిన బద్ధకం తనకు ఉండేవని అందరితో గమ్మున కలవనీకుండా ఇవి అడ్డుపడేవని, జమీందారీ మనుష్యుల సహవాసం కూడా ఇందుకు కారణమై ఉంటుందని కృష్ణశాస్త్రి పేర్కొనేవారు. బెజవాడ గోపాలరెడ్డి, నార్ల వెంకటేశ్వరరావు, ఎం.ఆర్. అప్పారావు, ఎస్.బి.పి. పట్టాభి రామారావు, పాలగుమ్మి పద్మ రాజు , కాటూరి వెంకటేశ్వరరావు, దొడ్ల రామచంద్రారెడ్డి, బాలాంత్రపు నళినీకాంతరావు ఇలా ఎందరో ప్రముఖులకు ఆత్మీయ మిత్రుడుగా కొనసాగారు కృష్ణశాస్త్రి.

పాటైన కుశల ప్రశ్నలు
కవిగా, ఉపన్యాసకుడుగా,గాయకుడుగా ఆకట్టుకునే ఆయన కంఠానికి 1964 ఏప్రిల్‌లో బొంగురుదనం వచ్చింది. గొంతు సవరించుకుంటే సరిగా రాలేదు. డాక్టర్ పరీక్షలతో గొంతు క్యాన్సర్‌గా తేలడంతో ఆపరేషన్ చేసి గొంతులోని స్వరపేటికను తొలగించడం జరిగింది. ఇక అప్పటినుంచి ఏది చెప్పాలన్నా కాగితం మీద రాయడం ద్వారానే బయటపడేవి. ఇలా కాగితం మీద రాసిన కుశల ప్రశ్నయే పాటకు పల్లవని భ్రమించిన చక్రవర్తి బలిపీఠం చిత్రానికి ట్యూన్ చేసేయడం అది హిట్ కావడం విశేషం. ఏం రాయాలా అని తర్జనభర్జన పడుతూంటే మిత్రలెవరో వస్తే కుశలమా? అనిరాసారు. కుశలమానీకు ? అని మళ్లీ రాసారు. మనసు నిలువకున్నది ..పాట రాయలి…. ఇలా మిత్రుడితో కబుర్లు రాసి ఆ ప్యాడ్ అక్కడే వదిలి రికార్డింగ్ థియేటర్ నుంచి మిత్రుడితో బయటకు వచ్చారు. సంగీత దర్శకుడు చక్రవర్తి టీ బ్రేక్‌లో ఆ కాగితం చూసి పల్లవి అనుకుని కుశలమా నీకు కుశలమా..డ్యూయెట్‌ని ట్యూన్ చేసేశారు. దాసరి నారాయణరావు ప్రభృతులు ట్యూన్‌కి ఫిదా అయిపోవడంతో మిగతా వాక్యాలను తప్పని సరై రాయాల్సి వచ్చింది కృష్ణశాస్త్రికి.

ముసలితనం, దానికి మూగదనంతోడు కావడం భయంకరం. శిథిల మందిరంలో అంధకారం వంటిది అని తలచి కాగితం మీద పెట్టేవారు. బాత్‌రూమ్‌లో స్నానానికి తల మీద నీళ్లు పడేలా అత్యధిక సమయం కేటాయించడానికి ఇష్టపడేవారు. ఆయనకు మంచి భావనలు తన పాటలకు అక్కడే తోచేవి.

మనసున మల్లెల మాలలూగెనె..ఔనా నిజమేనా…కోతీ బావకు పెళ్లంట..పరుగులు తీయాలి గిత్తలు ఉరకలు వేయాలి…ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు…ఎందుకే నీకింత తొందర…వంటి పాటలు మల్లీశ్వరికి కీర్తిని తెచ్చాయి. నీవుండేదా కొండపై నా స్వామి…(భాగ్యరేఖ),ఏమి రామకథ శబరీ…( భక్త శబరి) . ఘనా ఘనా సుందరా కరుణారస మందిరా ..(భక్తతుకారాం), ప్రతి రాత్రి వసంతరాత్రి ప్రతి గాలి పైరగాలి..(ఏకవీర), ఇది మల్లెల వేళయనీ…మేడంటే మేడాకాదు..(సుఖదుఃఖాలు), చుక్కలు పాడే శుభమంత్రం…(కళ్యాణ మండపం). మాట చాలదా మనసు చాలదా..( మట్టిలో మాణిక్యం), నేలతో నీడ అన్నది ..(మంచి రోజులు వచ్చాయి), నాపేరు బికారి నా దారి ఎడారి..( శ్రీరాజరాజేశ్వరి విలాస్ కాఫీక్లబ్),మావి చిగురు తినగానే …(సీతామాలక్ష్మి), గట్టుకాడ ఎవరో…., పగలైతే దొరవేరా…(బంగారు పంజరం), నీలమోహన రారా…(డాక్టర్ ఆనంద్), చీకటి వెలుగులు కౌగిటిలో …(చీకటివెలుగులు), ఆకులో ఆకునై…, ముందు తెలిసెనా ప్రభూ…. (మేఘ సందేశం), గోరింట పూసింది కొమ్మా లేకుండా..(గోరింటాకు), ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం..(కార్తీక దీపం), పాడనా తెలుగు పాట పరవశమై…(అమెరికా అమ్మాయి) ఇలా ఎన్నో రసగుళికలు.
ఉండమ్మా బొట్టుపెడతాలో రావమ్మా మహాల క్ష్మీ రావమ్మా…. చుక్కలతో చెప్పాలని…అడుగడుగున గుడి వుంది…శ్రీశైల మల్లన్న శిరసొంచేనా…గంగమ్మారా…చాలులే నిదురపో జాబిలికూనా…పాటలన్నీ రసరమ్మాలే.

1980 ఫిబ్రవరి 24 న కృష్ణశాస్త్రి దివికెగిసారు. అది విన్న శ్రీశ్రీ తెలుగుదేశపు నిలువుటద్దం బద్ధలైంది. వసంతం వాడిపోయింది. మన షెల్లీ మరణించాడు అని బాధపడ్డారు. కవిత్వం ఒక ఆల్కెమీ దాని రహస్యం కృష్ణశాస్త్రికి తెలుసు అని తిలక్, కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ అని చలం, కొంతమందిది యువత కొంతమందిది నవత కృష్ణశాస్త్రిది కవిత అని ఆరుద్ర వివిధ సందర్భాలతో ప్రస్తుతించారు. (నవంబర్ 1న దేవులపల్లి కృష్ణశాస్త్రి జయంతి)

Posted in Uncategorized | Leave a comment

YB.Niveda

My article in YugaBharat November2017

Posted in Uncategorized | Leave a comment