Subject: దాసరి ఉదయం
‘ దాసరి ఉదయం ‘
కంప్యూటర్ బ్రైన్,
ఫుల్ చార్జిలో వున్న రోబో !!
మే 4వ తేదీ అంటే హైదరాబాదులో ఎంత హడావుడో, దాసరి నారాయణరావు గారి ఇంట.దాసరి జన్మ దిన సందర్భంగా 4వ తేదీన ఆయన ఇంటి పరిసరాలు
ఒక తిరునాళ్లు,ఒక జాతర,ఒక సంబురం,ఒక గొప్ప పండుగ వాతావరణాన్ని తలపింపచేసేవి.చిత్ర రంగంలోని 24 క్రాఫ్ట్లవారే కాకుండా వివిధ రంగాలకు చెందిన వారి రాకపోకలతో కళకళలాడిపోయేది.విద్యార్థులకు స్కాలర్ షిప్పులు, వేషాలు లేక వెనుకబడిన ఆర్టిస్టులకు, సాంకేతిక నిపుణులకు ఆర్థిక సాయం (ఈ అంశాల్లో
హాస్య చిత్రాల దర్శకుడిగా పేరొందిన రేలంగి నరసింహారావుదే ప్రముఖ పాత్ర ) ,వచ్చిన వారందరికీ ఉపాహారాలు, భోజనాలు సమకూర్చడంవల్ల గొప్ప తిరునాళ్లు జరుగుతున్నట్టే వుండేది. గతంలో మద్రాస్ హబిబుల్లా రోడ్లో దాసరి నారాయణరావు శ్రీమతి దాసరి పద్మ ప్రారంభించిన ఈ పుట్టినరోజు వేడుకలు హైదరాబాదుకు
తరలి వచ్చాక మరింత పుంజుకున్నాయి.దాసరి పుట్టిన రోజు సంవత్సరం బట్టి తూర్పుగోదావరి నుంచి అన్ని కిలోల బరువు స్వీట్లు ఆయన అభిమాని ప్రతి ఏడూ తీసుకువచ్చేవారు. పాలకొల్లులో నాటక రచయతగా కెరీర్ ప్రారంభించి, హైదరాబాద్ లో కొనసాగించి,మద్రాసులో సినీ రచయతగా కాలిడి,కె. రాఘవ నిర్మించిన
‘తాత మనవడు ‘ తో చిత్రదర్శకుడై విజృంభించారు. దర్శకుడుకి అద్భుత స్థానం అటు చిత్ర రంగంలోను,ఇటు ప్రేక్షక లోకంలోను కల్పించారు. ఎందరో కొత్త నటీ
నటులను, టెక్నీషియన్లను పరిచయం చేసారు. నాటి అగ్ర హీరోల కెరీర్ మసక బారుతూ వుంటే వాళ్లను మళ్లీ అగ్ర హీరోలుగా చలామణి అయ్యే చిత్రాలు తన
దర్శకత్వంలో రూపొందించారు. తన కథ, మాటలు,పాటలు, నాటకీయతతో,సింబాలిక్ షాట్లతో సినిమాను రక్తి కట్టించేవారు. .
దాసరిది కంప్యూటర్ బ్రైన్. పరిచయం అయిన ప్రతి ఒక్కరినీ పేరుతో పిలిచి దగ్గరకు తీసుకునేవారు.ఫుల్ చార్జిలో వున్న రోబో మాదిరి అలసట ఎరుగక
పని చేసేవారు. రాత్రి పన్నెండు దాటే వరకు డబ్బింగు, ఎడిటింగ్, మ్యూజిక్ సిట్టింగ్, కథా చర్చలు ఇలా పాల్గొని తెల తెలవారుతూనే ఆయన కోసం ఎదురు
చూసె వారితో మాట్లాడి షూటింగ్,పాటల రికార్డింగ్, రచన వంటి వాటిల్లో మమేకమయ్యేవారు. నిర్మాతగా, పంపిణీదారుగా ఎదుగుతూనే పత్రికా రంగంలోను ఉదయం,శివరంజని వంటి పత్రికలతో తన గొప్ప వునికి చాటారు. సమస్యలు పరిష్కరించడంలో తన ప్రత్యేకత చూపి పెద్దాయన అనిపించుకున్నారు.
రాజ్యసభ సభ్యునిగా కేంద్ర మంత్రిగా గొప్ప సేవలు చేసారు. అంతకు ముందు ఆయనను చాలమంది మేస్త్రి అనేవారు.
13సార్లు నందీ అవార్డులు, రఘుపతి వెంకయ్య అవార్డు, 2 సార్లు జాతీయ స్థాయిలో అవార్డులు లభించిన ఆయన పుట్టిన తేదీకి 10 రోజుల ముందే
ఆయా పత్రికల ప్రచురణ తేదీల అనుసరించి, టీ.వీ వారి అవసరాలను బట్టి ఇంటర్వ్యూలు చేసేవారితో దాసరి ఇల్లు నిండిపోయేది !
‘ దాసరి ఉదయం ‘
దాసరితో జర్నలిస్టులకు ఎక్కువ అనుబంధం ఉండేది. నన్ను చూడగానే ” రా కేశవరావు ” అని నవ్వుతూ పిలిచేవారు. ఎంత బిజీగా వున్నా నాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఎక్కువ సమయం మద్రాసులో, హైదరాబాద్ లోను కేటాయించేవారు.నేను మద్రాసులో చిత్రభూమి,ఆదివారం వార పత్రికల ప్రత్యేక ప్రతినిధిగా/చీఫ్ రిపోర్టర్ గా పని చేస్తూన్నప్పుడు -1981 ఏప్రిల్ రెండవ వారంలో ‘ దాసరి ఉదయం ‘ అనే శీర్షికతో ఇంటర్వ్యూ చేసి ఫొటోలతో హైదరాబాద్ కార్యాలయానికి పంపిస్తే ఇంకో రోజు కూడా కొనసాగించమన్నారు. సరే అని, దాసరి అంగీకరించడంతో మరి కొంత జోడించాను. 28-4-1981 చిత్రభూమి సంచికలో ‘ దాసరితో రెండు ఉదయాలు ‘ శీర్షికతో రెండు పేజీల్లో ప్రచురణ అయింది. మొదట్లో జర్నలిస్టుగా కూడ పనిచేసి చిత్రరంగానికి వెళ్లిన ఆయనను కూడాఈ శీర్షిక పురికొల్పిందో ఏమో (అప్పటి వరకు వివిధ శాఖలతో సినీ రంగంలో బిజిగా వున్న ఆయనకు పత్రికా రంగం వైపు అడుగిడే ఆలోచన అయితే వున్నట్టు మాట మాత్రంగా కూడా అనలేదు ) కాని దాసరిని పత్రికా రంగం వైపు తరువాత అడుగులు వేసేట్లు చేసింది. అందుకేనేమో ‘ ఉదయం ‘ దిన పత్రిక 1984లో అనేక ఎడిషన్లతో ప్రారంభించడమే కాకుండా ఒకేసారి నాలుగు పత్రికలు ‘ శివరంజని ‘ సినిమా వార పత్రిక, ‘ తాత మనవడు ‘ ఇలా తీసుకువచ్చి సంచలనం సృష్టించారు. అవి మంచి పేరు తెచ్చాయి . అయితే కొందరు స్వార్ధపరుల కారణంగా అవి కొంత కాలానికి మూతపడ్డాయి.మళ్లీ పత్రికా రంగంలోకి అడుగిడాలన్న దాసరి నారాయణరావు కోరిక స్వార్ధపరుల కారణంగా నెరవేరలేదు.
*నేను ఆయన పత్రికల్లో పని చేయలేదు.*
దర్శకులకు రచయతలకు ఎనలేని పేరు తెచ్చిన దాసరిని మరువలేం.!!
– కేశవరావ్/వి.ఎస్.కేశవరావ్/ వడ్డూరి చెన్నకేశవరావు
- dasarito 2 udayalu 1
- dasarito 1
- dasari 4 1