My aricle about Gummadi in Harivillu 0f Mana Telangana 10-7-2016

On Sunday, July 10, 2016 5:58 PM, kesavarao vadduri <kesavaraovadduri@yahoo.com> wrote:

గుణచిత్ర నటనకు గుడి గుమ్మడి

Jul 03,2016
Gummadi-Special-Storyదేశం గర్వించదగ్గ నటుల్లో, భారత చలన చిత్రసీమలో ప్రథమ శ్రేణిలోని ఉత్తమ నటుల జాబితాలో చక్కని స్థానం వున్న నటుడు గుమ్మడి. చేయాల్సిన పాత్రను కూలంకషంగా అర్థం చేసుకుని దానికి జీవం పోయడంలో ఆయనకు ఆయనే సాటి. సంభాషణని భావ వ్యక్తీకరణతో పాటు నడిపిస్తూ ఆరోహణ, అవరోహణలతో మాటల మాయచేయగలరు. క్షణంలో ముఖకవళికలను మార్పు చేయగలగడంలో సమర్థుడు. అందువల్లనే తేనె పూసిన కత్తిలాంటి పాత్రలు, పాలిష్ట్ విలన్ పాత్రలకు చిరునామా అయ్యారు. అలాగే కరుణ రసాన్ని ప్రేక్షకుల గుండెల్లో కదిలి, సానుభూతి వెల్లువల్లా వచ్చిపడేలా ప్రదర్శించడంలోనూ ప్రత్యేకతను పెంపొందించుకున్నారు. అందుకే ఆడపిల్లలు గుమ్మడిని చూస్తే, ‘గుమ్మడినాన్న’ అనడం, ఆయన చేసిన కొన్ని తండ్రి పాత్రలు (అంతస్తులు వగైరా) చూసిన మగపిల్లలు ‘బాబోయ్ గుమ్మడి నాన్న’ అని భయపడటం జరిగింది. జరుగుతుంది కూడా! పాత్ర పరిధిని అతిక్రమించకుండా, ఆ సన్నివేశంలోని ఇతర నటీనటులను డామినేట్ చేయకుండానే తన పాత్రవైపు ప్రేక్షకుల దృష్టి మళ్లేలా చేసుకునేంత ప్రజ్ఞాశాలి గుమ్మడి.
సినీనటుడుగా కెరీర్ ప్రారంభం నుంచి, చాలా కాలం వరకు ఆయనకు, అత్యంత ఆప్తమిత్రులు రచయిత, దర్శకుడు గోపిచంద్, ఎన్.టి.రామారావు. ఆ తరువాత చాలా మంది మిత్రులతో సినిమాలు, సాహిత్యంకి సంబంధించిన చర్చలు జరుపుతూ తను నమ్మింది అనుకున్నది కుండబద్ధలు కొట్టినట్లు లాజిక్‌తో చెప్పేవారు. ఆ చర్చ అనంతరం మళ్లీ మామూలు గానే వుండేవారు. ఎవరైనా బాగా నటించినా, ఏ సినిమా అయినా చాలా బాగున్నా, కథగాని, పుస్తకం గాని అద్భుతంగా వున్నా దాని గురించి తనకు తెలిసిన అందరికీ ‘టాం టాం’ వేస్తేగాని తృప్తి చెందేవారు కాదు. ఎన్‌టి.రామారావు, గోపీచంద్‌ల కారణంగానే చిత్రపరిశ్రమలో నిలదొక్కుకున్నారు గుమ్మడి. ఆ కృతజ్ఞతతోనే కాబోలు తను ఏ పాత్ర అయినా చేయలేకపోయినా, సరిపోనని తెలుసుకున్నా ఎవరు ఆ పాత్ర చేయగలరో సూచించి సిఫారసు చేసేవారు. అలా అవకాశాలు పొందిన వారిలో కాంతారావు, కె.వెంకటేశ్వరరావు (కన్నె వయసులోని నటుడు) ప్రభృతులున్నారు.
వాగ్ధాన బుద్ధుడు
చదువుకునే వయసునుంచి వామపక్ష రాజకీయాల సానుభూతిపరుడు, విమర్శకుడు. అభ్యుదయ భావాలతో వుండేవారు. పుచ్చలపల్లి సుందరయ్య అంటే అంతులేని అభిమానం. అందుకేనేమో భవిష్యత్తులో రాజకీయరంగంలోకి అడుగిడకుండా వుంటానని ఇంట్లో పెద్దల ఒత్తిడికి వాగ్దానం చేశారు. సినిమాల కోసం మద్రాసులో ప్రయత్నం చేస్తున్నప్పుడు హీరో వేషం కోసమని సూటు బూటు ధరించి బయల్దేరితే గోపీచంద్ గుమ్మడిని చూసి నవ్వుతూ “ నీ వ్యవహరశైలికి, సాత్విక స్వభావానికి, నీ పర్సనాల్టీకి పెద్దరికం ఉట్టిపడే పాత్రలే సరిపోతాయి. హీరో పాత్రలో రిస్క్ వుంది. హిట్ కాకపోతే జీరో అవుతావు” అని వివరణాత్మకంగా చెప్పారు. ఇక అప్పటి నుంచి కేరక్టర్ రోల్స్‌కే పరిమితమయ్యారు. అంతేకాదు, 25-30ఏళ్ల వయసులో తెరమీద 60 సంవత్సరాలు పైబడినవాడిగా నటించి మెప్పించారు. అసలు తన 15వ ఏట తొలిసారి నాటకం వేస్తూ ఎనభై ఏళ్లు దాటిన వద్ధుడిగా నటించి ఉత్తమ నటుడు బహుమతిని పొందారు. స్కూల్లో చదువుకునే రోజుల్లో అలవాటైన పంచె, కండువాతోనే ఇంటా, బయటా (సినిమాల్లో వేషాలపరంగా వేరేరకంగా వున్నా) కనిపించేవారు. ఖద్దరు పంచె, ఖద్దరు లాల్చీ, కండువా చక్కగా ధరించి అసలైన తెలుగువాడు అనిపించుకునేవారు.
అభిమానం
రంగస్థల నటుడు మాధవపెద్ది వెంకట్రామయ్య, రంగస్థల, చిత్ర నటుడు ఎస్.వి.రంగారావు, హిందీ నటులు అశోక్‌కుమార్, బలరాజ్ సాహ్నీ, ఉత్తమ్‌కుమార్, నటి సుచిత్రాసేన్, నర్గీస్‌లంటే అధిక అభిమానం. తొలిదశలో సినీనటనలో తన గురువు మాధవపెద్ది వెంకట్రామయ్యను, తన అభిమాన నటుడు ఎస్.వి.రంగారావుని మూడు నాలుగు చిత్రాల వరకు అనుకరించి, అనుసరించి , తరువాత తరువాత తనకంటూ ప్రత్యేకశైలి ఏర్పరచుకున్నారు గుమ్మడి వెంకటేశ్వరరావు. గుమ్మడి, ఎస్.వి. రంగారావుల మధ్య నటన విషయంలో చక్కని పోటీ. అదీ ఆరోగ్యకరమైన పోటీ వుండేది. ఒకరిని మించి మరొకరు చేశారనిపించుకునేవారు. నిజానికి ఎస్.వి.ఆర్ మరణించాక,పోటీ లేని కారణంగానో ఏమోగాని కొంతకాలంపాటు పాత్రల పరంగా నటనాపరంగా గుమ్మడి కొంచెం తగ్గారు.
పాత్ర పోషణ – స్వగృహ జీవనం
ఏ పాత్రలో అయినా గుమ్మడి జీవిస్తాడు అని అందరూ అనేవారు. గుమ్మడి హబిబుల్లా రోడ్‌లో ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేసి అందరినీ ఆహ్వానించారు. వచ్చినవారికి ఇల్లు చూపిస్తూ ఏ గది ఎందుకు నిర్మించారో కూడా చెప్పారు. అంతా అయ్యాక అందరూ ఒకచోట కూర్చున్నారు. మాటల సందర్భంలో ‘ఏ పాత్రలోనైనా గుమ్మడి జీవిస్తారు’ అని ఒకరిద్దరు అన్నారు. వెంటనే మిత్రుడు ఆరుద్ర కలుగజేసుకుని “ఇంత చక్కని ఇల్లు కట్టుకున్నాక పాత్రలో జీవించే కర్మ ఆయనకేం పట్టింది. ఈ ఇంట్లోనే జీవిస్తారు. పాత్రలను పోషిస్తారు” అని చమత్కరించడంతో అందరూ నవ్వుకున్నారు పడీ పడీ. దీనికి గుమ్మడి మరింత కొనసాగింపుగా అనేవారు ఎవరైనా మీరు ఎక్కుడుంటున్నారు అంటే? “అదే ఇల్లు- అదే భార్య లేదా ఒకే ఇల్లు-ఒకే భార్య” అని చెప్పేవారు నవ్వుతూ. మద్రాసు వచ్చిన బంధువులు, స్నేహితులు ఎవరైనా తన ఇంటికి రాకుండా వెళ్లిపోతే వారికి ఫోన్ చేసేవారు గుమ్మడి. “మీరు వచ్చినప్పుడు’…. సినిమా పాత్రలో జీవిస్తున్నాను అనుకున్నారా ఏమిటి? షూటింగ్ అయిపోయాక తిన్నగా ఇంటికి చేరుకుంటాను. ఎక్కడకీ వెళ్లను ఇంట్లోనే జీవిస్తాను. పాత్రలో జీవిస్తున్నాననుకుని ఇల్లు లేదనుకుని రాలేదా ఏమిటి?” అని అడిగేవాడినని గుమ్మడి సరదాగా చెప్పేవారు.
పరస్పర విరుద్ధమైన పాత్రలు పోషించి ‘వశిష్టుడు- విశ్వామిత్రుడు, దశరథుడు-పరశురాముడు, ధర్మరాజు- బలరాముడు… వగైరాలతో ప్రశంసలు పొందారు. సిన్సియర్ పోలీస్ అధికారిగా ‘భలేరాముడు, దొంగల్లో దొర, శభాష్‌రాముడు, కానిస్టేబుల్ కూతురు, డాక్టర్ చక్రవర్తి తదితర చి్రత్రాలతో, కరడుగట్టిన విలన్‌గా ‘ఏది నిజం, ఇద్దరు మిత్రులు, నమ్మినబంటు, జగత్‌కిలాడీలు వగైరాలతో దుర్మార్గుడిగా సతీసుమతి, అపూర్వ సహస్ర శిరచ్ఛేద చింతామణి, వీరకంకణం, రాజమకుటం తదితర చిత్రాల్లో చక్కని ప్రతిభ చూపారు.
కేరక్టర్ ఆర్టిస్టుగా, గుండెపోటు వచ్చి ఆఖరుమాట చెబుతూ చనిపోయే తండ్రిగా అద్భుత నటన చూపారు. ‘కేరక్టర్ యాక్టర్‌కి’ గుణ చిత్ర నటుడు’కి వివరణ ఇమ్మని అడిగితే” సినిమాలో / నాటకంలోని కేరక్టర్‌ను ముందుకు తెచ్చి,యాక్టర్‌ను వెనుక వుంచగలిగేవాడే కేరెక్టర్ యాక్టర్‌” అని చెప్పేవారు జర్నలిస్టులతో.
తన సహజ స్వభావానిక భిన్నంగా వుండే విలన్ పాత్రలు పోషించడానికి ఇబ్బంది పడుతూనే అత్యద్భుతంగా పరకాయప్రవేశం చేసి ప్రేక్షకులతో ‘వీడిని చంపేయాలి’ అని అనిపించుకునేవారు.
– వి.ఎస్. కేశవరావు

Posted in Uncategorized | Leave a comment

సుమధుర హాసిని సుహాసిని!Hari villu ManaTelangana 18-7-2016

On Monday, July 18, 2016 11:50 AM, kesavarao vadduri <kesavaraovadduri@yahoo.com> wrote:

సుమధుర హాసిని సుహాసిని!

Suhasini-Storyసుహాసిని స్వచ్ఛమైన నవ్వుకు దర్పణం. అందుకే సుమధుర హాసిని అయింది. పెదవులే కాదు ఆమె నాసిక కూడా అందమైన నవ్వులు వెదజల్లుతుంది. ఈ కారణంగా ఆమెను “నాసిక హాసిని’ అని కూడా సన్నిహితులు పిలుస్తారు. నటన ప్రారంభించిన నాటి నుంచి అంటే 1979 నుంచి ఇప్పటి వరకు స్లిమ్ పర్సనాల్టీతోనే కొనసాగుతూండటం ఆమెలోని ప్రత్యేకత. అంతేకాదు చిత్ర పరిశ్రమలోని పలువురికి హితురాలిగా, స్నేహితురాలిగానూ గుర్తింపు తెచ్చుకుంది. భారతి, పంకజం, సుహాసిని అంటూ మూడు పేర్లు పెట్టారు ఈమెకు బాలసారె సమయంలో తల్లిదండ్రులు. సినిమాటోగ్రాఫర్ (ఛాయగ్రా హకురాలు) కావాలనే లక్షంతో రామేశ్వరం సమీపంలోని పరమాకుడి స్వస్థలం నుంచి మద్రాసు చేరుకుంది. తమిళ అయ్యంగార్ కుటుంబానికి చెందిన ఆమె తండ్రి చారుహాసన్. ఆమె తాత వలెనే ప్రముఖ లాయర్ ఛాందస వాది కూడా. అయినా తమ్ముడు కమల్‌హాసన్‌ని బాల్యం నుంచి నటనలో ప్రోత్సహించాడు. కూతురు సుహాసినిని ఇంజనీర్ చేయాలని తలచాడు. సాహిత్యానికి సంబంధించిన కోర్సులు చదివించాలని తల్లి ఆలోచన. సినిమా టోగ్రాఫర్‌ని చేయాలని, చేస్తానని అన్నా, వదినలతో వాదించి, ఒప్పించి మద్రా సు తీసుకొచ్చి ఫిలిం ఇన్‌స్టిట్యూట్ లో కమల్‌హాసన్ చేర్పించాడు. చిత్రరం గంలో ఒక్క ఛాయాగ్రాహకురాలు కూడా లేదనే భావన కమల్‌కి. అందుకే 150 మంది అబ్బాయిల మధ్య ఒక్క సుహాసిని మాత్రమే అప్పుడు సినిమాటోగ్రఫీ కోర్స్ నేర్చుకుంది. ఆ రోజుల్లో ఎల్డామ్స్ రోడ్‌లోని కమల్ హాసన్ ఇల్లు చిత్ర రంగంలోని వివిధ శాఖలకు చెందిన వారి మధ్య చర్చలతో కళకళలాడుతూంటే సుహాసినికి సినిమా మీద ఆసక్తి కూడా పెరిగింది. అప్పటి ప్రముఖ ఛాయాగ్రాహకుడు అశోక్ కుమార్ వద్ద ఛాయాగ్రహణంలో అసిస్టెంట్ గా చేరి ‘ఉదిరి పూక్కళ్’, రజనీకాంత్ నటించిన ‘జానీ’ చిత్రాలకు పని చేసింది. ‘ఉదిరి పూక్కళ్’ చారుహాసన్ నటించిన తొలి చిత్రం.
చిత్ర విచిత్రాలు
సుహాసినిని గమనిస్తున్న దర్శక నిర్మాత జె.మహేం ద్రన్ ఆమెను నటిని, నాయికను చేయాలని తలచాడు. అందుకు తండ్రి చారు హాసన్ అంగీకారం చెబితే కమల్‌హాసన్, రజినీకాంత్ అభ్యంతరం వ్యక్తం చేశా రు తీవ్రంగా. నటిగా ఆమె కెరీర్ ప్రకా శించదని వాదించారు కూడా. అయి నా మహేంద్రన్ రూపొందించిన ‘నెంజెత్తై కిల్లాధె’లో నాయికగా నటించింది సుహా సిని, శరత్ బాబు చెల్లెలు విజిగా ఆ చిత్రంలో హీరో మోహన్‌కి తొలుత స్నేహి తురాలై, తరువాత అతడు ప్రేమిస్తే అంగీకరించి తను చేసిన టక్కరి పనివల్ల అతడిని నిరాకరించి తరువాత ప్రతా ప్‌పోతన్‌ని సుహాసిని పెళ్లి చేసుకుని దూరంగా ఉంటూ చివరికి మోహన్ సలహాతో ప్రతాప్‌పోతన్‌కి చేరువయ్యే పాత్ర ఇది. 12.12.1980న విడుదలైన ఈ చిత్రం ద్వారా తమిళ నాడు ప్రభుత్వం నుంచి తొలి చిత్రానికే ఉత్తమ నటి అవార్డు పొందింది. మరో చిత్రమేమిటంటే సుహాసిని భరత నాట్యం ఆరంగేట్రా న్ని రద్దు చేయించి మరీ చారుహాసన్ ఈ సినిమాలో ఆమెను నటింప చేయ డం. భారతీరాజా దర్శకత్వంలో రూపొందించిన తెలుగు చిత్రం ‘కొత్త జీవితాలు’తో 1981లో తెలుగు వారికి సుహాసిని పరిచయమయింది. మమ్ముట్టి సరసన నాయికగా 1983లో మలయాళ చిత్రం ‘కూడివిది’తో మలయాళ సీమకు, విష్ణువర్ధన్‌కి నాయికగా 1984లో కన్నడ చిత్రం ‘బంధన్’తో కన్నడిగులకు పరిచయమైంది. ఈ రెండు చిత్రాలూ ఘన విజయం సాధించాయి. విష్ణువర్ధన్, మమ్ముట్టి, మోహన్‌లాల్‌లతో సుహాసినిదే ‘రేర్ కాంబినేషన్’ “హిట్ కాంబినేషన్‌” అనే పేరొచ్చింది. తెలుగు చిత్రసీమలో చిరంజీవి, బాలకృష్ణ, కృష్ణ, శోభన్‌బాబు, సుమన్, భానుచందర్ ఇలా పలువురి హీరోల సరసన నాయికగా చక్కని పాత్రలు పోషించింది. రజనీకాంత్‌తో రెండు చిత్రాల్లో నాయికగా నటించింది.
మలయాళ చిత్ర సూపర్ స్టార్ మమ్ముట్టి అయితే సుహాసినికి మలయాళీతోనే పెళ్లి చేయాలని అప్పట్లో సంబంధాలు కూడా వెదికేవాడు. మణిరత్నంతో పెళ్లి అయ్యాక సుహాసిని తమ నాయికగా నటించడానికి మమ్ముట్టి, మోహన్ లాల్ అంగీకరించకపోవడం విశేషం. 1985 ప్రాంతంలో జయసుధ నటిగా రిటైర్ అవుతానని ప్రకటించడంతో ఆమె స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారో అని అందరూ ఆవేదన చెందేవారు. మాటల సందర్భంలో శోభన్ బాబు “ఇంకెవరు సుహాసిని ఆ స్థానాన్ని భర్తీ చేస్తుంది. చిత్రపరిశ్రమ ఒక ప్రవాహం లాంటిది. ఎవరు వెళ్లినా, ఎవరు మారినా ఆ ప్రవాహం ఆగదు. సుహాసిని నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది” అన్నారు. సుహాసిని సరదాలు ఎనభయ్యో దశకంలోనే సుహాసినికి టెలివిజన్ కార్యక్రమాలు చూడడం అంటే విపరీతమైన మోజు. “నాకు టి.వి ప్రోగ్రామ్స్ చూడటం చాలా ఇష్టం. నా దగ్గర పాకెట్ టెలివిజన్ సెట్లు చాలా ఉన్నాయి. నేను ఎక్కడికి వెళ్లినా నా మేకప్ కిట్‌తో పాటు ఒకటి రెండు పాకెట్ టెలివిజన్ సెట్లు ఉండాల్సిందే. ఔట్ డోర్ షూటింగ్‌లకు వెళ్లినపుడు అవి లేకుంటే పొద్దుపోదు కదా! ఎందుకంటే మాట్లాడటం నా అలవా టు, మాట్లాడేవారు దొరకకపోతే టి.వి యే దిక్కు. ప్రోగ్రామ్‌లను మాత్రం ఎక్కువ సేపు చూడలేను. బోర్ కొట్టించేవి వుంటాయి. ‘హమ్‌లోగ్’ కార్యక్రమాన్ని దూరదర్శన్‌లో ఎవరైనా వదలకుండా చూశారంటే వాళ్లు సహనపరులన్నమాట. అవార్డు ఏదైనా ఉంటే వారికి అది ఇవ్వాలి” అని చెబుతూండేది. “విడియోగ్రఫీ కూడా ఇష్టమే. ఛాయాగ్రాహకురాలిని కావాలన్న కోరిక తీరలేదు కనుక ఏదైనా వెరైటీగా కనిపిస్తే విడియో తీసేస్తాను” అంటుండేది. తరువాత కాలంలో కొన్ని షార్ట్ ఫిలింస్ తీసింది. ఆమె రూపొందించిన “ఇందిర” తమిళ ఫీచర్ ఫిలిమ్‌కి తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక బహుమతి ఇచ్చింది 1996లో.
స్ఫూర్తి ఇచ్చే సుహాసిని : ‘16 ముదినిలే’ సినిమా షూటింగ్ కొంత కమల్‌హాసన్ ఇంట్లో జరిగింది. ఆ సమయంలో ఆ చిత్ర నాయిక శ్రీదేవి సుహాసిని గదిలోనే విశ్రాంతి తీసుకునేది. అలా సమ వయస్కురాలైన శ్రీదేవి సుహాసినికి బెస్ట్‌ఫ్రెండ్ అయింది. విజయ శాంతి, రాధిక, రాధ, సుమలత వీళ్లందరూ సుహాసినిని చాలా ఇష్టపడతారు. మేకప్, హెయిర్‌డ్రెస్సింగ్ వంటి వాటిల్లో ఆమె సలహాలు తీసుకుంటూ వుం టారు.
సహచరులను కలిపిన ఐడియా : జూలై 2009లో మీనా పెళ్లి, సుమలత అక్క కుమారి పెళ్లి రిసెప్షన్ పక్క పక్క భవంతుల్లో జరిగినప్పుడు ఎనిమిది మంది 1980 నాటి హీరోయిన్లు ఒకరినొకరు కలుసుకుని ఆనందించారు. మళ్లీ ఎప్పుడు ఏ 20 ఏళ్లకో కలుస్తామో ఈ ఆనందం కోసం అనుకున్నారు. అలా అనుకున్నాక నటి లిజి (ప్రియదర్శన్ భార్య) “ ఈ ఏడాది కొకసారైనా మన 1980 దశక ఆర్టిస్టులు కలిస్తే ఎంత బాగుంటుందో” అంది సుమలతతో. తర్వాత లిజి సుహాసినితో కూడా అనడం, సుమలత వత్తాసు పలకడంతో పలువురితో సంప్రదింపులు జరిపి, 2009లోనే ‘క్లాస్ ఆఫ్ ఎయిటీస్’ అంటూ ఆర్టిస్టుల ఇష్టాగోష్ఠి ఏర్పాటు చేసింది లిజితో కలిసి సుహాసిని. మరుసటి సంవత్సరం చిరంజీవి, వెంకటేష్, మోహన్‌లాల్ తదితర హీరోలు జాయిన్ అయ్యారు. అలా సరదా సరదాగా ఆర్టిస్టులు ఏడాదికొకసారి కలుస్తున్నారు. ఆ విధంగా 6వ సమావేశం నిరుడు సెప్టెం బర్‌లో కూడా జరిగింది అంటే అందుకు సుహాసిని నిరంతర కృషే కారణం. ఇలానే కాకుండా సమాజసేవలో ముఖ్యంగా మహిళల అభ్యున్నతికోసం కూడా సుహాసిని అవిశ్రాంతంగా పనిచేస్తోంది. సుహాసిని 275 చిత్రాల వరకు ఇప్పటికి చేయగా అందులో తెలుగు చిత్రాలు వందపైనే. తమిళంలో 50, మిగతావి కన్నడం, మలయాళ చిత్రాలు. కమల్‌హాసన్, నసీరుద్దీన్‌షా ఆమె అభిమాన నటులైతే, సత్యజిత్‌రే, బాలచందర్, శంకర్‌నాగ్ ఆమె అభిమానించే దర్శకులు.
మంచుపల్లకి, ముక్కుపుడక, మగమహారాజు, మంగమ్మగారి మనవడు, ఇల్లాలు ప్రియురాలు, శ్రావణసంధ్య, చంటబ్బాయి, రాక్షసుడు, ఆరాధన, జాకీ, ప్రెసిడెంటు గారి అబ్బాయి, ఆఖరిపోరాటం, బాలగోపాలుడు, మమతల కోవెల, స్రవంతి, స్వాతి, సిరివెన్నెల, సంసారం ఒక చదరంగం ఇలా ఎన్నో చిత్రాల్లో చక్కని ప్రధానపాత్రలు పోషించింది. నువ్వు నాకు నచ్చావ్, పెదబాబు, అమ్మచెప్పింది, గబ్బర్‌సింగ్, బాద్‌షా, మిణుగురులు, లెజెండ్ తదితర చిత్రాల్లో కేరెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణించింది. కన్నడ, తెలుగు చిత్రాల పాత్రలు నచ్చితే అంగీకరిస్తోంది. భర్త మణిరత్నం రూపొందించే తమిళ, తెలుగు చిత్రాల వెర్షన్లకు డైలాగ్ రైటర్‌గా వ్యవహరిస్తుంది. తిరుడ తిరుడ (దొంగ దొంగ), ఇరువర్ (ఇద్దరు) రావణన్ చిత్రాల తమిళ స్క్రిప్ట్ ఈమెదే. “ నా భర్త చక్కని చిత్రాలు తీస్తుంటే నేను దర్శకత్వం చేయుకున్నా ఫర్లేదు” అంటుంది. తమ సొంత సంస్థ అయిన మద్రాస్ టాకీస్ వ్యవహారాలన్నీ ఆమె చూడాల్సిందే. ఇది కాక కొన్ని టివి షోలు చేస్తుంటుంది. “మన సమాజం మాదిరిగానే చిత్ర పరిశ్రమ కూడా పురుషాధిక్యత కలదే. ఇప్పుడు, తల్లి, డాక్టర్, ప్రిన్సిపాల్ పాత్రలే మాలాంటి వాళ్లకి అయితే తమిళ టెలివిజన్ ద్వారా రాధిక, ఖుష్బూ, నేను డామినేట్ చేస్తూ స్త్రీ ఆధిక్యత చూపుతున్నాం” అంటుంది సుహాసిని నవ్వుతూ.
– వి.ఎస్. కేశవరావు

Posted in Uncategorized | Leave a comment

రాధిక article in Harivillu of Mana Telangana dt.5-6-16

On Sunday, June 19, 2016 12:51 PM, kesavarao vadduri <kesavaraovadduri@yahoo.com> wrote:

రా‘డాన్’ రాధిక

Jun 05, 2016
Radhika-Image-Madeరవంత బొద్దుదనం, సూదంటు రాయిలా ఆకర్షించడం, చక్కని అభినయం రాధిక ప్రత్యేకతలు. అందుకే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రరంగాల్లో హీరోయిన్‌గా గ్లామర్ పాత్రలు. అభినయ ప్రాధాన్యతగల పాత్రలు పోషించి గ్లామర్ హీరోయిన్‌గానూ రాణించింది. తరువాత టెలివిజన్ రంగంలో అడుగిడి నిర్మాతగా, అధిక ప్రాధాన్యతగల పాత్రలను నటిగా పోషిస్తూ దక్షిణాది టెలివిజన్ రంగంలోనూ తన ప్రత్యేకతలను చాటుకుంటోంది తండ్రి నుంచి నటన వారసత్వంగా సంక్రమించడంతో.
చిన్నతనం నుంచి 14 సంవత్సరాలు దాటేవరకు చాలా బొద్దుగా, బండగా,అల్లరికి కేంద్రబిందువుగావుండేది రాధిక. ఇంగ్లండ్‌లో చదువుకుంటూ అక్కడ ఆహార వ్యవహారాలు కారణంగాను, కాస్తంత బద్దకం కారణంగాను బాగా బొద్దుగా వుండేది.వేసవికి సెలవులు కారణంగా మద్రాసు (నేటి చెన్నై)లో తల్లితో, చెల్లితో గడపడానికి వచ్చింది. 1977లో మద్రాసులోని పగటి వేడి వాతావరణం, చెమటలు, ఆహారంతో వచ్చిన మార్పులు కారణంగా బొద్దుతనం తగ్గింది. ముఖంలో కళ పెరిగింది. ద్వితీయ చిత్రం కథానాయిక కోసం అన్వేషిస్తున్న భారతీ రాజా, రాధిక చిలిపి నవ్వులుచిందించే, అమాయకత్వంగా చూసే ఫొటోలు చూశాడు స్నేహితుని ఇంట్లో, రాధిక ఇంటికి వెళ్లి. “ఆమెనే చూస్తూ నా సినిమాలో హీరోయిన్‌గా నటిస్తావా?’ అని అడిగేశాడు, రాధిక భయపడింది. “నేనేమిటి, హీరోయిన్ ఏమిటి నన్నూ నాముఖం సరిగా చూసారా?” అని ప్రశ్నించి పగలబడినవ్వింది.
16 వయదినిలే (తెలుగులో ‘పదహారేళ్ల వయసు’ శ్రీదేవి నాయిక) తమిళ చిత్రంతో పెద్ద పేరు తెచ్చుకున్న, తొలి చిత్రంకే ఎంతో గుర్తింపు పొందిన భారతీరాజా గురించి తెలిసిన రాధిక తల్లి గీతారాధ కూతురికి విషయం వివరించి, ‘సెలవులే కదా చేసెయ్’ అని చెప్పి అంగీకరింపజేసింది. నిజానికి ప్రముఖ తమిళ విలన్, కామెడీ ఆర్టిస్టు నాటకరంగంలోను పేరు గడించిన ఎం.ఆర్.రాధా (మోహన రాజగోపాల రాధాకృష్ణన్ ముదలియార్) కుమార్తె రాధిక. తన సహచర నటుడు నెం.1 హీరో అయిన ఎంజిఆర్ తో తరచూ మాటామాటా వచ్చేది ఎంఆర్ రాధాకి. క్షణికావేశంలో, కోపోద్రికంతో ఎంజిఆర్ పై తుపాకీ కాల్పులు జరిపాడు. పెద్ద కేసు అయింది. ఈ కేసులు, అల్లర్ల ప్రభావం తెలియకూడదని తన జన్మస్థలమైన సిలోన్ పంపేసింది తల్లి. కొంతకాలం గడిచాక లండన్‌లో చదవసాగింది రాధిక. ఎంజిఆర్ మీద తమిళులకున్న వీరాభిమానం వల్ల ఎం.ఆర్ రాధా కుటుంబసభ్యులకు చిత్రరంగంలో అవకాశం వస్తుందని, వచ్చినా నిలదొక్కుకుంటారని అప్పట్లో ఎవరూ భావించలేదు, ఊహించలేదు. అయితే, రాధిక చిత్రరంగంలో ప్రవేశం తర్వాత రాధిక చెల్లెలు నిరోషా, సోదరుడు రాధారవి కూడ నటప్రస్థానం సాగిస్తున్నారు. ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగించిన నాగభూషణం ‘రక్తకన్నీరు’ నాటకంకి మూలం ఎం.ఆర్. రాధా అనేక ప్రదర్శనలిచ్చిన రత్త కన్నీరు తమిళ నాటకమే! ప్రతిభతో ముందంజ రాధిక తొలి చిత్రం కిళకి పోగుంరైల్ (బాపు దర్శకత్వంలో జ్యోతి నాయికగా’ తూర్పు వెళ్లే రైలు’గా తర్వాత పునర్నిర్మించి విడుదల చేశారు. హీరో సుధాకర్ (తెలుగులో ఆ తర్వాత కమేడియన్‌గా రికార్డు నెలకొల్పాడు). ఈ చిత్రం1978లో విడుదలై అఖండ విజయం సాధించింది. చలాకీదనం గల పల్లెటూరి పిల్లగా నటించిన రాధిక వల్లనే. తమిళంతో బాటు తెలుగులోనూ ఆఫర్లు వచ్చాయి రాధికకి. చంద్రమోహన్ సరసన ‘ప్రియ’ చిత్రంలో తొలి ఛాన్స్ చిరంజీవి సరసన నాయికగా ద్వితీయ తెలుగు చిత్రం ‘న్యాయం కావాలి’ లోను ఆఫర్ వచ్చింది. ‘న్యాయం కావాలి’ మొదట విడుదలైంది. చలాకీ పిల్లగా, పల్లెటూరి యువతిగా, గ్లామర్ గాళ్‌గా త్యాగ మూర్తిగా చక్కటి డ్యాన్సర్‌గా, అల్లరి పిల్లగా, క్లిష్టమైన పాత్రలో సునాయాసంగా ఒదిగిపోయి నటిగా అతి తక్కువ వ్యవధిలోనే పేరు ప్రతిష్ఠలు గడించింది రాధిక. ఐరన్‌లెగ్ అని పేరొస్తొందేమో అనే భయంతో ఆచితూచి చిత్రాలు అంగీకరించింది. “సినీరంగంలో విజయమే ప్రధాన పాత్ర ధరిస్తుంది. వరసగా విజయాలు వచ్చినా ఒకటి రెండు వెంట వెంటనే ఫ్లాప్ అయితే ‘ఐరన్ లెగ్’ సెంటిమెంట్ అంట గట్టేస్తారు. ఎంతో మందిని ఇలా అనటం నేను విన్నాను, చూశాను” అని చెప్పేది రాధిక. “హీరోయిన్‌గా నటించడం ప్రారంభించాక అతి తక్కువ దుస్తులు ధరించను, శరీరం నిండా కప్పుకునే దుస్తులుండే పాత్రలే చేస్తాను, హీరో, విలన్, ఇతర నటులు నన్ను తాకకూడదు, నేను తాకను అనే షరతులు పెడితే 80వ దశకంలో రాణించలేం” అంటుండేది. గ్లామర్ అంటే బాధ “గ్లామర్ పాత్రలు పోషించాలంటే బాధగా వుండేది రాధికకు. అప్పుడప్పుడు చేయక తప్పటం లేదు అలా అని అసభ్యకరమైన పాత్రలు అంగీకరించేదాన్ని కాదు. అందుకే నేను ఎక్కువ ప్రయోజనాత్మక చిత్రాల్లో నటించగలిగాను. అలా నటిగా చక్కని తృప్తి లభించింది” అని చెప్పేది. చిరంజీవికి డ్యాన్సుల్లో మంచి పోటీ ఇచ్చేది రాధిక. ఇద్దరూ కలసి నటంచిన చిత్రాలు చాలా విజయం సాధించాయి. హీరోయిన్‌గా ప్రవేశించిన పన్నెండేళ్ల తర్వాత కేరక్టర్ రోల్స్ చేసే దశ ఏర్పడింది. 1993 తర్వాత గ్యాప్ వచ్చింది, అన్ని విధాల. పెళ్లి విషయంలో రెండుసార్లు పొరబడింది. 1984లో నటుడు ప్రతాప్‌పోతన్ పెళ్లాడింది. కొంతకాలం తర్వాత విడిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. తర్వాత రిచర్డ్‌హార్డీతో పెళ్లి అయింది. ఈ వివాహబంధం కొంతకాలని కొనసాగింది. అధిక ఆదాయం, తద్వారా ఎక్కువ ఆస్తిపాస్తులు గడించే కొందరు నటీమణులను నమించి నట్టేట ముంచి అప్పులపాలు చేస్తారు. రాధికకూ ఆపరిస్థితి ఏర్పడి ఇల్లు అమ్మే పరిస్థితి తలెత్తింది 1993 ప్రాంతంలో. ఇల్లు అమ్మలేదు కానీ బ్యాంక్ నుంచి అప్పు తీసుకుంది. అప్పటికే టెలివిజన్ మీద దృష్టిసారించిన కారణంగా ‘రాడాన్ టివి’ నెలకొల్పింది. గేమ్‌షోలు వంటివి టివిలో ప్రారంభించింది. రాడాన్ మీడియా వర్క్‌గా సంస్థను 1999లో మార్చింది. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, టివి ఛానల్స్‌లోను సీరియల్స్ ద్వారా ఆకట్టుకుంది. ‘పిన్ని, కావేరి, శివయ్య, లక్ష్మి, ఝాన్సీ చిట్టెమ్మ, వాణి-రాణి వంటి సీరియల్స్ తెలుగులోనూ ఇతర భాషల్లోనూ రాధికకు పేరుతెచ్చాయి. ఈ పతాకాన చిత్రాలూ నిర్మిస్తోంది. నటుడు శరత్‌కుమార్ 1999లో రాధికని పెళ్లి చేసుకుంటానంటే తొలుత అంగీకరించలేదు. తన పెళ్లి నిర్ణయాలు సరైనవికాదంది. పట్టువదలని శరత్‌కుమార్ రాధిక తల్లి గీతారాధని ఒప్పించడంతో ‘సరే’ అంది రాధిక. వీరి దాంపత్య జీవితం 2001లో ప్రారంభమై హాయిగా సజావుగా సాగుతోంది. రాజకీయ వేదికలపై కూడా తమ ఉపనాసాలతో అలరిస్తుంటారు. డి.ఎం.కె. పార్టీ తరపున 1988లో ఎన్నికల ప్రచార సభల్లో విస్తారంగా పాల్గొని, తన మాటలతో ఆకట్టుకునేది రాధిక. యాసిడ్ పోస్తామని ప్రత్యర్థులు బెదిరించినా భయపడేది కాదు” ఏదో ఆశించి కరుణానిధికి ప్రచారం చేయలేదు. సభలకు వచ్చిన తల్లులు తమ పసిపిల్లలను నా చేతిలో పెట్టి పేరు పెట్టమని అడిగేవారు. పిల్లలను ఎత్తుకునే అలవాటులేక భయమేసేది. మెల్లగా అలవాటు పడ్డా! మగ పిల్లలకు ‘ఉదయ్‌సూర్యన్’ అనే పేరు పెట్టేదాన్ని” అంది ఒకసారి. ఆ తరువాత కొంతకాలానికి అన్నా డిఎంకె కి వత్తాసు పలికింది భర్త శరత్‌కుమార్‌తో 2006నుంచి. తాజా ఎన్నికల్లో జయలలితతో ఎలయన్స్‌కి స్వస్తి చెప్పాడు శరత్‌కుమార్. విదేశీ చిత్రాలు ఎక్కువగా చూసే రాధిక వారి పరిజ్ఞానంకి మురిసిపోతూనే, మనకున్న తక్కువ వనరులతో మనవారు మన స్థాయికి మించి చిత్రాలు తీస్తున్నారని ఆ రకంగా మన వారే గొప్పవారు అని అంటుంది. ‘అభిలాష, రాధాకల్యాణం, పట్నం వచ్చిన పతివ్రతలు, దొంగమొగుడు, ఇది పెళ్లంటారా, వయ్యారి భామలు వగలమారి భర్తలు, యమకింకరుడు, త్రిశూలం, స్వాతిముత్యం, జీవనపోరాటం, అమెరికా అబ్బాయి, సర్దార్ ధర్మన్న, స్వాతి కిరణం, ఆరాధన ఇలా ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన నటనతో, నాట్యాలతో అలరించింది రాడాన్ ‘రాధిక’.
– వి.ఎస్. కేశవరావు

Posted in Uncategorized | Leave a comment

ఎస్‌విఆర ్ నటన Harivillu 12-6-2016

విభిన్నం విలక్షణం ఎస్‌విఆర్ నటన

Jun 12, 2016
SVR-Special-Storyనటనలో అసాధ్యమైన పోకడలు, సంభాషణోచ్ఛారణలో విభిన్నమైన శైలి చూపినందుకనే విశ్వనట చక్రవర్తి అయ్యారు ఆయన. అంతేకాదు నటసార్వభౌమ, నటశేఖర, నటసింహ బిరుదులు కూడా పొందగలిగారు. ఆయనే ఎస్.వి.ఆర్ కొంచెం పెద్దగా రంగారావు ఇంకాస్త బరువుగా అయితే ఎస్.వి.రంగారావు. ఎలా పిలిచినా, ఎలా వినబడినా, ఇంకెలా చూసినా గాని వెంటనే కనుల ముందు కదలాడేది ఆయన భారీ విగ్రహమే! చెవులలో గింగురమంటూ మనసుని ఎక్కడికో తీసుకెళ్లేటి విలక్షణ వాచకమే! ఈ రెండింటితో ఎలాటి పాత్రలోనైనా అవలీలగా ఒదిగిపోయి, పరకాయ ప్రవేశం చేసారా అని అనిపించుకునే వారు. సాత్వికమైనదైనా, రాజసం వుట్టిపడేదైనా, తామస లక్షణాలున్న పాత్ర అయినా సమయ సందర్భాలను బట్టి నవరసాలల్లోని శృంగార, వీర, కరుణ, అద్భుత, హాస్య, బీభత్స, భయానక, రౌద్ర రసాలను తగు మోతాదులో భావ ప్రకటనలో సంభాషణోచ్ఛారణలో కనిపింపజేయగలిగి “ ద టీజ్ ఎస్.వి.ఆర్‌” అని అనిపించుకున్నారు ప్రేక్షకులతో. అందుకే ఆయన మరుపురాని నటుడు. నటనా నిఘంటువు కాగలిగారు. సమాజంలోని వ్యక్తులను, వారివారి మేనరిజాలను, పుస్తకంలోని పాత్రధారుల లక్షణాలను సునిశితంగా పరిశీలిస్తూ, అవసరమైనప్పుడు కొంత కొత్తదనం జోడించి తను పోషించే పాత్రకు రసపుష్ఠి నిచ్చేవారు ఎస్‌విఆర్.
రంగస్థల నటుడుగా షేక్‌స్పియర్ నాటకాల్లోను, అందులోని షైలాక పాత్ర తన, సీజర్, ఆంటేని పాత్రల్లోను ఖల్జీ రాజ్య పతనంలో ‘లోభి’ స్ట్రీట్ సింగర్ మధిమ గాల్లే అమోఘమైన గుర్తింపు తెచ్చుకున్న సామర్ల వెంకట రంగారావు హీరోగా బంధువు బి.వి రామానందం రూపొందించిన ‘వరూధిని’ చిత్రంతో హీరో అయి 1966లో ఆ చిత్రం ఫ్లాప్ కావటంతో తదుపరి చిత్రాల్లో వేషాలకు ప్రయత్నించి అనేక అవమానాలకు, సూటిపోటు మాటలను, హేళనలను చవి చూసి నిరాశ చెందారు. జెంషెడ్ పూర్ వెళ్లిపోయి టాటా కంపెనీ ఉద్యోగిగా మారి, నాటకాల్లో నటించేవారు. లీలావతితో 1947లో పెళ్లి అయింది. మళ్లీ సినీ ప్రయత్నాలు చేదు అనుభవాలయ్యాయి. అయినా పట్టువీడలేదు. ‘పల్లెటూరి పిల్ల’లో విలన్ అవకాశం వచ్చింది గాని, మద్రాసుకు బయల్దేరుతుంటే తండ్రి మరణించారు. చివరకు ‘పల్లెటూరి పిల్ల’తో చిన్న వేషం లభించింది. ‘షావుకారు’ చిత్రంలోని సున్నడి రంగడు పాత్రతో (వెరైటీ రౌడీయిజం చూపె) గుర్తింపు తెచ్చుకున్నారు. కె.వి.రెడ్డి సూచనలు పాటించి ‘పాతాళభౌరవి’ లో మాంత్రికుడుగా రికార్డు నెలకొల్పారు. ఇక అప్పటి నుంచి చిత్రచిత్రానికి, పాత్ర పాత్రకీ వైవిధ్యం, విలక్షణత్వం చూపడం కోసం ప్రతిభకు సానపెట్టారు ఎస్వీఆర్.
వైఖరిలో విచిత్రాలు
చేసిన, చేస్తున్న పాత్రల ప్రభావమో, వేషాల ప్రయత్నంలోని చేదు అనుభవాల ఫలితమో ఇంటి వాతావరణం వల్లన పరిశీలనాత్మక దృష్టి కారణమో గాని ఆయన వ్యవహార శైలిలో అభిజాత్యం, పౌరుషం, లెక్కచేయనితనం, మొండితనం, స్వాభిమానం, అహంభావం, నిర్లక్షం, నిస్సిగ్గు, బోళాతనం, కోపం, జాలి, శాంతం, సహాయం చేయడం వంటివి నిజ జీవితంలోనూ చోటు చేసుకున్నాయి.

మంచి నిర్మాతలు, దెబ్బతిన్న నిర్మాతలు పారితోషకం సరిగా ఇవ్వకపోయినా, కొంత ఎగ్గొట్టినా పట్టించుకునే వారు కాదు. కానీ భార్యకు అన్నీ లెక్కలే. విషయం ఆవిడకు తెలిసిందని తను గ్రహించేవారు. దెబ్బకు ఠా – దొంగలు ముఠా” చిత్ర నిర్మాత ఆర్థిక దుస్థితిలో వుండి కాల్షీట్ల కోసం వచ్చారు.

అప్పటికే మహారధిత మాట్లాడుతున్నారు ఎస్.వి.ఆర్. ఇవి చాటుమాటుగా వినేది భార్య. ఆ నిర్మాత డి.ఎల్. నారాయణ కాల్షీట్లు కోసం అడగగానే ముందు డబ్బు లెండి మీరు దెబ్బతింటే మేం నష్టపోవాలా. డబ్బు తెస్తేనే డేట్స్. ఇప్పుడు వెళ్లిపోవాల్సిందే” అని గట్టిగా అంటూ కన్ను గీటారు. భార్య ఆ తరువాత లోపలికి వెళ్లగానే చిన్నగా షెడ్యూల్ వేసుకోండి. చెప్పండి. వచ్చేస్తా. అడ్వాన్స్ గిడ్వాన్స్ వద్దులే” అన్నారు ఎస్వీఆర్.
“పాండవ వనవాసం’లో ఈయన దుర్యోధనుడు, ఎన్టీఆర్ భీముడు వస్త్రాపహరణం తర్వాత ఎన్టీఆర్ ఆవేశంగా పద్యం చెబితే విని తన ధోరణిలో “ప్ఛ్‌” అని ఎస్వీఆర్ అన్నారు. ఎన్టీఆర్‌ని ఎగతాళి చేసినట్టు అందరూ గ్రహిస్తారు. ఈ ప్రమాదం గుర్తించిన ఎగ్జిక్యూటివ్ నిర్మాత పర్వతనేని గంగాధరరావు షాట్ అనగానే సూచాయిగా విషయం చెప్పి, తదుపరి షాట్‌లో రియాక్షన్ తగ్గించమని చెబుతూ, ఎస్వీఆర్ కోపంగా చూడగానే చిరునవ్వులు చిందిస్తూ చూపుడు వేలు మాత్రం పైకి ఎత్తి చూపారు. చిత్రీకరణలో ఎస్.వి.ఆర్ మార్పు చేయలేదు. అదే షాట్ మూడవ టేక్ ప్రారంభించారు. ‘షాట్ రెడీ టేక్ త్రీ’ అంటుంటే ఎస్.వి.ఆర్.కి ఎదురుగా దూరంగా నిలబడి రెండు వేళ్లు చూపారు గంగాధర రావు. అది చూసి కళ్లెగరేసి, మార్పు చేసి నటించారాయన. ఇందులో కిటుకు ఏంటంటే మొదట ఫారిన్ విస్కీ బాటిల్ ఒకటి ఇస్తాననడం, అది నచ్చకపోవడం, రెండు వేళ్లు చూపగానే రెండు ఫారిన్ విస్కీ బాటిల్స్ ఇవ్వడానికి నిర్ణయన్నమాట. రేచుక్క – పగటి చుక్క’ చిత్రంలో ఎస్.వి.ఆర్. రాజు. ఆ వేషంలో అట్టహాసంగా రాజసభకు మేకప్ రూమ్‌లో అన్నీ ధరించి బయల్దేరారూ. భుజాల మీంచి నడుం మీదుగా కాళ్ల కిందకు దాటిపోయే హూడ్ (పొడవైన వస్త్రం) తగిలించమన్నారు.“షూటింగ్ స్పాట్‌లో అది పెడతారు ఇప్పుడే అయితే నలిగిపోతుంది. మీరు ఇలాగే వచ్చేయండి” అన్నారు ప్రొడక్షన్ మేనేజర్ అట్లూరి పుండరీకాక్షయ్య. “నెవర్. నో. నేను రాజును సకల అలంకారాలతో వెళ్లాల్సిందే. హూడ్ లేకుండా రాజు నడవరు. నలగకుండా పాడవకుండా ఎత్తి పట్టుకోండి. రాజులు తమ బట్టలు తాము మోస్తారు” అనేసి సర్రున బయల్దేరారు. హూడ్ పాడవకుండా పుండరీకాక్షయ్య నానాతంటాలు పడుతూ స్పాట్ వరకూ మోశారు. ఇలాటివి అనేకం. మద్రాసులో ఎస్.ఎస్.ఎల్.సి వరకు నాయనమ్మ దగ్గర చదువుకుని, ఆమె ఏలూరు మకాం మార్చడంతో విశాకలో ఇంటర్, కాకినాడలో బి.ఎస్.సి. చదివారు. కాకినాడలోని యంగమెన్‌స “హ్యాపీ క్లబ్ ప్రదర్శించే నాటకాల్లో పాల్గొంటూ వుండేవారు. అప్పేడే బి.వి.సుబ్బారావు, ఆదినారాయణరావు, అంజలీదేవి, రేలంగి తదితరులతో పరిచయం పెరిగింది. ఎం.ఎస్.సి చదువుదామనుకుని కొందరి సలహాతో ఫైర్ ఆఫీసర్‌గా బందరు, విజయనగరంలలో పని చేశారు. ఆ టైమ్‌లో ‘వరూధిని’లో అవకాశం వచ్చింది. ఉద్యోగం మానేశారు. షావుకారు, పాతాళభైరవి చిత్రాల తర్వాత ఎస్.వి.రంగారావు పేరు ఇటు తెలుగు, అటు తమిళ చిత్ర సీమల్లో మారు మోగింది. మాయాబజార్‌లో ఘటోత్కచునిగా, ‘భక్తప్రహ్లాద’లో హిరణ్యకశపునిగా, నర్తనశాలలో కీచకునిగా, శ్రీకృష్ణ లీలలు, యశోద కృష్ణలో కంసుడుగా మెప్పించారు. ‘సతీ సావిత్రి’లో యముడిగా, హరిశ్చంద్రలో హరిశ్చంద్రునిగా, ‘అనార్కలి’లో అక్బరుగా, ‘మహాకవి కాళిదాసు’లో భోజ మహారాజుగా పేరు తెచ్చుకున్నారు. రౌడీ పాత్రలు పోషించిన ‘మొనగాళ్లకు మొనగాడు, కత్తుల రత్తయ్య, జగత్ కిలాడీలు, జగత్ జెట్టీలు’లో అద్భుత ప్రతిభ చూపారు. ‘మిస్సమ్మ, అప్పుచేసి పప్పుకూడు, ఆడబ్రతుకు, లక్ష్మీ నివాసం, సుఖదుఃఖాలు, నాదీ ఆడ జన్మే, చదరంగం, గుండమ్మకథ, బాంధవ్యాలు, పండంటి కాపురం, తాత మనవడు, సంబరాల రాంబాబు, దసరా బుల్లోడు, దేవుడు చేసిన మనుషులు, అందరూ దొంగలే’ వంటి సాంఘిక చిత్రాల్లో అనితర సాధ్యమైన పాత్రల్లో మెప్పించారు. బొబ్బిలి యుద్ధంలో తాండ్రపాపారాయుడుని మరిచిపోగలరా! మోహినీ భస్మాసురలో భస్మాసురుని నటన, పద్మినిత చేసిన నాట్యం మరుపురానిదే. తమిళులకు ఆయన తమిళుడే! సుమారు 88 చిత్రాల్లో నటించి తమిళనాట మన్ననలు పొందారు. కన్నడంలో 2, మలయాళంలో 3, హిందీభాషలో 3 చిత్రాల్లో నటించారు. పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాల్లో తను పోషించిన పాత్రల ద్వారా స్వాభిమానం, అహంభావం, అమాయకత్వం, పొగరుమోతుతనం, నిర్లక్షం, బోళాతనం, హాస్యం, శాంతి స్వభావం వంటివి స్వచ్ఛమైన నటనతో చూపిన ఎస్.వి.ఆర్ మరుపురాని మనీషి.
– వి.ఎస్.కేశవరావ్

Posted in Uncategorized | Leave a comment

విజయశాంతి arti cle in Harivil

విశిష్ట నటనకు విజయశాంతి

Jun 19, 2016
టి.కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ‘నేటి భారతం, వందేమాతరం, దేశంలో దొంగలు పడ్డారు, దేవాలయం, ప్రతిఘటన, రేపటి పౌరులు’ చిత్రాలన్నీ ఆమెలోని వివిధ పార్శాలను బయటి పెట్టి ప్రతిభావంతురాలుగా నిరూపించాయి.
vijaya-shanthiపేరుకు ముందు ‘విజయ’ ను చిత్రరంగంలో జేరే సమయంలో చేర్చుకున్నారు. ఆ తర్వాత చిత్రాల విజయాలతో దానిని సార్ధకం చేసుకున్నారు. క్రమంగా పోషించే పాత్రల ద్వారా ‘లేడీ సూపర ‘యాక్షన్ క్వీన్’ ‘లేడీ అమితాబ్’ గా భారతీయ చలన చిత్ర చరిత్రలో స్థానం సంపాదించుకున్నారు. అధిక పారితోషకాన్ని అందుకున్నారు. రాజకీయ రంగ ప్రవేశంతో సినిమాలు తగ్గించుకుని, తొమ్మిదేళ్ల విరామం తర్వాత ‘మంచి స్క్రిప్ట్ లభిస్తే’ నటిగా పునఃప్రవేశం చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు విజయశాంతి.
ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా తమిళ చిత్రాల ద్వారా నాయికగా పరిచయం చేసిన మూడవ తెలుగు అమ్మాయి విజయశాంతి. వెంటనే తెలుగు చిత్రాల్లోనూ అవకాశాలు దక్కించుకుని వెలుగొందారు. వేషాల కోసం ప్రయత్నం చేస్తూ, భారతీరాజా దృష్టిని ఆకట్టుకుంది విజయశాంతి. పి.ఎస్.నివాస్ దర్శకత్వంలో రూపొందిన ‘కలుక్కుల్ ఈరమ్’ చిత్రానికి స్క్రీన్ ప్లేతో పాటు నటుడుగా కూడా వ్యవహరిస్తున్న భారతీ రాజా చిత్రంలో తన సరసన ముచ్చెర్ల అరుణకు, సుధాకర్ సరసన విజయశాంతికి నాయికగా అవకాశాలు వచ్చేలా చేశారు. సరదాగా నవ్వించే పల్లెటూరి అమాయిక యువతి పాత్ర విజయశాంతిది. ఈ చిత్రంలో నటిస్తుండగానే విజయనిర్మల దర్శకత్వంలో కృష్ణహీరోగా రూపొందిన ‘కిలాడి కృష్ణుడు’ చిత్రంలోనూ నాయికగా ఎంపికయిందీమె. తమిళ చిత్రం 29.2.1980 విడుదలై తమిళులకు, కిలాడి కృష్ణుడు 12.9.80న విడుదలై తెలుగువారికి పరిచయమైంది విజయశాంతి. వరుసగా తెలుగు, తమిళ చిత్రాల్లో అవకాశాలు పెరిగి స్వల్ప కాలంలోనే గ్లామర్ హీరోయిన్ అనిపించుకుంది. సినిమా విజయంలో హీరోతో పాటు హీరోయిన్‌కీ అధిక స్థానం వుందనేట్టు చేసింది. క్రమక్రమంగా గ్లామర్‌తో బాటు చక్కని నటనను, నాట్యాలను ప్రదర్శిస్తూ.
టి.కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ‘నేటి భారతం, వందేమాతరం, దేశంలో దొంగలు పడ్డారు, దేవాలయం, ప్రతిఘటన, రేపటి పౌరులు’ చిత్రాలన్నీ ఆమెలోని వివిధ పార్శాలను బయటి పెట్టి ప్రతిభావంతురాలుగా నిరూపించాయి.
సంఘర్షణ, ఛాలెంజ్, పసివాడి ప్రాణం, స్వయంకృషి, యముడికి మొగుడు, గ్యాంగ్ లీడర్ చిత్రాలతో చిరంజీవితో, ముద్దుల క్రిష్ణయ్య, మువ్వగోపాలుడు, ఇన్‌స్పెక్టర్ ప్రతాప్, ముద్దుల మావయ్య, లారీ డ్రైవర్, తదితర చిత్రాలతో బాలకృష్ణకు, ఇంకా శోభన్‌బాబు, సుమన్, నాగార్జున, వెంకటేష్, కృష్ణ, రజనీకాంత్ ప్రభృతులతో హిట్‌పెయిర్ హీరోయిన్ అనిపించుకుంది.
మోహన్ గాంధి దర్శకత్వంలో రూపొందిన ‘కర్తవ్యం’లో పోలీసు ఆఫీసర్‌గా కిరణ్‌బేడీని స్ఫూర్తిగా తీసుకుని నటించిన దగ్గర నుంచి ‘లేడి సూపర్ స్టార్, యాక్షన్ క్వీన్’గా రాణించింది విజయశాంతి. రజనీకాంత్ సరసన నటించిన ‘మన్నన్’ చిత్ర ఘన విజయంతో రజనీకాంత్‌తో పాటు విజయశాంతి ఖాతాలోనూ ఆ గొప్పదనం వచ్చి చేరింది.
టైమ్ పాస్ ట్రిక్స్
‘ఇన్‌స్పెక్టర్ ప్రతాప్’ షూటింగ్ శ్రీశైలంలో జరుగుతుండగా షూటింగ్ గ్యాప్‌లో ఎవరికీ బోర్ కొట్టకుండా విజయశాంతి అనుసరించిన చిట్కా ఇది.
ఆ చిత్ర సారథి వై. హరికృష్ణను ‘డాడీ’ అని పిలిచే అలవాటు ఆమెది. డాడీ అని పిలిచి ‘ఎందుకమ్మాయి’ అని ఆయన దగ్గరకు రాగానే ఆయన ముంజేతిలో కనిపించే ఓ నరాన్ని పట్టుకుని లాగి, ‘టప్’ అనే శబ్దం వచ్చేలా చేసింది. ఆయనకి, ఏవిధమైన నొప్పి కలగలేదు కానీ ఆ శబ్దంకి అందరూ చుట్టూ మూగారు. మరోసారి హరికృష్ణ మీద అలా అని, తర్వాత శరత్ బాబు చేయి పట్టుకుని అలా చేసింది. “నరాన్ని పట్టుకున్నట్టు రెండు వేళ్లతో పట్టుకుని గోళ్లతో సౌండ్ చేయిస్తున్నావు కదూ!” అని శరత్‌బాబు అడిగితే కాదంది. యూనిట్ సభ్యులు ఆమెకే వత్తాసు పలికారు. “నా చేతికి అలా చెయ్యి. నీ గుట్టు విప్పుతా. రట్టు చేస్తా” అని బాలకృష్ణ చేయి అందించారు. రెండు సార్లు ఆ ట్రిక్ ప్లే చేసింది. బాలకృష్ణతో బాటు మిగతా వాళ్లు అలా ప్రయత్నం చేయసాగారు. ఎంతడిగినా రహస్యం చెప్పలేదు విజయశాంతి.
మరో షాట్ బ్రేక్‌లో కుర్చీలో కూర్చొని చేతులు రెండు ముఖానికి కొంచెం దూరంలో పెట్టుకుని విచిత్రంగా వేళ్లను కదుపుతూ, తిప్పుతూ మళ్లీ కలపడం చేయసాగింది. ఇంతగా, ఆమె చేసే పనిని చూసి సహచర నటీనటులు తదితరులు కూడా అలానే ప్రాక్టీసు చేయసాగారు. “షాట్ రెడీ” అని పిలుపు రాగానే ఆమె వెళ్లి పోయింది. మిగతా వాళ్లు తమ ప్రాక్టీసు మాననే లేదు. విజయశాంతితో మీరు “ఎలా చేస్తారో చెప్పండి” అని అడిగితే కాలక్షేపం కోసం చేసే ట్రిక్స్ రహస్యాలు చెప్పేస్తే ఎలా?” అని నవ్వుతూ వెళ్లిపోయింది.
శోభన్ జోస్యం నిజం చేసిన శాంతి
జయసుధ 1985 ప్రాంతంలో నటిగా రిటైరవుతానని అనేది .ఆమె స్థానం ఎవరు భర్తీ చేస్తారనే ప్రశ్న అందర్నీ వేధించేది. శోభన్‌బాబు, జయసుధ పక్కపక్కనే ఓ షూటింగ్ బ్రేక్‌లో కూర్చుని వుండగా విలేకరులు శోభన్‌ని ప్రశ్నించారు. “ఇంకెవరు? సుహాసిని ఉంది కదా ఆ స్థానం భర్తీ చేసే కెపాసిటీతో” అన్నారాయన పత్రికల్లో ఈ వార్త వచ్చింది.
ఉడుకు మోతుతనం
ఆ తర్వాత ఒక రోజున ఓ సెట్లో శోభన్‌బాబు ముందు నిలబడి కోపం, ఏడుపు, ఆవేదన, బాధ సమ్మిశ్రమం చేస్తూ “మీ రెవరు? అలా చెప్పటానికి? ఎవరి ఒత్తిడితో అలా చెప్పారు? అని ఇంకా పలు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది. ఆమె ఉడుకుమోతు తనంకి నవ్వుతూండిపోయారు. “ఆ మాటలకు పరిహారంగా మీరు ఏదో ఒకటి చేయాలి” అనేసి ఆయన “సరే చూద్దాం” అనే వరకు వెళ్లలేదు. ఆ తర్వాత అంటే 1986 జనవరిలో శోభన్‌బాబు మాట్లాడుతూ నటనలో పట్టుసాధిస్తోంది. మంచి పాత్రలు లభిస్తున్నాయి. మేము ఇద్దరూ కలిసి చేసిన వాటిలో కూడా మంచి పాత్రలే. దేవాలయంలో అంత చక్కగా నటించిందంటే గొప్పే కదా! ఇంకా పదేళ్లపైన హీరోయిన్‌గా కొనసాగుతుంది. ఇదే ప్రవర్తన ఇక ముందు కూడా ఉంటే సావిత్రిలా మహానటి అవుతుంది” అన్నారు. శోభన్ బాబు మాటలు అలా నిజం అయ్యాయి. కానీ పదేళ్లు కాదు ఇరవై ఏళ్ల పాటు.
ప్రణయ గీతాల్లో, ప్రణయ సన్నివేశాల్లో సై అంటే సై అన్నట్టు హీరోలతో దీటుగా నాట్యం, నటనలతో ఆకట్టుకుని గ్లామర్ క్వీన్ అనిపించుకుంది. పెంకితనం, చిలిపితనం కలబోసిన పాత్రల్లోనూ, హాస్యం ఒలికిస్తూ కొన్ని సన్నివేశాల్లోనూ, విషాద సన్నివేశాల్లో, త్యాగమయి పాత్రల్లోనూ రాణించింది. ‘కర్తవ్యం’ చిత్రంలో హీరోలను అధిగమించేలా ఫైట్లు చేసి విలన్లతో దెబ్బలు తింటూనే తిరగబడి మగాడి కంటె బలంగా పిడిగుద్దులు, చెంప దెబ్బలు విసిరేస్తూ, కంటి చూపుతో కర్కశత్వాన్ని, పౌరుషాన్ని చూపి బెంబేలెత్తించడం ద్వారా ప్రేక్షకులను అలరించి యాంగ్రీ యంగ్ వుమెన్, యాక్షన్ క్వీన్ ఇమేజ్ సాధించుకుంది విజయశాంతి.
“యాక్షన్ ఇమేజ్‌ని చూపే పాత్రలలో కొనసాగుతూనే నా ప్రతిభకు పరీక్షపెట్టేటువంటి విభిన్నమైన పాత్రలు లభిస్తే వాటిలోనూ అప్పుడప్పుడు నటిస్తాను” అని చెబుతుందామె. “ఒసేయ్ రాములమ్మ” చిత్రం ద్వారా దాసరి తనలోని కొత్తకోణాలను చూపించారని అందుకే ఆ తర్వాత ‘రాములక్క’ అని అంటున్నారని మురిసిపోతుంది.
ముక్కు పుడక చిత్రంలో సుహాసినితో కలిసి నటించాక ఆమెతో బాగా కలిసిపోయింది. హెయిర్ డ్రెస్సింగ్ వంటి అంశాల్లో సుహాసినికి చక్కని అనుభవం ఉందని భావిస్తుంది. తన అక్కగా తలుస్తుంది.
రెండున్నర దశాబ్దాలకు పైబడి గ్లామర్ క్వీన్ పాత్రలతో, డేషింగ్ డేరింగ్ భూమికల్లో రాణించి అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన విజయశాంతి ‘కొత్త ఇన్నింగ్’ అనడం ద్వారా తొమ్మిదేళ్ల విరామం తర్వాత మరి ఎలాటి పాత్రలతో మెప్పిస్తుందో!
పిడిగుద్దులు, చెంప దెబ్బలు విసిరేస్తూ, కంటి చూపుతో కర్కశత్వాన్ని, పౌరుషాన్ని చూపి బెంబేలెత్తించడం ద్వారా ప్రేక్షకులను అలరించి యాంగ్రీ యంగ్ వుమెన్, యాక్షన్ క్వీన్ ఇమేజ్ సాధించుకుంది విజయశాంతి.
“యాక్షన్ ఇమేజ్‌ని చూపే పాత్రలలో కొనసాగుతూనే నా ప్రతిభకు పరీక్షపెట్టేటువంటి విభిన్నమైన పాత్రలు లభిస్తే వాటిలోనూ అప్పుడప్పుడు నటిస్తాను” అని చెబుతుందామె. “ఒసేయ్ రాములమ్మ” చిత్రం ద్వారా దాసరి తనలోని కొత్తకోణాలను చూపించారని అందుకే ఆ తర్వాత ‘రాములక్క’ అని అంటున్నారని మురిసిపోతుంది.
ముక్కు పుడక చిత్రంలో సుహాసినితో కలిసి నటించాక ఆమెతో బాగా కలిసిపోయింది. హెయిర్ డ్రెస్సింగ్ వంటి అంశాల్లో సుహాసినికి చక్కని అనుభవం ఉందని భావిస్తుంది. తన అక్కగా తలుస్తుంది.
రెండున్నర దశాబ్దాలకు పైబడి గ్లామర్ క్వీన్ పాత్రలతో, డేషింగ్ డేరింగ్ భూమికల్లో రాణించి అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన విజయశాంతి ‘కొత్త ఇన్నింగ్’ అనడం ద్వారా తొమ్మిదేళ్ల విరామం తర్వాత మరి ఎలాటి పాత్రలతో మెప్పిస్తుందో!
– వి.ఎస్. కేశవరావు

Posted in Uncategorized | Leave a comment

Rao Gopala Rao article Harivillu 2-7-17.

My article in Harivillu ManaTelangana 2-7-17
యాస ప్రాసల నటవిరాట్
రంగస్థల నటుడుగా రాణించి, భక్త పోతన చిత్రంలో సింగనామాత్యుడు పాత్రతో చిత్రరంగ ప్రవేశం చేసి, ఆ చిత్రా నికి దర్శకుడు జి.రామినీడుకు సహాయ దర్శకుడుగా పనిచేసి ఆ తర్వాత నుంచి కామెడీవిలన్‌గా, విలన్‌గా, పాలిష్డ్ విలన్‌గా, కేరక్టర్ ఆర్టిస్టుగా చిత్ర నిర్మాత ఎనలేని గుర్తింపు పొందారు రావుగోపాలరావు. పార్లమెంట్ సభ్యునిగాను సేవలు అందించారాయన.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని గంగన పల్లిలో రావు సీతాయమ్మ, సత్యనారాయణ దంపతులకు 1937 జనవరి 14న జన్మించిన రావుగోపాలరావు చదువుకునే సమయంలోనే రంగస్థల నటనపై మక్కువ పెంచుకున్నారు. పుస్తకాలు చదవడంపై కూడా ఆసక్తి. శ్రీశ్రీ రచనలు బాగా ఇష్టపడేవారు. నాటకాల్లో నటిస్తూ కొందరి స్నేహితులతో కలిసి అసోసియేటెడ్ అమెచ్యూర్ డ్రామా కంపెనీ నెలకొల్పి ఆ సంస్థ ద్వారా కూడా ప్రదర్శనలు విరివిగా ఇచ్చేవారు. నాటక రచయిత , సినీ రచయిత భమిడి పాటి రాధాకృష్ణ రచించిన ‘కీర్తిశేషులు’ నాటకంలోని మురారి పాత్ర చాలా పేరు తెచ్చింది. ఎస్.వి రంగారావు అతడి నటనని మెచ్చుకుంటూ దర్శకుడు గుత్తా రామినీడుకి 1964లో పరిచయం చేశారు. ఎస్.వి.ఆర్., గుమ్మడి ప్రభృతులతో తన దర్శకత్వంలో రూపొందే భక్తపోతన చిత్రంలో సింగనామాత్యుడు పాత్రని రావుగోపాలరావుకి చ్చారు. సాహిత్యాభిలాషని గుర్తించి ఆ చిత్రానికి సహాయ దర్శకుడుగా అవకాశం కల్పించారు. జి.రామినీడు దర్శక త్వంలో జమున, హరనాథ్ హీరో హీరోయిన్లుగా నటించిన బంగారు సంకెళ్ళు చిత్రానికి, మూగప్రేమ చిత్రానికి కూడా సహాయ దర్శకుడుగా పని చేశారు.
కృష్ణ, ఎస్.వి.రంగారావు, వాణిశ్రీ ప్రభృతులతో ఫల్గుణా పతాకాన పి.ఏ కామ్రేశ్వరరావు, కె.రాఘవ నిర్మించిన ‘జగత్ కిలాడీలు’ చిత్రంలో నటించే అవకాశం రాఘవ, రంగారావుల ద్వారా లభించింది. రావుగోపాలరావు ఉచ్ఛారణ స్వరం బాగా లేదని పంపిణీదార్లు, ఇతరులు భావించి వేరొకరితో డబ్బింగ్ చెప్పించారు. ఈ అంశంపై ఎస్.వి.ఆర్‌కి రావు గోపాలరావుకి కూడా కొంత బాధ కలిగింది. ‘గండర గండడు’ చిత్రం నుంచి తన పాత్రకి డబ్బింగ్ చెప్పకుంటూ నటించ సాగారు.
బాపు దర్శకత్వంలో ముళ్లపూడి వెంకటరమణ రచనతో రూపొందిన ‘ముత్యాల ముగ్గు’ చిత్రంలోని కాంట్రాక్టర్ పాత్ర పోషణతో. ఆ పాత్ర ద్వారా పలికిన డైలాగ్స్‌తో ఒక్కసారిగా కీర్తిప్రతిష్టలు ఇనుమడించాయి. అంతేకాదు ఆ చిత్రంలోని ఆయన డైలాగ్స్ ఎల్.పి. రికార్డుగా వెలువడి అధికంగా అమ్ముడుపోయి సంచలనం కలిగించాయి. బాపు, రమణ కాంబినేషన్లో రూపొందిన భక్త కన్నప్ప, గోరంతదీపం, మన వూరి పాండవులు, కలియుగ రావణాసూరుడు, త్యాగయ్య, జాకీ, బుల్లెట్ చిత్రాల్లో ప్రత్యేక తరహా పాత్రలే లభించాయి. ఆ పాత్రల ద్వారా పలికిన సంభాషణలు ఎనలేని పేరు తెచ్చాయి.
నిమిత్తమాత్రుడినండయ్యా!
రెండు నెగెటివ్‌లు కలిస్తే పాజిటివ్ అవుతుందని, మైనస్‌ని మైనస్‌తో గుణిస్తే ప్లస్ అవుతుందని ఆల్జీబ్రా లెక్కలు రుజువు చేస్తాయి. అదే విధంగా రెండు ‘రావు’ లు కలిస్తే ఎంత రసా నుభూతి కలిగించవచ్యో రావుగోపాలరావు, తన పేరు ముందుగల ఇంటి పేరు రావుతో పేరు చివర గల రావుతో నిరూపించడం ముత్యాల ముగ్గు చిత్రంలోనే ఆరంభించారు. అప్పటివరకు రావు గోపాల రావు దర్శక నిర్మాతలను వేషాల కోసం సంప్రదిస్తుంటే పేరు వింటూ మంచి రంగస్థలనటుడు కావచ్చు కానీ రెండు సార్లు రావు వున్న ఇతడికి సినిమాలో ఏమీ రావులే. సినిమాలో వేషం ఇచ్చి అనవసరంగా రిస్క్ తీసుకోవడం ఎందుకు అని భావించేవారు. అలాటి వారందరికీ తన సత్తా చూపి కాల్షీట్ల కోసం ఎగబడేటట్టు చేశారు.
ముళ్లపుడి సంభాషణల్లోని చమక్కులని, విరుపులని, వ్యంగ్యాన్ని శ్లేషని, అంతర్లీన హాస్యాన్ని వివిధ స్థాయిల్లో తన ఉచ్ఛారణ ద్వారా వెలిబుచ్చుతూ, బాపు సూచనలతో ఆంగి కాభినయాలతో విజృంభించి ఒక ప్రత్యేక ఒరవడి నెలకొల్పా రు రావు గోపాలరావు. ముత్యాల ముగ్గు చిత్రం తర్వాత సంభాషణా రచయితలు, దర్శకులు కూడా రావు గోపాలరావు పాత్రలపై మరింత శ్రద్ధ చూపడం కూడా ఆయన విజృంభణకు అవధులు లేకుండా చేసింది.
బాపు ముళ్లపూడి కాంబినేషన్లో రూపొందే చిత్రాల్లోని పాత్రల్లోని ప్రత్యేకత గురించి ప్రశ్నించినప్పుడు “ముళ్లపూడి వెంకటరమణ గారండయ్యా ! మహానుభావుడండయ్యా! అస లు పాత్ర స్పష్టిలోనే విలక్షణత చూపిస్తారండయ్యా! దాంతో బాటు మాటలు కూర్చడంలోనూ ప్రత్యేకత కనబరు స్తారండయ్యా! అంతే కాదండయ్యా ఏ హావభావాల్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రకటించాలో కూడా స్క్రీన్‌ప్లేలో పకడ్బందీగా రాసేస్తారండయ్యా! అది చూసి బాపుగారు తన శైలిలో బొమ్మలు గీసేస్తుంటారండయ్యా! చూసి కాదండాయ్యా ఇద్దరూ కలిసే చర్చించుకుంటూ, పోట్లాడుకుంటూ స్క్రిప్ట్‌ని తయారు చేస్తారండయ్యా! చిన్నప్పటి నుంచి వారి స్నేహం, బాల్య స్నేహమన్నమాట. అందువల్ల ఒకరి భావాలు ఒకరికి బాగా తెలుసునండయ్యా! అందుకే పాత్రలకి కాగితాల మీదనే ఇద్దరూ వారి వారి తరహాలో ప్రాణం పోసేస్తారండ య్యా! అందులోది కాస్త అర్థం చేసుకుని చేస్తేనే ఇంత పేరు ప్రతిష్టలు ఆర్టిస్టుల కొస్తుంటే సెంట్‌పెర్సెంట్ చేస్తే ఆ ఆర్టిస్టుల పరిస్థితి ఎలా ఉంటుందో వారిని చూసే ప్రేక్షకుల మనోభావాలు ఎలా వుంటాయో చెప్ప లేమండయ్యా. నిజానికి నూటికి నూరు శాతం అలా చేయగలిగే ఆర్టిస్టులు న్నారా అని కూడా అనిపిస్తుందండయ్యా!” అని చెప్పారు.
తన మాటలను కొనసాగిస్తూ “ఆ ఇద్దరి కాంబినేషన్లో నేను చేసిన పాత్రల విషయంలో నా పాత్ర పోషణ పెద్దగా ఏమీ లేదండయ్యా! అంతా వారే చూసుకునే వారు. నా విగ్రహాన్ని, నా ఉచ్ఛారణని ఉపయోగించేలా చేసే వారండయ్యా. అందువల్లనేనండయ్యా ముత్యాల ముగ్గుతో మొదలెట్టించి భక్త కన్నప్ప. మనవూరి పాండవులు, గోరంత దీపం, స్నేహం, జాకీ, బుల్లెట్ కలియుగ రావణాసురుడు చిత్రాలు నన్నెక్కడో కూర్చోపెట్టాయండయ్యా. వారిద్దరూ కూర్చోబెడితేనే కూర్చు న్నానంతే నండయ్యా… నాదేం లేదు. నేను నిమిత్తమాత్రుడి నండయ్యా” అని వివరించారు. ఇవన్నీ తన కిష్టమైన పాత్రలనే వారు .
“ఇష్టమైన పాత్రలు ఇంకా వున్నాయండయ్యా జగత్ కిలాడీలులోని భయంకర్ పాత్ర, వేటగాడు, ఇదా లోకంలోని రౌడీ పాత్ర కూడా ఇష్టమైనవేనండయ్యా. ఇంకో మాట కూడా వుందండయ్యా! సంతృప్తి అంటారు. కదాండీ శారద లోని బాబాయి పాత్ర, జేబుదొంగలోని నిజాయితీ పోలీసు అధికారి, ఆడంబరాలు అనుబంధాలు, ఊరికి సోగ్గాడులోని తాత పాత్ర, బావా మరదళ్లులో తండ్రి పాత్ర దేవతలో పాత్ర బంగారు బుల్లోడు లోని పాత్ర కూడా నాకు నచ్చిన పాత్ర లేనండయ్యా ఇవి ప్రేక్షకులు కూడా మెచ్చిన పాత్రలేనండ య్యా” అని చెప్పారు.
మగధీరుడు, కొండవీటి రాజా, కిరాయి రౌడీలు ఖైదీ, కటకటాల రుద్రయ్య, జస్టిస్ చౌదరి, గోపాల రావుగారి అమ్మాయి, ఘరానా మొగుడు, దేవాలయం, చండశాసనుడు, బొబ్బిలి పులి, బొబ్బిలి బ్రహ్మన్న, అనుగ్రహం, అల్లరి ప్రియుడు, అభిలాష, యమగోల, కొండవీటి సింహం, సర్దార్ పాపారాయుడు, త్రిశూలం, ఛాలెంజ్ ఇలా ఎన్నో చిత్రాల్లో రావు గోపాల రావు నటన, వాచకం గుర్తు కొస్తూనే వుంటుంది. యాసని, ప్రాసని ఉపయోగిస్తూ వ్యంగ్యాన్ని , శ్లేషని, హాస్యాన్ని, వినోదాన్ని చురకలని తన సంభాషణల ద్వారా జోడిస్తూ ,అందుకు అనుగుణమైన భావాలను, చేతల ద్వారా, ముఖం ద్వారా ప్రకటిస్తూ తన శైలి ప్రత్యేకం అని నిరూపించుకున్నారు రావు గోపాల రావు.
ముత్యాల ముగ్గులోని రావు గోపాల రావు డైలాగ్స్ చాలామందికి కంఠోపాఠమే. ఇంకా అలాంటివి ఎన్నో, కొన్ని మచ్చుకి;
చిరంజీవిని క్లబ్‌లో చూస్తూ “ఓర్నీ తస్సారవలా. చూడు ఎస్పీ మా బలేటోడ్ని తెచ్చావుయ్యా ! మంచి కెపాసిటీ వున్న కేండిడేట్. కళ్లు మూసుకుని ఉద్యోగం యిచ్చేయచ్చు…. మందు – పొందు- బేటా ఓ.కె. నెంబర్ ఒన్ గూండాగా కాస్త రెస్పాన్స్‌బుల్‌గా చూస్తామయ్యా ” అంటారు మాటలు విరుస్తూ .
మరో చిత్రంలో “ ఓరి నీ తస్సారవలా బొడ్డూ ఈడు అల్లూరి సీతారామరాజుకి ఎక్కువ భగత్‌సింగ్‌కి తక్కువ….”
“ఓరి కనకరావు నీకింకా కుర్రతనం పోలేదురా…. నువ్వు కాన్వెంట్‌కి ఎక్కువ కాలేజీకి తక్కువ…..”
వెంకటేశ్‌తో విజేత విక్రమ్‌లో “ నేను నీ ఆతిథ్యాన్ని తీసుకోడానికి రాలేదు… చూడు విక్రమ్! నా కూతురిని ప్రేమ పేరుతో వలలోకి లాక్కున్నావని తెలుసు. ఆస్తి అంతస్తు పరువు ప్రతిష్ట దేనిలోనూ సరి తూగలేని నువ్వు నా అల్లుడివి కావడానికి వీలు లేదు. ఎంత డబ్బు కావాలో చెప్పు…”
అగ్ని పర్వతంలో కూతురిని అప్ప చెప్పిన కృష్ణతో “ ఆగు నాయనా ఎక్కడికెడతావు నీకోసం చుట్టాలొచ్చారు అలా చూడు … ” అని పోలీసులతో అరెస్టు చేయిస్తారు కృతజ్ఞత లేనివానిగా. మరో చిత్రంలో రంగనాధ్‌తో “నేను చచ్చిపోయిన జంతువులనే కొంటున్నా గాని జంతువులను చంపటం లేదు కదా… ” అంటూ తన కొడుకు నూతన్ ప్రసాద్ తో “మనం అవినీతికి తాతలం కదా!…” అంటారు.
జయమాలినితో “నేను ముసలివాణ్ణా! కాదే యువకుడిని, విద్యార్థి నాయకుడుని పారిశ్రామిక వేత్తని, కాంట్రాక్టర్ని, ప్రజాసేవకుడిని , కళా పోషకుడిని ఇంకా ఎన్నెన్నో విషయాలు విశేషాలున్నాయి. అవన్నీ రాత్రికి తీరుబడిగా…”
వేటగాడులో సత్యనారాయణతో “చిన్నప్పుడు బళ్ళెగ్గొట్టి గుర్రబ్బళ్లు ఎక్కి జీళ్లు ఇంకా చిరుతిళ్లు తింటూ పిచ్చుక గూళ్లు కట్టుకుంటూ గుళ్లూ గోపురాలు తిరుగుళ్లు తో… అంటూ మరో రకం ప్రాసలోకివెడతారు.
లక్ష్మీదేవి విష్ణుమూర్తి కాళ్ల దగ్గర కూర్చోడానికి వెనుక వుండే అంతరార్థం గురించి ఒక చిత్రంలో చెప్పింది కూడా వెరైటీనే.
రావు గోపాల రావు అల్లు రామలింగయ్య కాంబినేషన్లో ఎన్ని నిక్షేపాలు బయట పడ్డయో రసజ్ఞులకు తెలుసు. ఒక సినిమాలో “ నేను సమస్యల చక్రవర్తిని. భాషకి, చక్రవర్తిని… చెస్ ఎక్కువ మాట్లాడితే డిక్కిలో కూర్చో బెడతా….. ” అంటారు.ముత్యాల ముగ్గులో “ సెగట్రీ ఈడిని డిక్కిలో తొంగో బెట్టు…” అనే దానికి కొనసాగింపుగా ఇది అల్లు రామలింగయ్య తో మరో చిత్రంలో అన్న మాట.
ఇలా ఎన్నో .. ఎన్నెన్నో….
తొలి దశలో జయప్రకాశ్ నారాయణ సిద్ధాంతాలకు, ఆలోచనలకు ప్రేరణ చెంది ఆ పార్టీ అభిమాని అయ్యారు. తరువాత ఎన్.టి. రామారావు పిలుపుతో తెలుగు దేశంలో చేరి రాజ్యసభ సభ్యునిగా సేవలు అందించారు.
కొందరు స్నేహితులతో కలసి, విడిగాను స్టేషన్ మాస్టర్, లారీ డ్రైవర్, భార్గవరాముడు, వింత దొంగలు చిత్రాలను నిర్మించారు. తెలుగు చిత్ర సీమలో చక్కని నటుడుగా విజృంభిస్తున్న రావు రమేష్ ఈయన పెద్ద కుమారుడు రెండో కొడుకు పేరు క్రాంతి.
‘సందేహాల్రావు వంటి పాత్రలతో బాగా పేరు తెచ్చుకున్నా రావు గోపాలరావుకు నిజ జీవితంలో తరచు అనేక సందేహాలు వస్తూనే వుండేవి. 1994 ఆగస్టు 13న మృతి చెందారు స్వర్గం వుందా ! లేదా ! వుంటే ఎలా వుంటుందనే సందేహంతో.

Image may contain: 1 person, smiling, sunglasses

Posted in Uncategorized | Leave a comment

idi varasa

నా ‘మంచిరోజు ‘కథా సంపుటిలో ఇదీ వరస !! – 4..

కవితలను కాగితాల మీద పెట్టేస్తున్నానుగాని, కథలను వెంటనే కాగితాల
మీద పెట్టడానికి ఆలస్యం జరుగుతోంది. ఈ ఆలస్యం ఇకముందు కొనసాగ
కూడదని ప్రగాఢంగా నాలో నేను అనుకుంటూ మీ ప్రోత్సాహాన్ని త్రికరణశుధ్ధిగా
కోరుకుంటున్నాను.

ప్రకటనతో ప్రారంభమైన ” మంచిరోజు ” మంచిరోజుతో ముగుస్తుంది.
ఈ ప్రచార యుగంలో ఇదేవరస ! ఇదోవరస !! ఇదీవరస !!!

మీ

వి.ఎస్. కేశవరావ్

కేవలం రచయతగా మనుగడ సాగించలేనని తెలిసీ, ప్రభుత్వోద్యాగాన్ని
వదిలేసి, కావలసిన తీరుబడి ఉంటుందని బ్యాంకులో చేరి, అదీ నచ్చక ఏం
చేయాలో తోచక, ప్రైవేటు సంస్ధల్లో ప్రవేశించాను. కొంతకాలానికి అవీ నచ్చ
లేదు. అందుకు కారణం మనిషి దగ్గర మనిషి మాట చెప్పలేక పోవడం, వాస్త
వాలను కప్పిపుచ్చుతూ ఆత్మవంచన చేసుకోలేకపోవడం. అలోచించి అలోచించి
అవకాశం రాగానే జర్నలిజంలోకి దూకాను. అందులో ఈదుతూ ప్రస్తుతం
పత్రికా రచయతగా చిత్రభూమి, ఆదివారం పత్రికల్లో పనిచేస్తున్నాను. తీరుబడి
దొరికితే కవితలు రాయడం, కథలకు ప్లాట్లు ఆలోచించడం ఇదీ నా మిగతా

వ్యాసంగం.

On Monday, January 12, 2015 9:19 PM, kesavarao vadduri <kesavaraovadduri@yahoo.com> wrote:

రణ లేదనే నమ్మకం నాకుంది. శ్రీయుతులు చిలకమర్తి, గురజాడ, శ్రీ శ్రీ,
ముళ్లపూడి వెంకట రమణ, మునిమాణిక్యం నరసిం హారావు, బీనాదేవి ప్రభృ
తుల రచనలు, వారి శైలి, అంతర్గతంగా దాగివున్న హాస్యం ఆస్వాదించడంలో
ఇదీ అని చెప్పుకోలేని ఏదో ఆనందం, పారవశ్యం ఇమిడివుంది. జ్ఞాపకం
తెచ్చుకుంటుంటే క్షణక్షణం సంతోషసాగరంలో ఈదులాడుతూండడం జరుగు
తుంది ఎన్నిసార్లు చదివినా, మళ్లీమళ్లీ చదవాలనే ఉత్సాహం, ఆసక్తి పుట్టుకు
వస్తుందే తప్ప ఏ సమయంలోనూ ఫుల్ స్టాప్ పడడం అనేది జరగదు. నేను
కూడా ఆ స్థాయికి ఎదగాలనే తపన ఉంది. అయితే కేవలం రచయతగా
మనుగడ
సాగించడం ఈ దేశంలో కష్టమైన విషయమే! ఈ మధ్య కేవలం రచయతగా
బ్రతకగలిగే పరిస్థితులు మెల్లిమెల్లిగా ఏర్పడుతున్నాయి. అవి పెరిగి పెద్దవై
రచయతలకు నీడనిస్తే ఇంకా మంచి మంచి రచనలు వెలువడడానికి ఎంతో
ఆస్కారం ఉంది.

Posted in Uncategorized | Leave a comment