ప్రేమపెళ్లికి నాంది పల ికిన నాయిక: శాంతకుమారి

My article in Harivillu,ManaTelangana 7-5-2017 issue.
ప్రేమపెళ్లికి నాంది పలికిన నాయిక

తొలి చిత్రంతోనే కథానాయికగా, గాయనిగా ప్రవేశించి, ద్వితీయ చిత్రంలో నటిస్తూ దర్శకుడుని ప్రేమించి అతడితో పెళ్లికి అతి కష్టం మీద ఇంట్లో వాళ్లని ఒప్పించగలిగారామె. చిత్రరంగంలో హీరోయిన్, దర్శకుడు మధ్య ప్రేమకు అంకురార్పణ చేసినవారుగా, పెళ్లాడి చక్కని వైవాహికబంధం నెరపిన జంటగా గుర్తింపు పొందారు శాంతకుమారి, పి.పుల్లయ్య దంపతులు. అలా తెలుగు సినిమాల్లో ప్రేమకథలు ఆవిర్భవించడానికి నిజజీవిత సంఘటనలే హేతువవుతాయని వీరితోనే నిరూపణ ప్రారంభమైంది. ద్వితీయ జంటగా భానుమతి, రామకృష్ణారావులకు ఆస్థానం దక్కింది. కడప జిల్లా పొద్దుటూరులో వెల్లాల పెదనర్సమ్మ, శ్రీనివాసరావు దంపతులకు 1920 మే 17న జన్మించింది. ఈమెకు తల్లిదండ్రులు పెట్టిన పేరు సుబ్బమ్మ, తల్లి సంగీత విద్వాంసురాలైనందున చిన్నతనం నుంచే సంగీతం మీద మంచి అభిరుచి ఏర్పడింది. ఆస్తిరుడైన శ్రీనివాసరావు పూర్వీకుల సంపాదనని ఖర్చు చేయడమే పనిగా పెట్టుకున్నారు. చిన్నాన్న ఇంట్లో అల్లారు ముద్దుగా కడపలో పెరిగింది సుబ్బమ్మ.

సంగీతం మీద వున్న అభిరుచి, ఆసక్తిని గ్రహించిన అమ్మమ్మ మద్రాసు తీసుకెళ్లి సంగీత విద్వాంసుడైన ప్రొఫెసర్ సాంబమూర్తి వద్ద శిష్యురాలిగా చేర్పించింది. ఆయన వద్ద గాత్రం, ఫిడేలు నేర్చుకోసాగింది. చిదంబరంలో జరిగే సంగీతం పోటీల్లో స్కూల్ తరపున పాల్గొంది. సాంబమూర్తి ఒకసారి పాడిన పక్కాల నిలబడి కొలిచే… అనే త్యాగరాజకృతిని ఖరహర ప్రియరాగంలో ఆలపించి ఆ పోటీల్లో గుర్తింపు తెచ్చుకుంది. ఒక్కసారి వినే అంత చక్కగా పాడిందనే ఆనందంతో సాంబమూర్తి దంపతులు స్వంత బిడ్డలా చూసుకుంటూ సంగీతంలో మంచి పట్టు సాధించేలా చేశారు. ఆయన వద్ద మూడేళ్లు అభ్యసించి హయ్యర్ గ్రేడ్ సర్టిపికేట్ పొందింది. తను సంగీత కచేరీలు ఇస్తూ, సహాధ్యాయురాలు అయిన డి.కె. పట్టమ్మాచ్చే కచేరీల్లో ఫిడేలు వాయిస్తూ గుర్తింపు తెచ్చుకుంది. గురువు గట్టిగా చెప్పడంతో విధిలేక నుంగంబాకంలోని విద్యోదయ స్కూల్లో సంగీతం టీచర్‌గా చేరి, సుబ్బమ్మ టీచర్‌గా మన్ననలు పొందింది 15వ ఏట నుంచే.

మచిలీపట్నంలో పుట్టిన పి.వి.దాసు నాటకకళ మీద ఆసక్తితో నాటకాలు ప్రదర్శిస్తూ, ఎదుగుతున్న సినీరంగం మీద దృష్టి నిలిపారు. థియేటర్లు నిర్మిస్తూ చిత్ర నిర్మాణం కోసం కలకత్తాయో బొంబాయో వెళ్లాల్సి వస్తోందని తలచి తమిళ మిత్రులను కలుపుకుని మద్రాసులోని కేత స్టూడియో నిర్మించి 1935లో తొలిచిత్రంగా సీతా కల్యాణం తీసి విజయం సాధించారు. తృతీయ చిత్రంగా మాయాబజార్ అనే శశిరేఖా పరిణయం నిర్మించే ఆలోచన చేస్తూ శశిరేఖ పాత్రధారి కోసం అన్వేషించసాగారు. ఒక పెళ్లిలో సంగీత కచేరి చేస్తున్న పదిహేనేళ్ల సుబ్బమ్మని చూశారు. పదేపదే సుబ్బమ్మ వుండే ఇంటికి వెళ్లి సినిమాలంటే ఇష్టపడని అమ్మమ్మని తన ఓర్పుతో నేర్పుతో ఒప్పించారు. యడవల్లి నాగేశ్వరరావు కృష్ణుడుగా, ఎస్.పి.లక్ష్మణస్వామి అభిమన్యుడుగా శ్రీరంజని సుభద్రగా నటించగా గాలి పెంచల నరసింహారావు సంగీత దర్శకత్వంలో 1936లో విడుదల చేసిన శశిరేఖా పరిణయం ఘన విజయం సాధించింది. శశిరేఖగా సుబ్బమ్మ నటించడానికి అమ్మమ్మ, తండ్రి అంగీకరించగానే వెయ్యి నూట పదహార్లు పారితోషికం నిర్ణయించి సుబ్బమ్మ అనే పేరు బాగా లేదని శాంతకుమారిగా పివి దాసు మార్చారు. శశిరేఖగా నటిస్తున్న శాంతాకుమారి ప్రతిభ తెలిసిన స్టార్‌కంబైన్స్ నిర్మాణ సంస్థ రామయ్య, పి.పుల్లయ్య తామూ నిర్మించే సారంగధర చిత్రంలో చిత్రాంగి పాత్రకు ఒప్పించమని దాసుని అడిగారు. తన సినిమా పూర్తయితేగాని హీరోయిన్ మరో సిన్మా చేయవద్దని చెప్పి, సినిమా పూర్తయ్యాక సారంగధర చిత్రం గురించి శాంతకుమారి ప్రభృతులకు చెప్పారు పి.వి.దాసు.

నెల్లూరులో జన్మించిన పి.పుల్లయ్య, చిన్నతనంలోనే తల్లిదండ్రులకు కోల్పోయి మేనత్తల సంరక్షణలో పెరిగి బీదరికంలోనే మద్రాసు లయోలా కాలేజీలో బి.ఎ. పూర్తి చేశారు. రంగస్థల నటుడిగానూ గుర్తింపు పొందారు. బ్రాడ్‌కాస్ట్ రికార్డ్ అనే గ్రామ్‌ఫోన్ సంస్థ అధికారిగా పనిచేస్తుండేవారు. ఊళ్లెమ్మట తిరుగుతూ రంగస్థల కళాకారులను మద్రాసు తీసుకొచ్చి వారి పాటలు పద్యాలను రికార్డ్ చేయించడం ఆయన ఉద్యోగం. అలా ఏర్పడిన పరిచయాలతో టి.ఎ.రామన్, రామయ్యలతో కలిసి స్టార్ కంబైన్స్ నిర్మాణ సంస్థ ఏర్పాటు చేశారు. నిర్మాత కూడా అయిన టి.ఎ.రామన్ దర్శకత్వంలో కొల్హాపూర్‌లో హరిశ్చంద్ర చిత్రం ప్లాన్ చేశారు. అద్దంకి శ్రీరామమూర్తి హరిశ్చంద్రగా, పసుపులేటి కన్నాంబ చంద్రమతి తదితరులు నటించిన చిత్రానికి మాటలు, పాటలు, షూటింగ్ ఏర్పాట్లు చూడడంతో పాటు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పి.పుల్లయ్య పనిచేశారు. ఈ చిత్ర విజయంతో ద్వితీయ చిత్రం సొరంగధరకి పి.పుల్లయ్యకు దర్శకత్వ బాధత అప్పగించారు. సారంగధర టైటిల్ పాత్రకు రంగస్థల నటుడు బందా కనకలింగేశ్వరరావుని ఎంపిక చేసి, అద్దంకి శ్రీరామమూర్తి , శ్రీరంజని ప్రభృతులతో బొంబాయిలో చిత్ర నిర్మాణం జరిపారు. నాలుగు నెలల్లో ఈ చిత్రం పూర్తయి1937లో విడుదలై విజయం సాధించింది.

సరదాగా వుంటూనే ఆర్టిస్టులు సరిగా చేయకపోతే సీరియస్ అయ్యే మొండితనం వున్న 28 ఏళ్ళ పుల్లయ్యను చూస్తూ పదహారేళ్ల శాంతకుమారి మెల్లిగా ప్రేమించసాగింది. మొదటి చూపులోనే ఇష్టపడిన పుల్లయ్య శాంతకుమారిని బేబీ అని పిలుస్తుండేవారు. చిన్న పిల్లలా కనిపిస్తున్నానా, బేబీ అంటారేంటి అని మండిపడేది. ఆయన శైలి మారేది కాదు. అలా పుట్టిన ప్రేమను శాంతకుమారి వ్యక్తం చేయగానే బీదవాడైన నాతో పెళ్ళిని ధనవంతులైన మీ అమ్మమ్మ, నాన్న అంగీకరించరని పెళ్లి జరగదని చెప్పేసారు. 1937లో సినిమా విడుదలై విజయం సాధించాక, శాంతకుమారి తన ప్రేమ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పింది. వాళ్ళు అంగీకరించకపోవడంతో పంతానికి పోయింది. బీదవాడిని అన్న పుల్లయ్యతో దర్శకుడుగా మీరు, నటిగా నేను సంపాదిస్తే బీదరికం ఉండదు. రిజస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. అని హఠం చేసింది. చివరికి పుట్టింటివారు అంగీకరించి వారి స్వగ్రామమైన తెల్లాలలో పెళ్లి చేశారు.

పెళ్లి తర్వాత ఫేమస్ ఫిలింస్ పతాకాన రామయ్య నిర్మించిన వెంకటేశ్వర మహత్యం లేక బాలాజీ చిత్రాన్ని దర్శకుడుగా పి.పుల్లయ్య ఎంపికయ్యారు. సి.ఎస్.ఆర్. ఆంజనేయులు వేంకటేశ్వరుడుగా, శాంతకుమారిపద్మావతిగా, రాజేశ్వరి లక్ష్మీదేవిగా నటించిన ఈసిన్మా 1939 ఫిబ్రవరి 14న విడుదలై కనక వర్షం కురిపించింది. థియేటర్ల వద్ద పెట్టిన హుండీలు నిండిపోయేవి. ఇదే సినిమాని పద్మశ్రీ పతాకాన పుల్లయ్య శాంతకుమారి దంపతులు శ్రీవేంకటేశ్వర మహత్యం (బాలాజీ) పేరుతో నిర్మించి 1960 జనవరి 9న విడుదల చేశారు. ఎన్.టి.ఆర్. వెంకటేశ్వరుడుగా, ఎస్, వరలక్ష్మి లక్ష్మిగా, సావిత్రి పద్మావతి దేవిగా, శాంతకుమారి వెంకటేశ్వరుని తల్లి వకుళమాతగా నటించారు. శేష శైలావాసా శ్రీ వెంకటేశా గీతాన్ని ఘంటసాల పాడుతూ ఈ చిత్రంలో కనిపిస్తారు. అ చిత్రం కూడా అద్భుత విజయం సాధించి థియేటర్ల వద్ద పెట్టిన హుండీలు కానుకలతో నిండిపోయేవి. వెంకటేశ్వర విగ్రహానికి అధికంగా పూజలు జరిగేవి. తొలి వెంకటేశ్వర మహత్యం తర్వాత రాగిణి నెలకొల్పి భక్తజనా, తిరుగుబాటు, ధర్మ దేవత, అర్ధాంగి చిత్రాలను నిర్మించారు. తరువాత పద్మశ్రీసంస్థను నెలకొల్పి వి.వెంకటేశ్వర్లు (శాంతకుమారి తమ్ముడు) నిర్మాతగా, సిరిసంపదలు, మురళీకృష్ణ, ప్రేమించుచూడు, ప్రాణమిత్రులు, కొడుకు కోడలు తదితర చిత్రాలు నిర్మించారు. తెలుగు , తమిళ భాషల్లో మొత్తం మీద ఈ దంపతులు 22 చిత్రాలు నిర్మించారు.

బాగా వస్తోందా?
శశిరేఖా పరిణయంలో నటించేటప్పుడు లక్ష్మణ కుమారుడుతో పెళ్లి నిశ్చయం సందర్భంగా విషాద పద్యం ఒకటి ఆమెతో పాడించారు. “సినిమాకు పాడడం అదే తొలిసారి. ఒక వాక్యం పాడేసి ఎదురుగా వున్న సంగీత దర్శకుడు గాలి పెంచల నరసింహారావుని ఎలా వుంది? అని అడిగాను. ఆయన కోపంతో కట్ చేసి మధ్యలో మాట్లాడకూడదు అంతే పాడేయాలి అన్నారు. నాకు తెలీదు కదా. మళ్లీ కొంత పాడేసి బాగా వస్తోందా అని అడిగాను. మళ్లీ కట్ చేసి చెప్పేశారు. దర్శక నిర్మాత దాసు దగ్గరకు వచ్చి పాట అయినా పద్యమైనా పూర్తిగా పాడేయాలి. మధ్యలో ఆపకూడదు. ఏమీ అడగకూడదు. మేం కట్ చెప్పినప్పుడే ఆపాలి తెలిసిందా? అలా చేస్తే నీకు బోల్డు చాకెట్లు, బిస్కెట్లు కొనిస్తాను. రికార్డింగ్ అయ్యాక అన్నారు. ఇప్పుడు తలుచుకుంటుంటే నవ్వొస్తోంది. అప్పుడు ఏమీ తెలీదు. పైగా చదువూ లేదు అంటూ తన తొలి అనుభవం గురించి ఒకసారి చెప్పారు.

భర్త గురించి వివరణ ఇస్తూ “ముక్కు మీద కోపం ఆయనకు పైగా నోరు తెరిస్తే బూతులు, కోపం క్షణాల్లో పోతుంది. ఆ తర్వాత చూపే ప్రేమ అభిమానం వెలగట్టలేం , చాలా ఆప్యాయత చూపిస్తారు. అందువల్లనే తెలుగు తమిళ హీరోలు ఎన్‌టిఆర్, అక్కినేని , జగ్గయ్య , శివాజీ గణేశన్,ముత్తు రామన్, జెమినీ గణేశన్ ఇలా అందరూ ఆయనను డాడీ అని నన్ను మమ్మీ అని పిలిచేవారు. ఆ ఆప్యాయతలు మరుపురావు. నేను గాయకురాలినైనా ఆ విషయం మరిచిపోయి నాతో పాడించకుండా వేరే గాయకురాలితో పాడించేవారు. అడిగితే నీకు తెలీదు బేబీ నువ్వూరుకో అనేవారు. మరిచిపోయిన విషయం చెప్పేవారు కూల్ చేస్తూ అలా మా సంసార జీవితం చిన్నచిన్న అలకలు పెద్ద పెద్ద ఆప్యాయత అభిమానాలతో సరదాగా సాగిపోయింది.” అని వున్నది వున్నట్టు చెప్పడం ఆమెకే చెల్లింది. ధర్మపత్ని పార్వతీ కల్యాణం, తిరుగుబాటు, మాయాలోకం, మార్కండేయ తదితర చిత్రాలలో నాయికగా నటించిన శాంతకుమారి అర్థాంగి చిత్రం నుంచే కేరెక్టర్ ఆర్టిస్‌గాను కెరీర్ ప్రారంభించారు. గుణ సుందరికథలో గయ్యాళి పాత్ర పోషించారు. అర్థాంగిలో అహంకారంగల జమిందారి ణిగా నటించారు. ఎన్టీఆర్ నటించిన సారంగధరులు తల్లి రత్నాంగిదేవిగా నటించారు. షావుకారులో శాంతమ్మ గా, జయభేరిలో అన్నపూర్ణగా, రాముడు – భీముడులో ఎన్టీఆర్ అక్కయ్య సుశీలగా , తల్లా పెళ్లామాలో ఎన్‌టిఆర్ తల్లిగా నటించారు. సిరిసంపదలు, ప్రేమించిచూడు, అక్కాచె ల్లెలు, ప్రేమనగర్, కొడుకు కోడలు, సెక్రటరీ మా ఇంటి దేవత ఇలా హీరోయిన్‌గా కెరీర్ ఆర్టిస్టుగా తెలుగు, తమిళ భాషల్లో సుమారు 250 చిత్రాల్లో నటించి కరుణ, శాంత, అద్భుత రసాలను చక్కగా పోషించే నటిగా సాత్వికా భినయం చూపడంలోనూ దిట్ట్టగా గుర్తింపు పొందారు.

అలరించే గీతాలు సారంగధర చిత్రంలో చిత్రాంగిగా మోహనాకారా వశమౌనా భరియంప… మోమోటమా విశ్వమోహనాకారా…. మాయలోకంలోని మోహనాంగా రారా…. ఎవరోయీ…. ఎవరోయీ… కృష్ణప్రేమ చిత్రంలో ఊదుమా కృష్ణా… ఇదే ఆనందమా… గుణసుందరికథలో చక్కని దొర చందమామా….శ్రీ వెంకటేశ్వర మహత్సంలోనే గోపాలా నందగోపాలా.. ఎన్నాళ్ళనినా కన్నులు కాయగ ఎదురుచూతురా గోపాలా…. తల్లా పెళ్లామాలోని మమతలెరిగిన ఓ కన్నయ్యా…. తదితర గీతాల ఆలాపానలో శాంతకుమారి చక్కని భావాలను వ్యక్తం చేసి అవి హిట్ సాంగ్స్‌లా నిలిచేలా చేశారు. ఆల్ ఇండియా రేడియో మద్రాసు కేంద్రంలో పలు లలిత గీతాలు, భక్తిగీతాలు ఆలపించి ఆరోజుల్లో చాలా పేరు తెచ్చుకున్నారు. నటన నుంచి విరమించాక సంగీత సాధన వల్ల తన ఆరోగ్యం కుదుటపడతుండేదని చెప్పేవారు శాంతకుమారి. భర్త దర్శకుడు, నిర్మాత, తను నటి అయినా ఇంటిలో మాత్రం సినిమా వాతావరణం కనపడేది కాదని, తమ ఇద్దరు కుమార్తెలు పద్మ, రాధలను సినీవాతావరణాన్ని దూరంగా పెంచామని వారిని గ్రాడ్యుయేట్లు చేశామని శాంతకు మారి అనేవారు. జయభేరి చిత్రంలో ఉత్తమ సహాయనటి అవార్డు పొందారు. 1999లో రఘుపతి వెంకయ్య అవార్డు స్వీకరించారు. 2006 జనవరి 16న చెన్నైలోని స్వగృహంలో మృతిచెందారు.

Image may contain: 1 person, closeup

Advertisements

About vskesavarao

I am a Telugu Journalist. I started career as a Journalist 1976 in Andhrapatrika Daily. I am one of the founder member in the Editorial Board of Andhra Bhoomi Illustrated Weekly after February 1977.Latter I worked in Venditera Film weekly. I joined in Chitrabhoomi Film Weekly during 1980 of Kakatiya Publications, Hyderabad. It's Publisher is Mr.D.Bheem Reddy. We brought Aadivaram a Socio Political weekly &and Mayuri Illustrated weekly from this Organisation. I worked for this organisation in Hyderabad &and Madras upto 1983. Later I Joined in EENADU daily and worked until April 1984. Then joined again in Chitrabhoomi. Afterwards ie., during 1986 I joined in Andhraprabha daily in Hyderabad. Madras edition started after a long time and I was sent to Madras., Hyderabad as my headquarters.I worked for Vijayachitra a Film Monthly & Film Tradeguide weekly in Madras until1994.Afterwards I came to Hyderabad and joined in Andhraprabha telugu Daily. Now I am Editor in Charge for Chitraprabha a Thursday Film suppliment of Andhraprabha Daily from 2007.
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s