My article in Harivillu,ManaTelangana 13-8-17 త ొలి అందా ల సుందరి

My article in Harivillu,ManaTelangana 13-8-17.
తొలి అందాల సుందరి
తెలుగు భాషని, తెలుగు పాటని, భారతీయ నృత్యాలను, నట కౌశలాన్ని, వాగ్ధాటిని స్వదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ప్రాచుర్యం పొందేలా చేసిన గాయని, వక్త, నటి, నాట్యకారిణి టంగుటూరి సూర్యకుమారి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ మాకన్న తల్లికి మంగళహారతులు…” పాటను విశ్వవ్యాప్తం చేసిన గాయని ఈమె. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడుగా, ఆంధ్రకేసరిగా, ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ప్రసిద్ధి చెందిన టంగుటూరి ప్రకాశం పంతులు ఈమె పెదనాన్న.
టంగుటూరి శ్రీరాములు దంపతులకు 1925 నవంబరు 13న సూర్యకుమారి రాజమండ్రిలో జన్మించింది. బాలికగా వున్నప్పుడే ఈమెలోని బహుముఖ ప్రజ్ఞను గుర్తించిన పెదనాన్న ప్రకాశం పంతులు శాస్త్రీయ నృత్యం, గానంలో శిక్షణ ఇప్పించారు. పెదనాన్న కుటుంబంతో పాటు మద్రాసులో వుండే సూర్యకుమారిని ఇంట్లో అందరూ ముద్దుగా ప్రకాశం అని పిలిచేవారు. ముద్దు పేరుకు తగ్గట్టుగా పేరులోని పదానికి తగ్గట్టుగా ప్రపంచవ్యాప్తంగా తన ప్రతిభతో ప్రకాశించింది.
పదకొండవ ఏటనే సూర్యకుమారి బాలనటిగా విప్రనారాయణ చిత్రంలో నటించింది. కాంచనమాల, కస్తూరి వెంకట నరసింహారావు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం 1937లో విడుదలై కాంచనమాల అందం కూడా తోడు కావడంతో విజయం సాధించింది. అదృష్టం చిత్రంలో ఒక పాత్రలో నటించింది. గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వంలో సంచలనం సృష్టించిన రైతుబిడ్డ చిత్రంలో రైతు కుమార్తె సీతగా నటించింది.ఈమె నటించిన మరో చిత్రం జయప్రద కూడా 1939లోనే విడుదలయ్యాయి. దీనబంధులో సి.హెచ్. నారాయణరావుకు నాయికగా, చంద్రహాసలో బి.ఎన్.స్వామికి నాయికగా నటించింది.
బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో నాగయ్య హీరోగా నటించిన దేవతలో నాగయ్య చెల్లెలు సీతగా నటించింది. నాగయ్య నిర్మించి నటించిన భాగ్యలక్ష్మిలో శ్యామలగా నటించింది. కె.వి.రెడ్డి దర్శకత్వంలో నాగయ్య భక్త పోతనగా టైటిల్ పాత్ర పోషించగా ఘనవిజయం సాధించిన భక్త పోతన చిత్రంలో సరస్వతీదేవిగా, కృష్ణ ప్రేమ చిత్రంలో నారద పాత్రలో మెప్పించింది. భక్తరామదాసు చిత్రంలో తానీషా భార్యగా నటించింది. అదృష్టదీపుడు, మరదలు పెళ్లి మొదలగు చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించింది. ఇంకా గీతాంజలి తెలుగు చిత్రంలో కటకం, సంసారనౌక తమిళ చిత్రాలలో భారతి అనే కన్నడ చిత్రంలో వతన్, ఉడాన్ ఖటోలా, అబ్ల మొదలగు హిందీ చిత్రాలలో బాంబే ఫ్లయిట్ 417 అనే ఆంగ్ల చిత్రంలో సూర్యకుమారి నటించింది.
మిస్ మద్రాస్:
టంగుటూరి సూర్యకుమారికి ఫ్యాషన్స్, స్టైల్స్ మీద కూడా చక్కని అవగాహన ఉండేది. ఈ కారణంగా 1952లో ఆమె జీవితంలో ఒక చక్కని మలుపు ఏర్పడింది. అందాల యువతి పోటీల్లో పాల్గొని తన ప్రతిభ చూపడంతో మిస్ మద్రాస్‌గా ఎన్నికై తొలి తెలుగు యువతిగా కీర్తి ప్రతిష్ఠలు ఆర్జించింది 1952లో. ఆ తరువాత అఖిల భారత స్థాయిలో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనడానికి బొంబాయి వెళ్లింది. ఆ పోటీల్లో ఇంద్రాణి రెహమాన్ మిస్ ఇండియాగా ఎంపిక కావడంతో సూర్యకుమారి ద్వితీయ స్థానంలో రన్నర్‌అప్ అయింది. ఈ పోటీలో పాల్గొన్న కారణంగా నాలుగు హిందీ చిత్రాల్లో నటించే అవకాశమూ లభించింది.
గ్రాంఫోన్ల పాటల్లో రికార్డ్:
సినిమాల్లో పాడే పాటలకే కాకుండా ప్రయివేట్‌గా పాడే గీతాలకూ టంగుటూరి సూర్యకుమారికి మంచి పేరుండేది. అందుకే హెచ్.ఎం.వి గ్రాంఫోన్ రికార్డుల కంపెనీ ఆమెతో పాడించి విడుదల చేసిన లలిత గీతాలు, దేశభక్తి గీతాలు, ప్రభోదగీతాలు, అష్టపదులు గ్రాంఫోన్ రికార్డులుగా విడుదలై వూరూవాడ వినిపించేవి. శంకరంబాడి సుందరాచారి రచించిన “మా తెలుగు తల్లికి మల్లెపూదండ”పాటను ఈమె పాడగా రికార్డు చేస్తే రికార్డు స్థాయిలో అమ్ముడు పోయాయి 1942 నుంచి. అంతేకాదు స్వాతంత్ర సమరయోధులు పాల్గొనే సభల్లో, సాంస్కృతిక సభల్లోనూ ఈ పాటకు విశేష ఆదరణ లభించేది.
దేశభక్తి పెంపొందించే గీతాలు!
దేశమును ప్రేమించుమన్నా మంచి యన్నది పెంచుమన్నా దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్….. మాదీ స్వతంత్ర దేశం మాదీ స్వతంత్ర జాతీ భారతదేశమే మా దేశం భారతీయులూ మా ప్రజలు… ఎత్తవోయీ నీ జెండా ,,,,హే భారత జననీ స్వేచ్ఛా గగన వీధీ విహారిణీ…. ఉదయమాయెను స్వేచ్ఛాభారత ఉదయమ్మాయె నహా తూరుపు ఖండపు వారల తపములు… ముక్కటి కంఠాలూ ఒక్క పొంగున పొంగాయి… ఓహోహో స్వతంత్రదేవి దేవీ నీ కిచ్చేటి కానుకలెవీ జనవాళికి ప్రశాంతినిమ్మా జగత్తుకు సమానతనిమ్మా… వంటి దేశభక్తి గీతాలు గ్రాంఫోను రికార్డులుగా పెద్ద స్వరంతో కాఫీ హోటళ్ల వద్ద, సభల్లోనూ వినిపించి దేశభక్తి జనంలో పెంపొందేలా చేసేది సూర్యకుమారి గానం. శతపత్ర సుందరీ ఓహా శతపత్ర సుందరీ ఉదయసంధ్యవేళ ఈ హృదయభావకేళా సుందర నయనదళకాంతలో… మామిడి చెట్టున అల్లుకున్నదీ మాధవీలత…. ఒంటిగా ఉయ్యాల ఊగితివా నా ముద్దుబిడ్డా జంటగా ననుపిలవక…. లేపనైనా లేపలేదు చూపనైనా చూపలేదు.. చిన్నదోయీ నా హృదయమూ….. స్వప్న జగతిలో…. వంటి లలిత గీతాలు, భావ గీతాలు ఓ మహాత్మా ఓ మహర్షి ఏది చీకటి ఏది వెలుతురు ఏది జీవితం ఏది మృత్యువు ఏది పుణ్యం ఏది పాపం ఏది నరకం ఏది నాకం… వంటి ప్రబోధ గీతాలు గ్రాం ఫోను రికార్డులుగా వెలువడి ఉత్తేజపరిచేవి, చైతన్యపరిచేవి. బసవరాజు అప్పారావు, గురజాడ అప్పారావు, బాలాంత్రపు రజనీకాంతారావు, బలిజేపల్లి లక్ష్మీకాంతకవి, దేవులపల్లి కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ వంటి మహామహుల గీతాలివి కావడం విశేషం. మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాన్ని, మరో గీతాన్ని శంకరంబాడి సుందరాచారితో సూర్యకుమారి రాయించుకుందని చెప్పేవారు.
సభల్లో గాయనిగా వక్తగా:
దేశభక్తి గీతా లు, లలితగీతాలు పా డటంలో పాడి మెప్పించడంలో తమ్ముడి కూతురుకున్న నేర్పుని గుర్తించిన టంగుటూరి ప్రకాశం పంతులు తనతో బాటు స్వాతంత్ర పోరాట సభలకు, రాజకీయ సభలకు తీసుకెళ్లేవారు. అక్కడ ఆమె పాటలు పాడి మెప్పించటమే కాకుండా చక్కని ఉపన్యాసాలు కూడా ఇస్తూ సభాసదులను విశేషంగా ఆకట్టుకునేది. ఈ సభల్లో మా తెలుగు తల్లికి మల్లెపూదండ… దేశమును ప్రేమించుమన్నా మంచియన్నది పెంచుమన్నా…. దేశమంటే మట్టికాదోయ్… వందేమాతరం…. గీతాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది.
1953 అక్టోబర్ 1న జరిగిన ఆంధ్ర రాష్ట్ర అవతరణ సభలో ఈ పాటలు పాడినప్పుడు జవహర్‌లాల్ నెహ్రూ, రాజాజీ మొదలగు ప్రముఖులు ఆనందభరితులయ్యారు. పాటలోని విశేష అంశాలు తెలుసుకుని సభలో నెహ్రూ, రాజాజీ సూర్యకుమారి గాత్రాన్ని ప్రశంసిస్తుంటే ప్రకాశంపంతులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. అడవిబాపిరాజు రాసిన ప్రభువు గారికీ దణ్ణం పెట్టు…… రావోయి చినవాడా… మున్నగు గీతాలు, స్వప్న జగతిలో చాయావీణా.. శ్రీకర గోదావరి కృష్ణ…. పోరుబందరు కోమటింట పుట్టినాడోయీ వంటి గీతాలుగా అధిక ప్రజాదరణ పొందాయి.
రైతుబిడ్డ చిత్రంలో రైతుబిడ్డగా అంటే రైతు కుమార్తెగా రావోయీ వనమాలీ… నీలిమబ్బులు….. రాబోకు రాబోకురా…. ముద్దుల ఎద్దుకూ… శిస్తు భారము చాలా… గీతాలను సోలోగా, మంగళమమ్మా… గీతాన్ని పద్మావతిదేవితో కలిసి ఆలపించి మన్ననలు పొందింది. దేవత చిత్రంలోని వెండికంచాలలో బువ్వుందోయ్ పసిడి కంచాలలో పాలబువ్వందోయ్ తిందామా రావోయి జాబిల్లీ… రైతు జనములారా పండుగ దినమిదిరా… పాటలు ప్రసిద్ధికెక్కగా ఆ చిత్రంలో ఇంకా మూడు పాటలు సోలోగా రెండు పాటలు ఇతరులతో కలిసి గానం చేసింది. నారద పాత్ర పోషించిన కృష్ణ ప్రేమలో (పరువంలో ఉన్న పద్దెనిమిదో ఏట కనుక ఆమె జుత్తు కనపడకుండా జుత్తును వెనక్కి తలవెనుక మధ్యగా గుండ్రంగా చుట్టి ముడివేసి, తెల్లజుబ్బా ఆమెకు తొడిగి నటింపజేయగా) రేపే వస్తాడంట గోపాలుడు మాపే వస్తాడంట గోపాలుడు…. అంటూ పాడిన పాట హిట్ అయింది. భాగ్యలక్ష్మి చిత్రంలో రామలాలీ మేఘశ్యామలాలీ…. రారా గోకుల నాథా.. పాట లు జనాదరణ పొందాయి.
విదేశీ పర్యటనలు :
భారతీయ చిత్ర పరిశ్రమ తరపున హాలీవుడ్‌కి ఆహ్వానించిన డెలిగేట్ల బృందంలో తొలిసారి అమెరికా సందర్శించి ప్రసంగాలతో ఆకట్టుకున్న తెలుగు యువతి 1959లో మరోసారి ఆహ్వానితురాలై కొలంబియా యూనివర్సిటీలో బోధనలు చేసి, వెస్టరన్ డ్యాన్సులు, వెస్టరన్ సంగీతంలో శిక్షణ కూడా పొందింది. క్రైం థిల్లర్ చిత్రాల దర్శకుడుగా పేరొందిన ఆల్‌ఫ్రిడ్ హిచ్‌కాక్ వద్ద భారతీయ కథలకు సంబంధించిన పరిశోధనలో పాల్గొనడమే కాక ఆయన వద్ద కొన్ని టివీ సిరీస్‌కి పనిచేసింది. రవీంద్రనాథ్ ఠాగూర్ నాటిక ది కింగ్ ఆఫ్ ది డార్క్‌ చాంబర్‌లో రాణిా సుదర్శనగా నటించి ఆ నాటకాన్ని ఎనిమిది నెలల పాటు న్యూయార్క్‌లో ప్రదర్శించి బ్రాడ్‌వే క్రిటిక్స్ నుంచి ఉత్తమ నటి అవార్డు స్వీకరించారు. నార్వే, స్వీడన్, హాలెండ్, స్పెయిన్, కెనడా, ఆఫ్రికా దేశాల్లోనూ పర్యటించి తెలుగు సంస్కృతి, భారతీయ సంస్కృతి గురించి తెలియజేశారు.
లండన్‌లో కాళికాదేవిగా కిండ్లీ మంకీస్ థియేటర్లో నటించాక. అక్కడి వారి కోరికపై 1965 తర్వాత స్థిరపడిపోయారు. భారతీయ సంస్కృతి, వేదాంతం, లలిత కళలు, సంగీత నాట్యాలకు సంబంధించిన వర్క్‌షాప్‌ల నిర్వహణ కోసం ఇండియా పెర్‌ఫార్మింగ్ ఆర్ట్ ట్రైయినింగ్ సెంటర్‌ని కెన్నింగ్ స్టన్‌లో నెలకొల్పి ప్రాచుర్యం తీసుకొచ్చారు. ప్రముఖ కవి, చిత్రకారుడు హెరాల్డ్ ఎల్విన్స్‌ని వివాహమాడారు. 1968లో బ్రిటిష్ రాణి ఈమె కృషిని గుర్తించి గౌరవించారు. ఇంగ్లండ్‌లోని సెయింట్‌పాల్ కెథడ్రిల్‌లో గాంధి శతజయంతి ఉత్సవాలు సందర్భంగా 1969లో గానం చేసిన తొలి తెలుగు యువతిగా, భారతీయ వనితగా పేరు తెచ్చుకున్నారు. ప్రపంచ తెలుగు మహాసభలను 1975లో హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించినప్పుడు ఈమెను ప్రత్యేకంగా స్టేట్ గెస్ట్‌గా ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. రాజలక్ష్మి ఫాండేషన్ విశిష్ఠంగా సన్మానించే అవార్డుని స్వీకరించడానికి 1985లో మద్రాసు విచ్చేసి పాతజ్ఞాపకాలతో పరవశించారు. తను నెలకొల్పిన స్కూల్‌ని కెన్నింగ్ స్టన్‌లో నిర్వహిస్తూ తెలుగు తల్లి మల్లెపూదండగా గౌరవాన్ని పొందుతూ, తెలుగు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేస్తూ 2005 ఏప్రిల్ 25న మృతిచెందారు.

Image may contain: 2 people, people smiling, closeup

Advertisements

About vskesavarao

I am a Telugu Journalist. I started career as a Journalist 1976 in Andhrapatrika Daily. I am one of the founder member in the Editorial Board of Andhra Bhoomi Illustrated Weekly after February 1977.Latter I worked in Venditera Film weekly. I joined in Chitrabhoomi Film Weekly during 1980 of Kakatiya Publications, Hyderabad. It's Publisher is Mr.D.Bheem Reddy. We brought Aadivaram a Socio Political weekly &and Mayuri Illustrated weekly from this Organisation. I worked for this organisation in Hyderabad &and Madras upto 1983. Later I Joined in EENADU daily and worked until April 1984. Then joined again in Chitrabhoomi. Afterwards ie., during 1986 I joined in Andhraprabha daily in Hyderabad. Madras edition started after a long time and I was sent to Madras., Hyderabad as my headquarters.I worked for Vijayachitra a Film Monthly & Film Tradeguide weekly in Madras until1994.Afterwards I came to Hyderabad and joined in Andhraprabha telugu Daily. Now I am Editor in Charge for Chitraprabha a Thursday Film suppliment of Andhraprabha Daily from 2007.
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s