My article in Harivillu,ManaTelangana 25-2-18
నవ్వు కదలికలతో నవ్వించిన నటుడు
సన్నగా బక్కపలచిన శరీరంతో, రకరకాలుగా మెలికలు తిరిగి పోతూ, ప్రత్యేక పద్ధతిలో నవ్వుతూ, సంభాషణ పలకడంతో, పలికే విధానంలో హాస్యం గుమ్మరించే ప్రత్యేక శైలి బాలకృష్ణది. బాలకృష్ణకు బాగా అతికిన పేరు, అందరికీ గుర్తుండి పోయే పేరు అంజిగాడు. అంజిగాడు ఎవరో గుర్తొచ్చాడా ? పాతాళభైరవిలో హీరో తోటరాముడు (ఎన్.టి.ఆర్) మిత్రుడు. ఆ చిత్రంలోని విలన్ మాంత్రికుడు ఎస్.వి.రంగారావు శిష్యుడు.’మోసం గురో’ అని అరిచే డింగరి పాత్రధారి పద్మనాభంకి శత్రువు అయిన వాడు. అంతే కాదు కాంతారావు హీరోగా నటించిన గురువును మించిన శిష్యుడులో ‘బలె బలె హిరణ్యకశపునిరా నిన్ను ఇరుచుకు తింటనురా, నరసింహ స్వామినిరా నిన్ను నంచుకు తింటనురా…… ‘అంటూ పాటతో ఆకట్టుకున్నవాడు కూడా. ఇలా చాలా చిత్రాలతో మంచి టైమింగ్‌తో హాస్యాన్ని రంగరించడంతో తరువాత తరంలో హాస్యం పండించిన రాజబాబుకు మార్గదర్శి అయ్యాడు కూడా.
చిన్న తనం నుంచే నాటకాలు చూస్తుండంటంతో నాటకాల పిచ్చోడు అయ్యాడు వల్లూరి బాలకృష్ణ. దాంతో చదువుకు ఎగనామం పెట్టి నాటకాల కంపెనీల చుట్టూ తిరిగేవాడు. రంగస్థల నటీనటులను పరిశీలిస్తూ, నటనను ఒంట బట్టించుకుంటూ మిమిక్రీ చేయడం కూడా నేర్చుకున్నాడు. తరువాత సినిమా పిచ్చోడుగా మారి కలకత్తాలో సినిమాలు తీస్తున్నారని తెలుసుకుని రైలెక్కి కలకత్తా చేరుకున్నాడు. అక్కడ సినిమాలు తీసేవారి చుట్టూ, నాటకాలు వేసేవారి చుట్టూ తిరుగుతూ తన బక్కపలచని శరీరాన్ని అష్టవంకర్లు తిప్పుతూ, ప్రత్యేక తరహాలో నవ్వుతూ ఆకట్టుకున్నాడు. అప్పట్ల్లో ప్రముఖ రంగస్థల నటులైన మాధవపెద్ది వెంకట్రామయ్య, యాడవల్లి లక్ష్మయ్య, సురభి కమాలాబాయితో డి.జె.గునే దర్శకత్వంలో వెంకటనారాయణ నిర్మించిన విజయదశమి చిత్రంలో సినీ రంగ ప్రవేశం చేసాడు. ఈ చిత్రానికి కీచక వధ అని కూడా పేరుండేది. 14-1-1937లో ఈ సిన్మా విడుదలైంది. సురభి కమలాబాయికి మాధవ పెద్దకి మంచి పేరు తెచ్చింది. సినిమా ప్రయత్నాలు
చేస్తూ హిందీ చిత్రాల్లోనూ నటిస్తూ కలకత్తాలో ప్రదర్శంచే తెలుగు నాటకాల్లోనూ చిన్న పాత్రలు చేసేవాడు. ఆ తరువాత ఆంధ్ర దేశం చేరుకుని పువ్వుల సూరి బాబు నటించే తారాశశాంకం నాటకంలో హాస్య ద్వయం లంబు జంబుల్లో ఒకడిగా నటించి పేరు తెచ్చుకున్నాడు. ఇక హాస్య పాత్రలే లభించేవి. తారాశశాంకంని శోభన్‌బాబు దేవికలతో మానాపురం అప్పారావు దర్శకత్వంలో సినిమాగా తీసి 1969లో విడుదల చేస్తే అందులో జంబుగా బాలకృష్ణ, లంబుగా అల్లు రామలింగయ్య నటించి తమ హాస్యంతో ప్రేక్షకులను అలరించారు.
తారా శశాంకం నాటకం చూసిన దర్శకుడు కె.వి.రెడ్డికి బాలకృష్ణ ప్రదర్శించిన హాస్య, వికారపు వింతనవ్వు ఆకర్షించి, పాతాళ
భైరవిలో అంజిగాడు పాత్రయిచ్చి ఆ తరహాలోనే నవ్వమని, అష్టవంకరలు పోతూ నటించమని సూచించారని, ఆ నటనే విజయా సంస్థలో బాలకృష్ణను పెర్మనెంట్ ఆర్టిస్టుగా నెలసరి జీతం వచ్చే ఏర్పాటు చేయించిందని ప్రముఖ జర్నలిస్టు, నటుడు, ప్రముఖ రచయిత రావి కొండల రావు ఉదహరించేవారు. జానపద బ్రహ్మగా గుర్తింపు పొందిన దర్శకుడు విఠలాచార్య చిత్రాలలోను తప్పనిసరిగా వేషాలు బాలకృష్ణకీ లభించడానికి కారణం కూడా ఈ నటన, హాస్యం, నవ్వే అని ఆయన పేర్కొంటూంటారు. అంజిగాడు పాత్రకు పాతాళభైరవిలో ఎప్పుడు ఎప్పుడు ఎలా నవ్వాలో, ఎక్కడెక్కడ ఎలా నటించాలో రిహార్సిల్స్ చేసేటప్పుడు కె.వి.రెడ్డి గారు చెప్పి చేయించడంతోనే అంజిగాడుగా అందరికీ గుర్తుండిపోయాను అని బాలకృష్ణ రావి కొండలరావుతో తరచు చెప్పేవారట.
రంగస్థల నటుడుగా నాటక ప్రదర్శనకు వివిధ ఊళ్ళు వెళ్లేటప్పుడు ఆవూళ్లలో వుండే వాళ్ళు మాట్లాడుకునే యాసను పట్టేసే లక్షణం ఎక్కువగా వుండేది. దానికితోడు మిమిక్రీ కూడా చేతనవడంతో అక్కడ వాళ్లను ఇట్టే ఆకట్టుకుని వాళ్లలో కలిసిపోయేవాడు. విశాఖపట్టణం యాస, శ్రీకాకుళం యాస, ఉభయగోదావరి జిల్లాల యాస, నెల్లూరు, గుంటూరు యాస తెలంగాణ యాస ఇలా అన్నిటినీ తనలోవంట బట్టించు కున్నాడు బాలకృష్ణ.ఏ యాసలో కావాలంటే ఆయాసలో డైలాగులు చెబుతూ, శరీరాన్ని అష్టవంకర్లు తిప్పుతూ, ముఖంలోనూ, నడకలోనూ, చేతల్లోనూ వివిధ భావాలు ప్రస్ఫుటింప చేస్తూ హాస్యంతో అలరించేవాడు.
చిన్న ఇల్లు, ఏడుగురు ఆడపిల్లలు వరసగా, ఓ చిన్న కా రు
వుండేవి. సినిమాల్లో వచ్చే ఈ ఆదాయంతో వీళ్లందరికీ పెళ్లిళ్లు చేసి అత్తారిళ్లకు ఎలా సాగనంపుతానో కదా అని తనలో తాను అనుకుంటూ సన్నిహితులతో తన వేదనని పెదవుల మీద నుంచే నవ్వుతూ పంచుకునేవాడు.
మాయాబజార్ చిత్రంలో సారధిగా మిగతా హాస్యనటులతో కౌరవులను ఆహానిస్తూ దయచేయండి దయచేయండి తమంత వారిక లేరండీ…. పాటలో నవ్వులు పూయించాడు. మిస్సమ్మ చిత్రంలో డిటెక్టివ్ రాజుననే అక్కినేని అసిస్టెంట్‌గా, గుండమ్మ కథలో హోటల్ సర్వర్‌గా, దొంగరాముడులో వంట వాడిగా, పెళ్లిచేసి చూడులో సింహాద్రిగా, దేవత చిత్రంలో సినీ నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర మహాత్యంలో వకుళాదేవి శిష్యుడుగా, శ్రీనివాసుడుగా నటించిన ఎన్.టి.ఆర్ స్నేహితుడు అనంతగా, పాండురంగ మహాత్యంలో రామదాసుగా, వినాయక చవితిలో వసంతుడుగా నటించి ప్రేక్షకులను తనివి తీరా నవ్వించాడు. బాలకృష్ణలా ప్రత్యేకంగా నవ్వడానికి, వెకిలిగా నవ్వి ఇతరులను నవ్వించడానికి ఆ రోజుల్లో చాలామంది ప్రయత్నించే వారు.
అగ్గిదొరలో కాంతారావు మిత్రుడు సారంగుడుగా వినాయకుడు మీద గొడుగు చూసి అందులో ఏముంది తాటాకు వెదురు బొంగు అంతేగా అని దాన్ని పట్టుకుని ఎగిరిపోతూ చూపిన నటన, ఇంద్రలోకం అనుకుని యువతుల బారిన పడి తప్పించు
కోడానికి ఆయాస పడటం, వాళ్లతో గుంజీలు తీయించడంలో నవ్వులు పూయించాడు. సువర్ణ సుందరి చిత్రంలో రేలంగి, రమణారెడ్డితో కలసి అక్కినేనిని మోసం చేసే సన్నివేశాల్లో హాస్యంతో బాటు విలనిజమూ పండించారు. గురువుని మించిన శిష్యుడులో కాంతారావు తమ్ముడుగా యువరాజు పాత్రలో భూతాన్ని వదిలించడానికి ఒక పాట పాడే సన్నివేశాల్లోనూ మెప్పించాడు.
నవగ్రహ పూజామహిమలో అవకాశవాదిని ముప్పుతిప్పలు పెట్టి బుద్ధి వచ్చేలా చేసిన నౌకరుగా మంచి హాస్యం ప్రదర్శించాడు. ఆడపెత్తనం, పెళ్తినాటి ప్రమాణాలు, చిట్టి చెల్లెలు, కలసివుంటే కలదు సుఖం మున్నగు సాంఘిక చిత్రాలలో, లక్ష్మీ కటాక్షం, ప్రతిజ్ఞాపాలన, అగ్గివీరుడు, పిడుగు రాముడు, జ్వాలాద్వీప రహస్యం, మదన కామరాజు కథ, పరమానందయ్య శిష్యుల కథ వంటి జానపద చిత్రాలలో, శ్రీ కృష్ణతూలాభారం, శ్రీ కృష్ణ విజయం, నర్తన శాల మున్నగు పౌరాణిక చిత్రాలలో, బొబ్బిలి యుద్ధం, భట్టి విక్రమార్క వంటి చారిత్రక చిత్రాలలో ఇలా వందకు పైన చిత్రాలలో పొట్ట చెక్కలయ్యేలానే కాకుండా, కరుణ ప్రధానంగాను, అమాయకత్వం, వెర్రి బాగులతనం ఉట్టిపడేలాను నటించిన విలక్షణ హాస్య నటుడు బాలకృష్ణ. తన పుట్టిన రోజునాడు నటులను సన్మానించాలని నిర్ణయించుకున్న ప్రముఖ హాస్యనటుడు, నిర్మాత రాజబాబు ”తన నటనకు ప్రేరణ బాలకృష్ణ ” అని అంటూ తొలి సన్మానం బాలకృష్ణకే అపూర్వంగా చేసాడు. చిన్న చిన్న డైలాగ్స్‌తో పెద్ద పెద్ద భావాలు పలికిస్తూ శరీరాన్ని అష్టవంకర్లు పోయేలా చేస్తూ హాస్యరసపోషణలో దిట్ట అనిపించుకున్నాడు అంజిగాడుగా పాపులర్ అయిన బాలకృష్ణ…..