రస రమ్యకృష్ణ

My article in Harivillu ManaTelangana 10-9-17
రస రమ్యకృష్ణ

నా మాటే శాసనం అంటూ దర్పంగా, రాజసం ఒలకబోస్తూ రాచఠీవితో ఎవరినీ లెక్కచేయని శివగామిగా, చేసిన తప్పు తెలుసుకుని పసిపిల్లవాణ్ణి రక్షించే ప్రయత్నంలో అరచేతిలో పెట్టుకుని పైకి ఎత్తిబట్టి నీటిలో ఈదుతూ మునిగిపోతూ రక్షించిన దృఢసంకల్పం గల స్త్రీగా నటించి ఒక్కసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది రమ్యకృష్ణ. అంతకుముందు హిందీ చిత్రాలు చేసి జాతీయ స్థాయి నటిగా పేరు తెచ్చుకున్నా బాహుబలి చిత్రాల ద్వారా వచ్చిన ప్రతిష్ఠ ప్రత్యేకమే! ప్రత్యేక తరహాలో ఇలాంటి కేరక్టర్ రోల్స్‌లోకి మారక ముందు అంటే 2001 వరకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రరంగాల్లో గ్లామర్‌క్వీన్‌గా, డ్యాన్సింగ్ డాల్‌గా , సెక్స్‌బాంబ్‌గా, గ్లామర్ డాల్‌గా, సెక్స్ సింబల్‌గా పిలుపించుకుంది. ఆ తరువాత అందాల ప్రౌఢగా అనిపించుకుంది. నిజానికి 1985లో వెల్లయ్ మనసు తమిళ చిత్రంలో కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి, 1986లో ముదల్‌వసంతం హిట్ అయినా 1989లో సూత్రధారులు విడుదలయ్యే వరకు ఐరన్ లెగ్ అని పిలుపించుకుంది. రమ్యకృష్ణ,

కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించడం ప్రారంభించాక 1990లో అల్లుడుగారు చిత్రంతో దశ తిరిగి సెక్స్ అప్పీల్ ద్వారా క్రమంగా అన్ని భాషల్లో తారాపథానికి చేరుకుంది రమ్యకృష్ణ. గ్లామర్ క్వీన్‌గా ప్రతిభా సామర్థాలు గల చక్కని నటిగా అందచందాల తారగా చెక్కుచెదరని ఫిగర్‌తో రాణిస్తోంది.

తమిళ అయ్యర్ కుటుంబానికి చెందిన మాయాదేవి, కృష్ణన్ దంపతులకు 1967 సెప్టెంబర్ 15న చెన్నైలో జన్మించింది. ప్రముఖ హాస్యనటుడు , పత్రికాధిపతి , వ్యంగ్య వ్యాసకర్త, తుగ్లక్ పత్రికా సంపాదకుడు చో రామస్వామి రమ్యకృష్ణకు పెదతండ్రి . అంటే మాయాదేవి అక్క భర్త. స్కూల్ చదివే రోజుల్లోనే కూచిపూడి, భరతనాట్యాలలో శిక్షణ పొందింది.

1984లో మమ్ముట్టి , మోహన్‌లాల్ నటించిన మలయాళ చిత్రం నేరం పులరుంబాల్‌లో తొలుత నటించింది. ఈ చిత్రం ఆలస్యంగా అంటే 1986లో విడుదలయింది. కానీ వై.జి. మహేంద్రన్ సరసన రాజి అనే అమాయక యువతిగా నటించిన వెల్లయ్ మనసు తమిళచిత్రం 1985లో విడుదలై తొలిచిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రంలో చిన్నపిల్ల తరహాలో ప్రవర్తించే రాజీని పెళ్లాడిన వై.జి. మహేంద్రన్ దూరం ఉంచుతాడు. ఈ చిత్రం జనాదరణ పొందలేదు. కానీ పాండ్యన్ సరసన నాయికగా నటించిన ముదల్ వసంతం విజయం సాధించింది. మోహన్ గాంధి దర్శకత్వంలో భానుచందర్ హీరోగా నటించిన భలేమిత్రలు చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు 1986లో పరిచయం అయ్యింది.

ఐరన్‌లెగ్ నుంచి గోల్డెన్ లెగ్‌గా…

మదన గోపాలుడు, సంకీర్తన, సంకెళ్లు, భామాకలాపం, బావామరదుల సవాల్ చిత్రాల్లో , 11 తమిళ చిత్రాల్లో, మూడు మలయాళ చిత్రాలలో నాయికగా, సహనాయికగా, ఇతర పాత్రలలో నటించినా గుర్తింపు సరిగా రాలేదు. ఐరన్‌లెగ్ అనే ముద్రను చిత్రసీమలో వేసినందుకు బాధపడుతూనే చక్కని నటిగా నిరూపించుకునే అంశంలో తీవ్రంగా కృషి చేసింది. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో భానుచందర్‌కి నాయికగా పల్లెటూరి యువతి పాత్రలో నటించిన సూత్రధారులతో పేరొచ్చి కెరీర్‌లో కొంత మలుపు తిరిగింది. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో మోహన్‌బాబు సరసన అల్లరిమొగుడు, 1992లో సూపర్‌హిట్ కావడంతో రమ్యకృష్ణ లోని గ్లామర్, సెక్స్ అప్పీల్ మిగతా చిత్రసీమలకూ వ్యాపించి, ఐరన్ లెగ్ ముద్ర చెరిపేసి గోల్డెన్‌లెగ్ అని భావించి కాల్‌షీట్ల కోసం దర్శకనిర్మాతలు ఎగబడేలా చేసింది.

చిత్ర పరాజయాలు,తనకు పడిన ముద్ర కారణంగా 1987లో చాలా తక్కువ మంది జర్నలిస్టులకే ఆమె ఇంటర్వూ అది కూడా పొడి పొడి జవాబులతో లభించేది. ఆ ప్రశ్నలేవో నన్ను అడగండి. నేను జవాబులిస్తాను. చిన్న పిల్ల. ఏమీ తెలీదు అని ఆమె తండ్రి కృష్ణన్ కొందరు జర్నలిస్టులతో అని తనే కొన్ని విశేషాలు చెప్పేవారు. రమ్యకృష్ణను ఇంట్లో కలవకుండా చేసేవారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన బృందావనం, రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో రూపొందిన బంగారు బుల్లోడు, కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన మేజర్ చంద్రకాంత్, ముగ్గురు మొనగాళ్లు, ఇవివి చిత్రం హలో బ్రదర్ వంటి చిత్రాలతో అగ్రనటి అయింది.

కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన అమ్మోరు లో టైటిల్ పాత్రలో దేవతా పాత్రలు పోషించగలనని నిరూపించుకుంది. అమ్మోరు నటించేటపుడు అందరూ చెప్పినట్లు పెద్దగా నియమ నిష్ఠలు పాటించకపోయినా పాత్ర పరిధి గ్రహించి శ్రద్ధగా పాత్రలో ఇమిడి పోయే కృషి చేసానని చెప్పేవారు. రజనీకాంత్‌తో పోటీపడుతూ నీలాంబరి పాత్రలో నటించిన పడయప్ప (తెలుగులో నరసింహగా డబ్ అయింది) చిత్రం వల్ల లండన్, ప్యారిస్, జపాన్‌లలోనూ మంచి గుర్తింపు వచ్చింది. గ్లామర్ పాత్రలైనా మరో భూమికనైనా ఆ పాత్ర పరిధిని బట్టి తనలోని శక్తిసామర్థాలు వినియోగించి ఆ పాత్రకు మెరుగులు దిద్దేలా చేస్తానని ఇందుకు దర్శకుల సూచనలు కారణమని అందుకే తను దర్శకుల నటినని ఆమె చెబుతుంది. సూత్రధారులు, అమ్మోరు, ఆహ్వానం, అన్నమయ్య, కంటేకూతుర్ని కను చిత్రాలలోని పాత్రలు తనకు చాలా సంతృప్తి కలిగించినవని అంటుంది. పడయప్ప ( నరసింహ ) తన కెరీర్‌లో మరపురానిదని చెబుతుంది. గ్లామరస్ పాత్రలతోబాటు సీరియస్ పాత్రలకు , సాధారణ గృహిణి పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ అందచందాలతోబాటు నటనా ప్రతిభ ఉందని నిరూపించుకుంది. దర్శకుల సూచనల మేరకే పాత్రకు అనుగుణంగా సెక్స్‌అప్పీల్ చూపడమో, ఎక్స్‌పోజ్ చేయడమో జరుగుతుందనేది ఆమె అభిప్రాయం.

ఒకటి రెండు పాత్రల వల్లనే చిత్రవిజయం సమకూరదని సమష్ఠి కృషి వల్లనే సాధ్యమవుతుందని నమ్ముతుంది. తనకు పాత్ర నచ్చితేనే అంగీకరిస్తానని అంటుంది. పాత్రల ఎంపికలో భర్త కృష్ణవంశీ పూర్తి స్వేచ్ఛ ఇస్తారామెకు. రమ్యకృష్ణలాగ వుంటదా చెప్పరకన్నా….చెప్పర నాన్నా…అనేపాట చాలు ఆమెకు వెండి తెరమీద ఎంత ప్రాధాన్యత లభించిందో చెప్పడానికి.

తమిళ టెలివిజన్ రంగంలోనూ ప్రవేశించింది. శక్తిమాన్ ప్రోగ్రాంలో 1997 నుంచి 2005 వరకు శాలియా పాత్ర పోషించింది. జోడీ నెంబర్ వన్‌లో జడ్జిగా నటించింది. కలశం, తంగం, వంశం, రాజకుమారి టెలీసీరియళ్లు నిర్మించడమే కాక ప్రధాన పాత్రలూ పోషించింది. నయనతార, తమన్నా, త్రిషల నటనను ఇష్టపడుతుంది. ఈమె స్నేహితులు కూడా.

అమ్మోరు చిత్రం విడుదలయ్యాక రమ్యకృష్ణను దేవతగా భావించినవారు అనేకం. ఓ సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడు ముగ్గురు స్త్రీలు వచ్చి దూరంగా నిలబడ్డారు. రమ్యకృష్ణ వారికేసి చూసినప్పుడు గబగబా వచ్చేసి అమ్మా! తల్లీ దండాలమ్మా! అంటూ చటుక్కున ఆమె కాళ్లపై పడిపోయారట. ఊహించని ఈ సంఘటనకు భయంతో ఒక్కసారి కాళ్లు వెనకకు తీసుకుని ఆశ్చర్యంతో చాలాసేపు అదోలా ఉండిపోయిందట. సమ్మక్క సారక్కలో సమ్మక్కగా, దేవుళ్లు చిత్రంలో దుర్గాదేవిగా,, జై భద్రకాళిలో భద్రకాళిగా, శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి చరిత్రలో ఆదిపరాశక్తి, పార్వతీదేవి పాత్రలలో మెప్పించింది.

రమ్య రహస్యం!

సమయం దొరికితే చిన్నకునుకు తీయడం వల్ల కళ్లకు, కనురెప్పలకు , ముఖానికి, చర్మానికి విశ్రాంతి కలిగి శరీరం మెరుస్తుందని, జుట్టు చిన్నగా ఉంటేనే జాగ్రత్తగా కాపాడుకోవచ్చునని, ఓట్స్, బీన్స్‌ని ఒక కప్పు తింటేరోజంతా శక్తివంతంగా గడుస్తుందనేది ఆమె ఆరోగ్య చిట్కాలు. ఉదయం గోరు వెచ్చని నీరు తాగితే చర్మం పొడిలేకుండా కాంతివంతమవుతుందని వయసు తక్కువగా చూపించే కాస్మటిక్ సర్జరీకి తాను వ్యతిరేకమని అంటుంది. వయసుతో నిమిత్తం లేకుండా ఇంకా కుర్రకారు గుండెలయ వేగాన్ని పెంచుతున్న ఆమె ఆరోగ్య రహస్యం శారీరక సొగసుల రహస్యం ఆమెకే తెలుసు.

రాజు మహరాజులో మోహన్‌బాబు సరసన రమ్యగా, శర్వానంద్‌కి వదినగా చక్కని అభినయం చూపింది. ఉత్తమ సహాయ నటిగా ఈ చిత్రానికి నంది అవార్డు లభించింది. దాసరి దర్శకత్వంలో రూపొందిన కంటే కూతురునే కను చిత్రంలో జ్యోతిగా చూపిన ప్రతిభకు ఉత్తమ నటిగా నంది అవార్డు స్వీకరించింది. కొంచెం ఇష్టం కొంచెం కష్టంలో రాజ్యలక్ష్మిగా, మామ మంచు అల్లుడు కంచులో ప్రియంవదగా, నిరుడు విడుదలై ఘన విజయం సాధించిన సోగ్గాడే చిన్ని నాయనాలో అక్కినేని నాగార్జున సరసన సత్యభామగా చూపిన అభినయం ద్వారా విభిన్న నటనలోనూ రమ్యమే అనిపించుకుంది. 205 చిత్రాలకు పైగా వివిధ భాషల్లో నటించింది. సెప్టెంబర్ 15న రమ్యకృష్ణ పుట్టినరోజు!

Advertisements

About vskesavarao

I am a Telugu Journalist. I started career as a Journalist 1976 in Andhrapatrika Daily. I am one of the founder member in the Editorial Board of Andhra Bhoomi Illustrated Weekly after February 1977.Latter I worked in Venditera Film weekly. I joined in Chitrabhoomi Film Weekly during 1980 of Kakatiya Publications, Hyderabad. It's Publisher is Mr.D.Bheem Reddy. We brought Aadivaram a Socio Political weekly &and Mayuri Illustrated weekly from this Organisation. I worked for this organisation in Hyderabad &and Madras upto 1983. Later I Joined in EENADU daily and worked until April 1984. Then joined again in Chitrabhoomi. Afterwards ie., during 1986 I joined in Andhraprabha daily in Hyderabad. Madras edition started after a long time and I was sent to Madras., Hyderabad as my headquarters.I worked for Vijayachitra a Film Monthly & Film Tradeguide weekly in Madras until1994.Afterwards I came to Hyderabad and joined in Andhraprabha telugu Daily. Now I am Editor in Charge for Chitraprabha a Thursday Film suppliment of Andhraprabha Daily from 2007.
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s