Bhanuoriya article in Harivillu 1-1-2017

On Sunday, March 5, 2017 5:06 PM, kesavarao vadduri <kesavaraovadduri@yahoo.com> wrote:

My article in Harivillu,Mana Telangana dt. 1-1-17
. నాట్య మయూరి భానుప్రియ!
ఒక సితార! ఒక స్వర్ణకమలం! ఓ ఆలాపన! ఒక అన్వేషణ! ఇవి చాలు భానుప్రియ సత్తా ఎలాంటిదో వివరించడానికి, చూపడానికి. కనుపాపాల కదలికల ద్వారా, నేత్ర కదలికలు లేకుండా, చేతులు, వాటి వేళ్లను సున్నితంగా ఆడించటంలో, పద విన్యాసాలలో భానుప్రియ భావ వ్యక్తీకరణ అద్భుతమని అందరూ అంగీకరిస్తారు. అమాయకత్వం, ఆరిందాతనం, సందర్భానుసారం చూపగలదు. అల్లరి పిల్లగా ఎంత బాగా మెప్పించగలదో, తుంటరిగా అంతకంటే ప్రశంసలు పొందగలదు.

అమాయక ప్రేమికురాలిగా, గడుసు ప్రేమికురాలిగాను అలరించగలదు. చక్కని నాట్యకారిణిగా మెప్పించగలదు. మంచి ఇల్లాలిగాను ఆదరణ పొందగలదు, గ్లామర్ వెదజల్లగలదు. చిలిపిదనం చూపగలదు. బుంగ మూతితోనూ మెప్పించగలదు- ఇలా దర్శకులూ, సినిమా చూసిన ప్రేక్షకులూ భావించటం వల్లనే పదేళ్లకుపైగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలలో నాయికగా రాణించగలిగింది. ఆ తరువాత కొంత విరామం తర్వాత కేరక్టర్ రోల్స్‌లోనూ మెప్పించగలుగుతోంది. భానుప్రియ మాటలో నవ్వులో గోదావరి గలగలలు వినిపిస్తాయి. నటనలో గోదావరి అలలు కనిపిస్తాయి.

రాజమహేంద్రవరంలో పాండుబాబు, రంగమాలి దంపతులకు 1964 జనవరి 15న జన్మించారు. బాలసారెలో ఆమెకు పెట్టిన పేరు మంగభాను. వ్యాపార అభివృద్ధికోసం మంగభాను వయసు రెండేళ్లప్పుడు తండ్రి మద్రాసుకు మకాం మార్చారు. అక్కడ సరస్వతి విద్యాలయ స్కూల్లో చదువుకుంటూనే తల్లి మాట ప్రకారం ఎస్.పి.ఆనంద్ వద్ద భరత నాట్యం, కూచిపూడి నాట్యాలలో శిక్షణ పొందింది. ఈమెకు ఒక చెల్లెలు వుంది. ఆమె పేరు శాంతిప్రియ. శాంతి ప్రియ నటిగా నిశాంతి పేరుతో పరిచయమై రెండో సినిమాతో శాంతిప్రియగా పేరు మార్చుకుంది. తమిళ హిందీ చిత్రాలలో ఈమె ఎక్కువగా నటించింది.

తమిళ చిత్రంతో పరిచయం
డ్యాన్స్ స్కూల్లో, అప్పుడప్పుడు నాట్య ప్రదర్శనలు ఇచ్చేవారు. మంగభాను కూడా తరచూ పాల్గొనేది. అలా నాట్య ప్రదర్శనలు ఇస్తుండటం వల్లనే తొలుత తమిళ దర్శకుడు భాగ్యరాజా దృష్టిలో పడింది. నాట్యం బాగా చేసే టీనేజ్ గాళ్‌గా ఆయనను ఆకట్టుకుంది. ఫోటోషూట్ చేసేశారు ఆమెతో. ఎలాగూ ఫోటోషూట్ అయింది కదా అని భాగ్యరాజా దర్శకత్వంలో రూపొందే ‘తూరల్ నిన్నుపోచ్చు’ చిత్రానికి హీరోయిన్‌గా సెలెక్ట్ అయ్యాను అని ఫ్రెండ్స్ అందరికీ చెప్పేసింది. అయితే ఫోటోలు చూసిన భాగ్యరాజా “చిన్నపిల్లలా కనిపిస్తున్నావు.మరో చిత్రంలో చేదువుగాని” అని చెప్పడంతో ఆశలు ఆవిరైపోయాయి. కన్నీరు జలపాతమే అయింది. స్కూల్‌కు వెళ్లడం మానేసింది బాధతో. భారతీరాజా మంగభాను ఫొటోలు చూశాడు. ఫొటో జెనిక్‌గా వుందనిపించింది. మిత్రుడు వాసుకు చూపాడు. కొత్త హీరోయిన్‌గా ఈమెను ఎంపిక చేద్దామనుకున్నారు. భారత్ వాసు పేరుతో ఈ ఇద్దరూ కలిసి దర్శకత్వం వహించిన ‘మెల్ల పేసుంగళ్’ తమిళ చిత్ర నాయికగా హీరో వసంత్ సరసన ఎంపిక చేశారు. 1983లో విడుదలైంది.

‘సితార’యింది

నటిగా భానుప్రియను తమిళ ప్రేక్షకులు గుర్తించారు. పూర్ణోదయ మూవీస్ అధినేత ఏడిద నాగేశ్వరరావు వంశీ నవలను వంశీ దర్శకత్వంలో చిత్రంగా తీయాలనుకున్నారు. రాధను నాయికగా ఫిక్స్ చేద్దామనుకున్నారు వంశీ. లెక్కలు వేస్తే బడ్జెట్ పెరిగిపోయింది. కొత్త అమ్మాయితో తీద్దాం అనుకున్నారు. అంతకుముందు ఆఫీసుకు వచ్చిన భానుప్రియ గుర్తొచ్చింది వంశీకి. అంతే ‘సితార’ చిత్రానికి నాయికగా ఎంపిక చేశారు. 1984లో విడులైంది. జమీందార్ చెల్లెలుగా ప్రపంచం గురించి తెలియని దానిగా, తర్వాత చిత్రకథానాయికగా భిన్నపార్శాలున్న పాత్రలో మెప్పించింది ‘సితార’లో టైటిల్ పాత్ర పోషించింది.

‘ఐరెన్ లెగ్’ ముద్రతో పట్టుదల

సితార సినిమా ఘన విజయం సాధించడంతో నిర్మాతలు తాము చిరంజీవి, బాలకృష్ణ, అక్కినేని, నరేష్, రాజేంద్రప్రసాద్, మోహన్‌బాబు ప్రభృతులతో నిర్మించదలచిన చిత్రాలకు నాయికగా ఫిక్స్ చేయసాగారు. అవకాశాల వెల్లువతో ఉక్కిరిబిక్కిరి అయింది కూడా. వరుసగా నాలుగైదు చిత్రాలు పరాజయం పాలు కావడంతో ‘ఐరెన్ లెగ్’ ముద్ర వేసేశారు. నటనా పరంగా తన తప్పు, పొరపాటు లేకపోయినా ఆ ముద్రపడినందుకు బాధపడింది. నిరాశ, నిస్పృహలకు గురికాకుండా పట్టుదల పెంచుకుంది.

జంధ్యాల దర్శకత్వంలో నరేష్ సరసన నాయికగా నటించిన మొగుడు పెళ్లాలు, వంశీ దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ హీరోగా ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన ‘ప్రేమించు పెళ్లాడు’ 1985లో విడుదలై హిట్ కావడంతో ఐరెన్‌లెగ్ ముద్ర నుంచి బయటపడింది. ఆకట్టుకునే రూపం, అద్భుత అభినయం, అబ్బురపరిచే నాట్యవిన్యాసాలు భానుప్రియ సొత్తు. భానుప్రియ నటించిన తొలి హిందీ చిత్రం ‘దోస్తీ దుష్మనీ’. తాతినేని రామారావు దర్శకత్వంలో రషికపూర్, జితేంద్ర, రజనీకాంత్ నటించిన ఈ చిత్రం 1986లో విడుదలైంది. ఆయన దర్శకత్వంలో ధర్మేంద్ర, జితేంద్ర హీరోయిన్‌గా నటించిగా రూపొందిన ‘ఇన్సాఫ్ కీ పుకార్’ 1987లో విడుదలై పేరుతెచ్చింది.

పోలిక తంటాలు
బాలీవుడ్‌లోకి ప్రవేశించగానే కొంత మనశ్శాంతిని కోల్పోయింది. హిందీ చిత్రాలు షూటింగ్‌పరంగా ఆలస్యం కావడం ఒక కారణమైతే బాలీవుడ్ జర్నలిస్టుల, నిర్మాతతల ప్రశ్నలు మరో కారణం. “ శ్రీదేవి అంత గ్లామర్ మీలో లేదు కదా! శ్రీదేవిలా నటించగలరా? శ్రీదేవిని డామినేట్ చేస్తారా? సెక్సీగా నటిస్తారా? శ్రీదేవిలా సెక్స్ అప్పీల్ చూపగలరా?” అని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసేవారట. ఆ ప్రశ్నకు ఒళ్లుమండిపోయేది. కారం జల్లినట్టుండేది. కూల్‌గా బదులివ్వకపోతే రాద్ధాంతం అవుతుందని, చెడ్డపేరు వస్తుందని తలచి ఓపిక, సహనం మరింత పెంచుకునేది. తమాయించుకుంటూ బదులిచ్చేది. “అన్నిటికీ సౌత్ నుంచి వచ్చిందనే శ్రీదేవితోనే పోలుస్తారెందుకు? రేఖ కూడా సౌత్ నుంచే వచ్చింది కదా! ఇద్దరూ హీరోయిన్లుగా సక్సెస్ సాధించారు, సాధిస్తున్నారు. నన్ను నన్నుగానే చూడొచ్చు కదా! పోనీ అంతగా పోల్చాలంటే రేఖ గారితో పోల్చి చూడండి. అలా పోలిస్తే తృప్తి అయినా మిగులుతుంది నాకు” అని జవాబులు ఇచ్చేది కూల్‌గా! తెలుగులో 80, తమిళంలో 40, హిందీలో 15, మలయాళంలో 8, కన్నడంలో 5 చిత్రాలలో హీరోయిన్‌గా చేసింది. తరువాత కేరక్టర్ రోల్స్ చేస్తోంది.

చిరంజీవి సరసన నటించిన విజేత, దొంగ మొగుడు, ఖైదీనంబర్ 786, స్టేట్ రౌడీ చిత్రాలు, కృష్ణతో నటించిన ప్రతిభావంతుడు, గూఢచారి 117, కిరాయిగూండా, బాలకృష్ణతో చేసిన అనసూయమ్మగారి అల్లుడు, అపూర్వ సహోదరులు, అల్లరి క్రిష్ణయ్య, వెంకటేష్‌తో నటించిన శ్రీనివాస కల్యాణం, స్వర్ణకంకణం తదితర చిత్రాల్లో గ్లామర్ నాయికగా, నవరసాల అభినేత్రిగా పేరు ప్రతిష్ఠలు ఆర్జించింది. అన్నమయ్య, ఏడుకొండల స్వామి చిత్రాలలో పద్మావతిదేవిగా పౌరాణిక పాత్రల్లో మెప్పించింది. వంశీ దర్శకత్వంలో రూపొందిన ఆలాపనతో మోహన్ సరసన, ‘అన్వేషణ’లో కార్తీక తోనూ నటించి అద్భుత నటిగా పేరుతెచ్చుకుంది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో మోహన్‌బాబు సరసన ‘పెదరాయుడు’ చిత్రంలో నడివయసు పాత్రలో చక్కగా నటించింది.లాహిరి లాహిరి లాహిరిలో, శ్రావణమాసం, ఛత్రపతి చిత్రాలలో కేరక్టర్ ఆర్టిస్టుగాను ప్రశంసలు పొందింది.

అర్థం చేసుకోరూ !

నాట్యాచార్యుని కుమార్తెగా నాట్యం మీద ఆసక్తిలేని యువతిగా, ఇతర ఉద్యోగాల మీద అభిలాషగలదానిగా, స్వేచ్ఛగా, స్వతంత్రంగా బతి కేయాలనే కోరికగల యువతిగా ‘స్వర్ణకమలం’ చిత్రం లో నటించింది. తన కోరికలు తీర్చుకోవాలనే తపనతో మువ్వల పట్టీలు బావిలో పడేయడం, నాట్యపాఠాలు సరిగా చెప్పకుండా అల్లరిపెట్టడం వంటివి చేస్తూ “అర్థం చేసుకోరూ” అని పలకడానికి ఎన్నిహొయలు పోయిందో! ” ఇప్పటికి కూడా స్వర్ణకమలం గురించి మాట్లాడుతున్నారంటే విశ్వనాథ్ గారు ఎంత సృజనశీలిలో తెలుస్తుంది. ఏ విషయంలోనూ ఆయన రాజీపడరు. నటించి చూపి మరీ నటనను రాబట్టుకుంటారు. ఆయన ఎంత సహనశీలి అంటే ఎవరినీ కోపగించుకోవడం చూడలేదు” అంటుంది.

దర్శక రచయిత జంధ్యాల నవ్వుతూ, నవ్విస్తూ, సునాయాసంగా పిక్నిక్‌లో ఎలా వుంటా యో, అలా వుండేలా చేసి, కావలసిన నటన రాబట్టుకుంటారని స్ట్రిక్ట్‌గా వుండరని అంటుం ది. డబుల్ మీనింగ్ డైలాగ్స్ వుండవు. సున్నితమైన, సువిశాలమైన ఆరోగ్యకరమైన హాస్యం జంధ్యాల స్వంతం అన్నది ఆమె అభిప్రాయం.

సినిమాల్లో చేరినప్పుడు నాట్యానికి సంబంధించిన హావభావ విన్యాసాలు తప్ప, కెమెరాకు ఏ యాంగిల్‌లో కనిపిస్తే భావం బాగా కనిపిస్తుందో, ఎలా కదిలితే అందంగా అగుపించవచ్చో భానుప్రియకు తెలియదు. సితారలో నటిస్తున్న సమయంలోనే నృత్య విన్యాసాల ద్వారా భావ వ్యక్తీకరణకు, నట విన్యాసాల ద్వారా భావం పలికించడానికి తేడా వుందని సవివరంగా చెప్పి తనను వంశీ తీర్చిదిద్దారని అంటుంది. తొలిదశలో ఆమెకు లక్ష్మి, సరిత డబ్బింగ్ చెప్పడం జరిగింది. అన్వేషణ చిత్రం నుంచి తన పాత్రకు తనే డబ్బింగ్ చెబుతూ కొనసాగుతున్నది భానుప్రియ. ఆదర్శ్ కౌశల్‌తో వివాహం జరిగాక కొంతకాలం అమెరికాలో వుంది. వీరికి అభినయ అనే అమ్మాయి వుంది. ఆ మధ్య అమెరికా నుంచి వచ్చేసి చెన్నైలో స్థిరపడ్డారు. కూతురు కాస్త ఎదిగాక మళ్లీ సినిమాల్లో నటిస్తోంది భానుప్రియ.

మరపురాని అభినయ నాట్యాలు
సితార చిత్రంలోని ‘జిలిబిలి పలుకులు చిలిపిగ పలికిన ఓమైనా ఓమైనా…,,” “కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి….”, వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నటి దీపం…”, ప్రేమించు పెళ్లాడు సినిమాలోని “గోపెమ్మ చేతిలో గోరుముద్ద రాధమ్మ చేతిలో వెన్నముద్ద”, “ముద్దుకావాలా ముద్దుకావాలా….” “నిరంతరమూ వసంతములే….”, “వయ్యారి గోదారమ్మ ఒళ్లంతా ఎందుకమ్మ కలవరం….., అన్వేషణ చిత్రంలోని “కీరవాణి చిలకల కొలికిరో…. ఏకాంతవేళ ఏకాంత సేవ…”, “ఎదలో లయ ఎగసే లయ….. ఆలాపానలోని ఆకాశమంతా ఆలాపనేలే…. ఆ కనులలో కలల నా చెలి…. ప్రియతమా తమా…. తమా…., కార్తీక పౌర్ణమి లోని నటనలు చాలించరా స్వామీ…. స్వర్ణకమలం చిత్రంలోని ఘల్లు ఘల్లు ఘల్లు మంటూ మెరుపల్లే తుళ్ళూ… శివపూజకు చివురించిన సిరి సిరి మువ్వా…. కొత్తగా రెక్కలొచ్చె నా గూటిలోనీ గువ్వపిల్లకీ…. మంగళప్రదాయ గోపురంగతే నమఃశివాయ గీతాల్లో భానుప్రియ చేసిన నాట్యవి న్యాసాలు, భావ ప్రకటనలూ ఎప్పటికీ గుర్తుండి పోయేవే.! అర్థం చేసుకోరూ!!!

Advertisements

About vskesavarao

I am a Telugu Journalist. I started career as a Journalist 1976 in Andhrapatrika Daily. I am one of the founder member in the Editorial Board of Andhra Bhoomi Illustrated Weekly after February 1977.Latter I worked in Venditera Film weekly. I joined in Chitrabhoomi Film Weekly during 1980 of Kakatiya Publications, Hyderabad. It's Publisher is Mr.D.Bheem Reddy. We brought Aadivaram a Socio Political weekly &and Mayuri Illustrated weekly from this Organisation. I worked for this organisation in Hyderabad &and Madras upto 1983. Later I Joined in EENADU daily and worked until April 1984. Then joined again in Chitrabhoomi. Afterwards ie., during 1986 I joined in Andhraprabha daily in Hyderabad. Madras edition started after a long time and I was sent to Madras., Hyderabad as my headquarters.I worked for Vijayachitra a Film Monthly & Film Tradeguide weekly in Madras until1994.Afterwards I came to Hyderabad and joined in Andhraprabha telugu Daily. Now I am Editor in Charge for Chitraprabha a Thursday Film suppliment of Andhraprabha Daily from 2007.
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s