శాంతమూర్తి శాంతకుమారి
105 వ జయంతి !
తెలుగు చిత్ర రంగంలో తొలి ప్రేమ జంటగా ఆదర్శ దంపతులుగా నటి శాంతకుమారి దర్శక నిర్మాత (పోలుదాసు పుల్లయ్య )పి. పుల్లయ్య పేరు గడించారు. రెండో జంట భానుమతి, రామకృష్ణ. పెరిగిన కుటుంబ వాతావరణం కారణంగా వెల్లాల సుబ్బమ్మ భర్త పట్ల విధేయురాలుగా వుంటూ ఆదర్శ దంపతులుగా కొనసాగడం విశేషం. సహజ నట గాయనిగా గుర్తింపు పొంది, హీరోయిన్ గా రాణించి కేరక్టర్
ఆర్టిస్ట్ అయి నాటి దక్షిణాది ముఖ్య నటీ నటులందరకీ ‘మమ్మీ ‘ అయ్యారు.
శాంతకుమారి అసలు పేరు వెల్లాల సుబ్బమ్మ. కడప జిల్లా ప్రొద్దుటూరులో మే 17,1920న పుట్టారు. సంగీత నృత్యాల్లో శిక్షణ పొంది, 16వ ఏట మద్రాసు చేరి టీచరుగా 2 రూపాయల జీతంకి చేరారు. ఆకాశవాణి కళాకారిణి అయ్యారు.
దర్శక నిర్మాత పి. వి. దాస్ సుబ్బమ్మ సంగీతం విని, అతి బలవంతంతో కుటుంబ సభ్యులను ఒప్పించి శాంత కుమారిగా పేరు మార్చి శశిరేఖగా 1936లో మాయాబజార్ (శశిరేఖ పరిణయం) సినిమాలో నటింప చేశారు. పి. పుల్లయ్య దర్శకత్వం చేసిన తొలి చారిత్రక చిత్రం సారంగధర (1937)లో చిత్రాంగిగా, మళ్ళీ తెలుగు తమిళ భాషల్లో సారంగధర తీస్తే రాణి రత్నాంగిదేవిగా నటించారు. తొలి సారంగధర లో నటిస్తూ పుల్లయ్యను ప్రేమించి పెళ్లికి అందర్నీ తన పట్టుదలతో ఒప్పించారు. పలు హిట్ చిత్రాలు నిర్మించిన రాగిణి పిక్చర్స్, పద్మశ్రీ ఫిలిమ్స్ సంస్థలు ఈ దంపతులవే.
‘బాలాజీ’ అనే “శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం “(ఏడాది పాటు అడింది ) సినిమాలో శ్రీనివాసు /వెంకటేశ్వరునిగా నటించిన సి. ఎస్. ఆర్.తో పద్మావతిగా, రెండోసారి ఎన్.టి. ఆర్. వెంకటేశ్వరునిగా నటించ, ఆయన తల్లి వకుళాదేవిగా’ వేంకటేశ్వర మహాత్మ్యం ‘ నటించారు. రెండు చిత్రాలకు దర్శక నిర్మాతగా పి. పుల్లయ్య ఘన విజయం సాధించారు. రెండు సార్లు కూడా సినిమా హాళ్ళలో పెట్టిన హుండీలు అత్యధికంగా నిండి పోవడం విశేషం.
రుక్మిణీ కళ్యాణం, పార్వతీ కళ్యాణం, భక్త జయదేవ, మార్కెండేయ , మాయాలోకం, కృష్ణ ప్రేమ మున్నగు చిత్రాల్లో, కొన్ని తమిళ చిత్రాల్లో కథా నాయికగా చేసి,అర్థాంగి సినిమా నుంచి కేరెక్టర్ ఆర్టిస్ట్ అయ్యారు. జయభేరి, ప్రేమ్ నగర్, తల్లా పెళ్ళామా, ప్రాణ మిత్రులు, చిన్ననాటి స్నేహితులు, కొడుకు కోడలు ఇలా పలు చిత్రాలు పేరు తెచ్చాయి.190 తెలుగు,60 తమిళ చిత్రాల్లో, 1 హిందీ డబ్బింగ్ సినిమాలో నటించారు
మంచి గాయని అని తెలిసినా పుల్లయ్య భార్య తో పాడించడం మరిచేవారు. ” ఎన్నాళ్ళని నా కన్నులు కాయగ ఎదురు చూతుర గోపాలా, మోహనరంగా రా రా, ఊదుము కృష్ణా, ఎవరోయి ఎవరోయి, కృష్ణయ్యా కృష్ణయ్యా మమత లెరిగిన నా తండ్రి మనసు తెలిసిన ఓ నాన్నా , చిట్టీ పొట్టీ పాపలూ చిరు చిరు నవ్వుల పువ్వులు… ఇలా ఎన్నో హిట్ సాంగ్స్ ఆమె గళం నుంచి. గుక్క తిప్పుకోకుండా ‘ చల్లని దొరవేరా చందమామా నీ అల్లరి చాలించు చందమామా ‘ ఈమె పాడిన ఒక అద్భుత గీతం. తప్పుడు ఇంగ్లీష్ మాటలతో ‘చిన్ననాటి స్నేహితులు ‘లో హాస్యం పండించారు. ‘ మా బాబే ‘ అని సినిమాల్లో, బయటా ఎంతో ప్రేమ, అభిమానం చూపేవారు.
1999వ సంవత్సరానికి గాను ‘రఘుపతి వెంకయ్య అవార్డు’ను అందుకున్నారు. ఇంకా నటించాలనే కోరిక తోనే 16-1-2006న స్వర్గస్థులయ్యారు.