త్రిభాషా చిత్రాల దర్శక నిర్మాత harivillu 9-7-17

త్రిభాషా చిత్రాల దర్శక నిర్మాత
స్కూల్ మాస్టర్‌గా పనిచేస్తూ నటనపై ఆసక్తి ఏర్పడటంతో నాటకాల్లో నటించి రంగస్థల నటుడుగా గుర్తింపు పొందారు. తర్వాత సినిమా నటన మీద అనురక్తి ఏర్పడటంతో ఆయన నటించగా పేరు వచ్చిన సంసార నౌక, నాటకాన్ని సినిమా తీస్తే టైటిల్ రోల్ పోషించారు కన్నడ చిత్రంలో. తరువాత కొన్ని చిత్రాల్లో హీరోగా నటిస్తూ, నిర్మాతగా, దర్శకుడుగా నాలుగు భాషా చిత్రాల్లోనూ రాణించారు. త్రిభాషా చిత్రాల దర్శక నిర్మాతగానూ పేరు తెచ్చుకున్నారు ఆయనే బి.ఆర్.పంతులు. వీరపాండ్య కట్టబ్రహ్మన, కర్ణ తదితర చిత్రాలు బి.ఆర్.పంతులు స్వీయదర్శకత్వంలో నిర్మించగా విశేషంగా ప్రేక్షకులను అలరించాయి. విదేశాల్లోనూ ప్రాచుర్యం పొందాయి.
ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని బుడగూరులో 1910 జులై 26న బ్రాహ్మణ కుటుంబంలో బుడగూరు రామకృష్ణయ్య (బి.ఆర్) పంతులు జన్మించారు. ఈ గ్రామం ప్రస్తుతం కర్ణాట క రాష్ట్రంలోని కోలార్ తాలుకాలో వుంది. ఆయనకు తెలుగు తో బాటు కన్నడం కూడా బాగా వచ్చేది. మద్రాసులో చదువుకుని స్కూల్ మాస్టర్‌గా ఉద్యోగం కూడా చేసినందున తమిళం లో కూడా ప్రవేశం వుండేది. రంగస్థల నటన వైపు దృష్టి మళ్లి, చంద్రకళా నాటక సమాజంలో చేరారు. కన్నడిగుడిగానే గుర్తించడంతో సంసారనౌక, సదారమ, గులేబకావళి వంటి నాటకాల్లో నటించి కన్నడ రంగస్థలంపై గుర్తింపు పొందారు. ఆ తర్వాత గుబ్బివీరన్న నాటక సమాజంలో చేరి కృష్ణగారడి తదితర నాటకాల్లో నటించి మరింత పేరుతెచ్చుకున్నారు. రంగస్థలంపై ప్రాచుర్యం ఏర్పడటంతో టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. చిత్రరంగంపై కూడా ఆసక్తి ఏర్పడింది. కళాసేవ నాటకమండలి స్థాపించి పలు నాటకాలు ప్రదర్శిం చారు. బి.ఆర్. పంతులుకి బాగా పేరు తెచ్చిన సంసారనౌక నాటకాన్ని అదే పేరుతో హెచ్.ఎల్. ఎన్. సింహా దర్శకత్వం లో దేవి ఫిలింస్ సంస్థ చిత్రంగా నిర్మిస్తూ బి.ఆర్. పంతులును హీరోగా, ఎం.వి.రాజమ్మను హీరోయిన్‌గా, దిక్కి మధుసూద నరావు, ఎస్.ఎల్.పద్మాదేవి, ఎం.ఎస్.మాధవరావు ప్రభృతులను మిగతా పాత్రలలో నటింపజేశారు. 1936లో విడుద లైన ఈ కన్నడ చిత్రం హిట్ కావడంతో రాధారమణ కన్నడ చిత్రంలో హీరోగా, వై.వి.రావు రూపొందించిన చారిత్రక చిత్రం లవంగిలో, ఎ.వి.ఎం సంస్థ రూపొందించిన నామ్ ఇరువార్ వంటి తమిళ చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించారు.
పద్మిని పిక్చర్స్ నిర్మాణ సంస్థను 1953లో నెలకొల్పారు. పి.నీలకంఠన్ దర్శకత్వంలో శివాజీగణేశన్, పద్మిని నాయకా నాయికలుగా తను, టి.ఆర్.రామచంద్రన్, చంద్రబాబు, రాగిణి ముఖ్యపాత్రలు పోషించగా కల్యాణం పణ్ణియుం బ్రహ్మచారి చిత్రాన్ని నిర్మించి 1954 ఏప్రిల్ 13న విడుదల చేశారు. ఈ చిత్రం తర్వాత భాగస్వాములు విడిపోవటంతో పద్మిని పిక్చర్స్ సంస్థకు తనే యజమానై పి.నీలకంఠన్ దర్శకత్వంలో శివాజీగణేశన్, అంజలీదేవి, ఎన్.ఎస్.కృష్ణన్ తో తమిళంలో ముదల్ తేదీగా, కన్నడంలో బి.ఆర్.పంతులు ఎం.వి.రాజమ్మ నాయకానాయికలుగా ముదలా తేదిగా రెండు భాషల్లో నిర్మించి 1955 మార్చి 12న విడుదల చేశారు. ఈ చిత్రాలు కూడా విజయం సాధించడంతో దర్శకత్వం కూడా చేయాలని తలచారు. ఫాంటసీ, మిస్టరి చిత్రం తీయాలని సంకల్పించి శివాజీ గణేశన్, టి.ఆర్.రాజకుమారి, జమున, వీరప్ప ప్రభృతులతో తమిళంలో తంగమాలయ్ రగసియం, ఉదయకుమార్, జమున, షావుకారు జానకి, బి.సరోజాదేవి ప్రభృతులతో, కన్నడంలో, రత్నగిరి రహస్యంగా రూపొందించి 1957 జూన్ 29న విడుదల చేశారు.
తమిళ వెర్షన్‌ని డబ్ చేసి రత్నగిరి రహస్యంగా తెలుగులో కూడా అదే తేదీన విడుదల చేసి త్రిభాషా చిత్రాలకు దర్శక నిర్మాతగా నాంది పలికారు బి.ఆర్. పంతులు. తరువాత స్కూల్ మాస్టర్ చిత్రాన్ని తను టైటిల్ రోల్ పోషిస్తూ ఉదయ్‌కుమార్, శివాజీగణేశన్, జెమీనిగణేశన్, బి.సరోజాదేవిలతో తమిళ, కన్నడ భాషల్లో ద్విభాషా చిత్రంగా నిర్మించి, తెలుగులోకి బడిపంతులుగా డబ్ చేసి మూడు భాషల్లో 1958న విడుదల చేశారు. స్కూల్ మాస్టర్ హిందీ చిత్రాన్ని బి.ఆర్.పంతులు నటిస్తూ దర్శకత్వం చేయడంలో 1959లో వేరే సంస్థ నిర్మించి విడుదల చేయగా, మలయాళంలో స్కూల్ మాస్టర్ చిత్రాన్ని ప్రేమ్‌నజీర్, కె.బాలాజీ ప్రభృతులతో బి.ఆర్.పంతులు శిష్యుడు పుట్టన్న కణగల్ దర్శకత్వం వహించి 1964లో విడుదల చేశారు. స్కూల్ మాస్టర్‌గా ఉద్యోగం చేసిన బి.ఆర్.పంతులు ఆ వృత్తి మీద గల ప్రేమ, అభిమానాలను అలా చాటి చెప్పారు. ఆ తరువాత ఈ కథ ఆధారంగానే ఎన్.టి.ఆర్, అంజలీదేవి, శ్రీదేవిలతో పి.చంద్రశేఖర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొంది 1973లో ఘన విజయం సాధించింది.
వీరపాండ్య కట్టబ్రహ్మన
చారిత్రక చిత్రాలు రూపొందించాలనే తపన ఆయనలో ఉండేది. తొలి చిత్రంగా తమిళంలో శివాజీగణేశన్ టైటిల్ రోల్ పోషించగా ‘వీరపాండ్య కట్టబొమ్మన్ ’ చిత్రం స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. జెమినీగణేశన్, పద్మిని, ఎస్.వర లక్ష్మి, రాగిణి, జావర్ సీతారామన్, వి.కె.రామసామి ప్రభృతులు నటించగా భారీ చిత్రంగా రూపొందించారు. 1959 మే 10న లండన్‌లో ప్రీమియర్ షోగా ప్రదర్శించి 1959 మే 16న తమిళనాడులో విడుదల చేశారు. ఈ చిత్రా నికి అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డులు స్వీకరించిన తొలి తమిళ చిత్రంగా గుర్తింపు పొందింది. అంతేకాదు, ఉత్తమ ప్రాంతీయ చిత్రం గా జాతీయస్థాయిలో అవార్డుని, సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్‌ని కూడా సాధించింది. తమిళనాట ఘన విజయం సాధించింది. డి.వి.నరసరాజు సంభాషణలతో శివాజీగణేశన్‌కి కె.ఎ.ఎస్. శర్మ డబ్బింగ్ చెప్పగా తెలుగులో వీరపాండ్య కట్ట బ్రహ్మన్నగా డబ్ చేసి 1959లో విడుదల చేయగా జనాదరణ పొందింది. హిందీలోని అమర్ షహీద్ గా డబ్ చేసి 1960లో విడుదల చేశారు. కప్పలోత్తియ తమిళన్ అనే బయోపిక్ చిత్రాన్ని స్వీయదర్శకత్వంలో శివాజీగణేశన్ టైటిల్ పాత్రతో నిర్మించగా 1961లో విడుదలై, ఉత్తమ తమిళ చిత్రంగా జాతీయ స్థాయిలో అవార్డు పొందింది.
శివాజీగణేశన్‌తో కర్ణ:
శివాజీగణేశన్ కర్ణుడుగా, ఎన్.టి.ఆర్ కృష్ణుడుగా, సావిత్రి భానుమతిగా, దేవిక శుభాంగిగా, ఎం.వి.రాజమ్మ కుంతిగా నటించగా భారీ చిత్రంగా కర్ణన్ పౌరాణిక చిత్రాన్ని తమిళంలో నిర్మించారు. దీనిని తెలుగులోకి డి.వి.నరసరాజు సంభాషణలతో డబ్ చేశారు. హిందీలో దాన వీర్ కర్ణ్‌గా విడుదల చేశారు. 11వ జాతీయ అవార్డులతో తృతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. సి.నా.రె రాసిన గాలికి కులమేదీ పాట ఈ చిత్రంలో జనాదరణ పొందింది. శివాజీ డైలాగ్స్, నటన ప్రత్యేక ఆకర్షణ అయింది 1964లో. ఈ చిత్రం కోసం ఆ రోజుల్లోనే భారీగా క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరించారు దర్శకనిర్మాత బి.ఆర్. పంతులు. 80 ఏనుగులు, 40 గుర్రాలు వందల సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులతో చిత్రీకరణ జరిపారు.
నరసరాజుకు అదనపు పారితోషకం
డబ్ అయిన కర్ణ చిత్రాన్ని చూసిన బి.ఆర్.పంతులు తల్లి మహా ఆనందం చెందింది. “మంచి తెలుగు చిత్రం చూశాను నాయనా చాలా కాలానికి మంచి తెలుగు మాటలు విన్నాను బాబు”అని డి.వి.నరసరాజుతో అంటుంటే పంతులు ఆనందానికి అవధులు లేకపోయాయి. ఆ తరువాత నరసరాజుకు నిర్ణయించిన పారితోషకం కంటే రెండువేలు అధికంగా కలిపి చెక్కు రాసి పంపారు. అది తీసుకోడానికి నరసరాజు సంశయిస్తే, కబురుచేసి “మా అమ్మ చెప్పింది కదా స్ట్రయిట్ చిత్రంలా వుందని అందుకే ఆనందంతో యిచ్చాను” అని చేతిలో పెట్టారు. ఎన్.టి. రామారావు, దేవిక హీరో హీరోయిన్లుగా గాలిమేడలు చిత్రాన్ని, ఎన్.టి.రామారావు, షావుకారు జానకి కాంబినే షన్లో పెంపుడు కూతురు చిత్రాలను స్వీయదర్శకత్వంతో పద్మశ్రీ పిక్చర్స్ పతాకాన నిర్మించి విడుదల చేశారు. గాలిమేడలుని గాలి గోపుర పేరుతో కన్నడంలోనూ పునర్నిర్మించి విజయం సాధించారు.
పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం
భానుమతి నెలకొల్పిన భరణి స్టూడియోను లీజ్‌కి తీసుకుని కొన్ని చిత్రాలు రూపొందించారు. ఆ సమయంలోనే తమిళ, కన్నడ భాషల్లో పిల్లల చిత్రం తీయడానికి ప్లాన్ చేశారు. చేశాక అది తెలుగులో కూడా తీస్తే బాగుంటుందని తలచి ‘పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం’ టైటిల్ పెట్టి తెలుగులో 1960లో విడుదల చేశారు. తెలుగు వెర్షన్‌లో రాజనాల, ఎం.వి.రాజమ్మ ముఖ్యపాత్రలు పోషించారు. మిగతా భాషల్లో వేరే టైటిల్ తో ఇతర నటీనటులతో రూపొందించి విడుదల చేశారు. మద్రాసు ఫిలిం ఛాంబర్‌లో బాలల చిత్రం మూడు భాషల్లో తీసినందుకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో బి.ఆర్.పంతులు సిసలైన తెలుగు వాడు అని మొదటిసారి అందరికితెలిసింది. తెల్లని బట్టలు ధరించి, చిరునవ్వులు చిందిస్తూ ఎక్కడా తొణకకుండా, చిరాకు పడకుండా వుంటారు. ఎటువంటి టెన్షన్లకు లోను కాకుండా వుంటారు. లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి సొంత డబ్బుతో భారీ చిత్రాలు రూపొందించే బి.ఆర్.పంతులు తెలుగు వారని ఎందరికి తెలుసు?” అని డి.వి. నరసరాజు ప్రసం గిస్తుంటే అందరూ ఆశ్చర్యపోయారు.
సిగరెట్లు ఎక్కువగా కాలుస్తుండేవారు. కారా కిళ్లీ నములుతూ వుండేవారు. అంతరాయం రాకుండా సిగరెట్లు తమలపాకులు, వక్క పొడి, జరదా సామగ్రి తనతోనే వుంచుకునేవారు.
జయలలితను తొలిసారి
ఎం.జి.ఆర్‌కి నాయికగా జయలలితను తొలిసారి ఎంపిక చేసి స్వీయదర్శకత్వంలో ‘ఆయిరుత్తుల్ ఒరువన్’ చిత్రాన్ని నిర్మించి విడుదల చేశారు. ఆ తరువాత ఆ కాంబినేషన్‌కి ఎంతో పేరొచ్చి ఎన్నో చిత్రాల్లో చేయడమే కాకుండా ఎం.జి.ఆర్. వారసురాలై ముఖ్యమంత్రిగా తమిళ ప్రజల అభిమానాన్ని చూరగొంది.
చారిత్రక చిత్రాలు తీయాలని తలచిన ఆయన కన్నడ రాజకుమార్ ని కృష్ణదేవరాయులుగా ఎంపిక చేసి శ్రీకృష్ణదేవరాయ స్వీయదర్శకత్వంలో నిర్మించి తను తిమ్మరుసుగా నటించి ఆ చిత్ర ఘనవిజయం చెందేలా చేశారు. బి.సరోజాదేవి ముఖ్యపాత్ర పోషించగా కిత్తూరి చెన్నమ్మ చారిత్రక చిత్రం కన్నడంలో తీసి విజయం సాధించారు. ఇది కిత్తూరి రాణి చెన్నమ్మగా తెలుగులోకి డబ్ అయింది.
“బట్టలు నలగకుండా ఏవిధమైన టెన్షన్ లేకుండా ఎవరి మీద చిరాకు ప్రదర్శించకుండా నవ్వుతూ వుంటాను బయటకొచ్చాక. నేనెంత టెన్షన్ పడతానో, ఎంత చిరాకు పడతానో, ఎంత కోపిష్ఠినో నా భార్యని అడిగితే లేదా ఇంట్లో వుండగా నన్ను చూస్తే తెలుస్తుంది” అనేవారు. పన్నెండు చిత్రాల్లో హీరోగా, కొన్ని చిత్రాల్లో ముఖ్య పాత్రధారిగా నటించిన బి.ఆర్.పంతులు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో పలు చిత్రాలు రూపొందించారు. పద్నినీ పిక్చర్స్ పతాకాన 55 చిత్రాలు నిర్మించారు. ఇందులో 52 చిత్రాలు ఈయన దర్శకత్వంలో రూపొందాయి. ఇవికాక బయట చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎం.జి.ఆర్ అన్నా అని సంబోధిస్తే ఎన్.టి.ఆర్ శివాజీగణేశన్ బ్రదర్ అని పిలిచేవారు. ఎన్.టి.రామా రావు దానవీరశూరకర్ణ తీయడానికి వీరపాండ్య కట్ట బ్రహ్మనగా ఒక చిత్రంలో కనిపించడానికి ప్రేరణ ఇచ్చింది బి.ఆర్. పంతులు చిత్రాలే.
ప్రేక్షకుల అభిమానం పొందిన పద్మినీ పిక్చర్స్
బి.ఆర్. పంతులు కుమార్తె బి.ఆర్. విజయలక్ష్మి తొలుత ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేసి తరువాత సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. ప్రముఖ ఛాయాగ్రహకుడు, దర్శకుడు అశోక్‌కుమార్‌కి అసిస్టెంట్‌గా కొంతకాలం పనిచేసి తరువాత పలు తమిళ, కన్నడ చిత్రాలకు ఛాయాగ్రాహకురాలుగా పని చేస్తున్నారు. బి.ఆర్. పంతులు కుమారుడు బి.ఆర్. రవిశంకర్ దర్శక నిర్మాతగా తమిళ, కన్నడ చిత్రాలు రూపొందిస్తున్నారు. సిసలైన తెలుగువాడైన కన్నడిగుడిగా గుర్తించి 2010లో కన్నడ చిత్ర పరిశ్రమ ఆయన శతజయంతి ఉత్సవాలను ఏడాదిపాటు నిర్వహించడంలో బి.సరోజాదేవి ముఖ్యపా త్ర పోషించారు. అంతేకాదు బి.ఆర్. పంతులుపై డి.ఎన్. ప్రహ్లాదరావు రాసిన పుస్తకాన్ని కన్నడంలో కర్ణాటక చలన చిత్ర అకాడమీ ప్రచురించింది. ప్రముఖ నటి భారతి నిరుడు ఈ పుస్తకాన్ని భారీ ఎత్తున విడుదల చేశారు. స్కూల్ మాస్టర్‌గా పనిచేసిన బి.ఆర్. పంతులు ఆ వృత్తిమీద గౌరవంతో 1958లో నాలుగు భాషల్లో ఆ చిత్రం తీసినా తృప్తి చెందక మళ్లీ టైటిల్ పాత్ర పోషిస్తూ జెమినీ గణేశన్, షావుకారు జానకి తదితరులతో 1973లో మరోసారి తమిళంలో ‘స్కూల్ మాస్టర్’ చిత్రాన్ని స్వీయదర్శకత్వంలో నిర్మించి విడుదల చేశారు. విజయం సాధించారు. ముత్తురామన్ జయచిత్రలతో 1974లో పద్మినీ పిక్చర్స్ పతాకాన ‘కడవుల్ మామ’ చిత్రాన్ని నింగముత్తు దర్శకత్వంలో నిర్మిస్తూ ఆకస్మాత్తు గా గుండెపోటుతో 1974 అక్టోబర్ 8న మృతిచెందారు పద్మినీ పిక్చర్స్ సంస్థని ముందుతరాలకు గుర్తుండేలా చేస్తూ.

Image may contain: 1 person, sitting and indoor

facebook.png

Log in or sign up to view

See posts, photos and more on Facebook.

Virus-free. www.avast.com
Advertisements

About vskesavarao

I am a Telugu Journalist. I started career as a Journalist 1976 in Andhrapatrika Daily. I am one of the founder member in the Editorial Board of Andhra Bhoomi Illustrated Weekly after February 1977.Latter I worked in Venditera Film weekly. I joined in Chitrabhoomi Film Weekly during 1980 of Kakatiya Publications, Hyderabad. It's Publisher is Mr.D.Bheem Reddy. We brought Aadivaram a Socio Political weekly &and Mayuri Illustrated weekly from this Organisation. I worked for this organisation in Hyderabad &and Madras upto 1983. Later I Joined in EENADU daily and worked until April 1984. Then joined again in Chitrabhoomi. Afterwards ie., during 1986 I joined in Andhraprabha daily in Hyderabad. Madras edition started after a long time and I was sent to Madras., Hyderabad as my headquarters.I worked for Vijayachitra a Film Monthly & Film Tradeguide weekly in Madras until1994.Afterwards I came to Hyderabad and joined in Andhraprabha telugu Daily. Now I am Editor in Charge for Chitraprabha a Thursday Film suppliment of Andhraprabha Daily from 2007.
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s